రేవంత్ సర్కార్ పడిపోక తప్పదు : కల్వకుంట్ల కవిత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పూర్తిగా ప్రయివేటుపరం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కుట్రలు పన్నుతున్నదని టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ స్కూళ్ల జోలికొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోక తప్పదని హెచ్చరించారు. గ్రామాల్లోకి కార్పొరేట్ స్కూళ్లకు రెడ్ కార్పేట్ వేసి ఆహ్వానిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల టెండర్లలో గోల్ మాల్ చేసి మెఘా, కేఎంవీ సంస్థలకే సగం పనులు ఇచ్చారని తెలిపారు. విద్యా కమిషన్ రిపోర్ట్ పేరుతో 27 వేల స్కూళ్లను 4 వేలకు కుదించే ప్రయత్నం జరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చర్యను తెలంగాణ రక్షణ సేన మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉందని గుర్తుచేశారు. తాజాగా యంగ్ ఇండియా ఇంట్రిగ్రేడేట్ స్కూల్స్ పేరుతో ఒక్కో స్కూల్ కు రూ.146 కోట్లు ఖర్చు పెట్టనున్నారనీ, అందులో 72 స్కూళ్లకు గానూ సగానికి పైగా మేఘా, కేఎంవీ అనే సంస్థలకే ఇచ్చారని తెలిపారు. ఆ సంస్థలు 5 శాతం ఎక్సెస్ కోట్ చేయటంతో ప్రభుత్వంపై రూ.600 కోట్లకు పైగా భారం పడుతోందని చెప్పారు. 72 స్కూళ్ల కోసం దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తామని చెబుతున్నా… ఇంకా రెండున్నరేండ్లలో ఈ స్కూల్స్ నిర్మాణం పూర్తి అవటం సాధ్యం కాదన్నారు. ఒక్కో స్కూల్ నిర్మాణానికి కనీసం మూడేళ్లకు పైగా పడుతుందని చెప్పారు. రెవెన్యూ డివిజన్ లో స్కూల్ నిర్మిస్తే మళ్లీ విద్యార్థులు వెళ్లేందుకు బస్సుల సౌకర్యం అందుబాటులోకి తేవాల్సి ఉంటుందనీ, ఆ బస్సులను కూడా మెఘా సంస్థకే ఇస్తారని స్పష్టంగా తెలుస్తోందని ఆక్షేపించారు.
బడ్జెట్ స్కూళ్లకు ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. యంగ్ ఇండియా స్కూల్స్ రెండు సంస్థలకే ఇచ్చారంటే స్పష్టంగా టెండర్లలో రింగ్ అయ్యారని తెలిసిపోతోందని తెలిపారు. టెండర్లలో జరిగిన గోల్ మాల్ పై ముఖ్యమంత్రి కచ్చితంగా ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. గుడి ఎంత ముఖ్యమో బడి కూడా అంతే ముఖ్యం. కానీ స్కూల్స్ స్టార్ట్ అయి నెల గడిచినప్పటికీ ఇప్పటికీ యూనిఫామ్స్ ఇవ్వలేదని తెలిపారు.
మొత్తం స్కూళ్లను కుదిస్తే ఉన్న టీచర్లను ఏం చేస్తారు? కొత్తగా టీచర్ల రిక్రూట్ మెంట్ చేయరా? అని ఆమె ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యను ప్రయివేటీకరిస్తామంటే తెలంగాణ రక్షణ సేన ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోదని హెచ్చరించారు. మార్కెట్లో గుడ్డు రేటు రూ.8 ఉంటే మధ్యాహ్న భోజనంలో పెట్టే గుడ్డుకు ఆరు రూపాయలే ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం మూడు రోజులు కాకుండా ఐదు రోజులు గుడ్డు ఇవ్వాలని కోరారు. పిల్లలకు పెడతామన్న బ్రేక్ ఫాస్ట్ పెట్టటం లేదనీ, యూనిఫాం లు ఇవ్వటం లేదన్నారు. ఇంటిగ్రేడేట్ స్కూల్ పేరుతో ఎక్కడో, ఏదో ఊర్లో స్కూల్స్ పెడితే ఆడ పిల్లలు నష్టపోతారనీ, వారి తల్లితండ్రులు దూరంగా ఉండే స్కూళ్లలో పిల్లలను చేర్పించరని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఊర్లలోనే స్కూల్స్ ఉండాలే గ్రామ సర్పంచ్ లు పోరాడాలని పిలుపునిచ్చారు. ఇంటిగ్రేటేడ్ స్కూల్స్ పేరుతో వాటిని ఎప్పటికీ నిర్మిస్తారో తెలియదు గానీ ఉన్న స్కూళ్లను మూసేసే కుట్ర చేస్తున్నారని కవిత ఎద్దేవా చేశారు.
ప్రభుత్వ విద్యను ప్రయివేటీకరించే కుట్ర
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



