Tuesday, May 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఆశా-అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలి

ఆశా-అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరించాలి

- Advertisement -

ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
ఐసీడీఎస్‌ను బలోపేతం చేయాలి
ఫిక్స్‌డ్‌ వేతనాలు అమలు చేయాలి :
సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌
రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల క్యాంప్‌ ఆఫీస్‌ల ఎదుట నిరసన
వినతిపత్రాలు అందజేత

నవతెలంగాణ-కాప్రా/మొఫసిల్‌ యంత్రాంగం
ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డిని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ కోరారు. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా సైనిక్‌పురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌, అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ఎదుట ఆశా కార్యకర్తలు, సీఐటీయూ నాయకులు నిరసన తెలిపి వినతిపత్రాలు అందజేశారు.

హైదరాబాద్‌ సైనిక్‌పురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలడుగు భాస్కర్‌ మాట్లాడుతూ.. ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు అందజేస్తున్నట్టు తెలిపారు. ఆశా, అంగన్‌వాడీ వర్కర్లకు ప్రతి నెలా 1న పారితోషికాలు చెల్లించడంతోపాటు రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ భద్రత, రూ.50 లక్షల బీమా, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలు చేయాలని కోరారు. అలాగే పీఆర్సీ ఏరియర్స్‌, సమ్మె కాలం బకాయిలు, పల్స్‌ పోలియో, లెప్రసీ సర్వే, ఎన్నికల విధుల పెండింగ్‌ చెల్లింపులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఐసీడీఎస్‌ను బలోపేతం చేసి అంగన్‌వాడీ కేంద్రాలకు మౌలిక వసతులు కల్పించాలని కోరారు.

అందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ.. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజారోగ్య పరిరక్షణ, బాలల సంరక్షణలో ఆశా, అంగన్‌వాడీ వర్కర్ల సేవలు కీలకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.శ్రీనివాస్‌, ఆశా వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి ఎం.రేవతి కళ్యాణి, నాయకులు లత, కళ్యాణి, అంగన్‌వాడీ యూనియన్‌ జిల్లా కార్యదర్శి బి.శోభారాణి పాల్గొన్నారు.

జిల్లాల్లో..
ఆశావర్కర్లకు నెలకు రూ.18 వేల ఫిక్స్‌డ్‌ వేతనం అమలు చేసి, పెండింగ్‌ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరుతూ నల్లగొండ జిల్లా నకిరేకల్‌ పట్టణంలో సీఐటీయూ నాయకులు, ఆశాలు ప్రభుత్వ విప్‌ వేముల వీరేశంను కలిసి వినతిపత్రం అందజేశారు. నల్లగొండ మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని ఆశాలు కలిసి వినతిపత్రాలను అందజేశారు. వికారాబాద్‌లోని స్పీకర్‌ క్యాంపు ఆఫీస్‌లో గేటుకు మెమోరాండం అంటించి నిరసన తెలిపారు. పరిగిలో సీఐటీయూ జిల్లా నాయకులతో కలిసి ఆశాలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. వివిధ నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు తెలిపి వినతిపత్రాలు అందజేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్‌ క్యాంప్‌ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించి పని భారం తగ్గించాలని, ఇతర సమస్యలు పరిష్కరించే విధంగా స్థానిక ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కృషి చేయాలని డిమాండ్‌ చేశారు.నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండల కేంద్రంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇంటి ముందు ధర్నా నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు ధర్నా చేశారు. వనపర్తి పట్టణంలో డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ చౌరస్తా నుంచి ర్యాలీగా వెళ్లి ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే పీిఏకు వినతి పత్రం అందజేశారు. కొత్తకోట మండల కేంద్రంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నారాయణపేట జిల్లా మక్తల్‌ ఎమ్మెల్యే, మంత్రి డాక్టర్‌ వాకిటి శ్రీహరి నివాసం వద్ద ఆయన పీఏకు వినతిపత్రం అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -