Tuesday, July 21, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు చర్యలు చేపట్టాలి

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు చర్యలు చేపట్టాలి

- Advertisement -

పార్లమెంట్‌ ‌సమావేశాల్లో విధివిధానాలు రూపొందించాలి
మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక డిమాండ్‌
ఖైరతాబాద్‌ ‌చౌరస్తాలో ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో

​జనగణన, డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు అవసరమైన చర్యలను ఈ పార్లమెంట్ సమావేశాల్లో చేపట్టాలని మహిళా సంఘాల ఐక్య కార్యాచరణ వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హైదరాబాద్‌‌లోని రాజ్ భవన్, ఖైరతాబాద్ చౌరస్తా వద్ద సోమవారం ఐద్వా, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ, పీఓడబ్ల్యూ 1, పీఓడబ్ల్యూ 2, సీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణ జ్యోతి, పీఓడబ్ల్యూ అధ్యక్షులు పద్మ అధ్యక్షత ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా ఐద్వా జాతీయ నాయకులు టి.జ్యోతి మాట్లాడుతూ.. 2023లో చేసిన చట్టం ‘నారి శక్తి వందన్’ సంస్కృతిలో చెబితే ఎవరికి అర్థమవుతుందని ప్రశ్నించారు. 30 ఏండ్ల పోరాట ఫలితంగానే ఈ 33‌శాతం మహిళా రిజర్వేషన్‌ చట్టం ఏర్పాటైందన్నారు. ఈ చట్టాన్ని అమలు చేస్తే 543 ఎంపీ స్థానాల్లో 180 మంది మహిళలు నేడు పార్లమెంటులో ఉండేవారన్నారు. స్థానిక సంస్థల్లో 33శాతం రిజర్వేషన్‌ ‌కల్పించడం వల్ల మహిళలు ప్రజాప్రతినిధులుగా ప్రతిభావంతమైన పాలన అందిస్తున్నారని చెప్పారు. 2029 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చేలా చూడాలన్నారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. మహిళలకు రిజర్వేషన్ సౌకర్యం దానం కాదని, అది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య హక్కు అని చెప్పారు. మహిళలకు నిర్ణయాధికారంలో తగిన ప్రాతినిధ్యం ఉండాలని 35 ఏండ్లుగా మహిళా ఉద్యమాలు, పోరాటాలు చేయడం వల్ల మహిళా రిజర్వేషన్ చట్టమైందని గుర్తు చేశారు. చట్టమై మూడేండ్లయినా అమలు చేయకుండా కేంద్రంలోని బీజేపీ మహిళలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు.

పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షులు అనసూయ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా మహిళల మీద వ్యవస్థీకృతంగా జరుగుతున్న హింస, కుటుంబ హింస, మహిళలు, పిల్లల అక్రమ రవాణాను అరికట్టంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ఆయా చట్టాల అమలు, విచారణ, తీర్పుల్లో నిర్లక్ష్యం కనబడుతున్నదన్నారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం తగినంత లేకపోవడం వల్ల చట్టాల రూపకల్పనలో పితృస్వామిక భావజాలాన్ని ఎదిరించలేకపోతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మహిళల పట్ల గౌరవం ఉంటే ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ల చట్టానికి విధివిధానాల్ని రూపొందించి సత్వరమే అమల్లోకి తేవాలని డిమాండ్‌ ‌చేశారు.

ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఫెమీదా బేగం, ప్రేమ్ పదాని మాట్లాడుతూ.. మహిళలు ఓటర్లు మాత్రమే కాదనీ, దేశ నిర్మాణంలో సమాన భాగస్వాములనీ అన్నారు. పీఓడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి స్వరూప మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్చేసిందని, కార్మిక చట్టాలను తీసేసి లేబర్‌ కోడ్లను తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అనేక చట్టాలు, ప్రజల మద్దతు లేని బిల్లుల విషయంలో పార్లమెంట్ లో ప్రతిపక్షాలు నిరసనగా వాకౌట్ చేసినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా ఆమోదింప జేసుకుంటోందని తెలిపారు.
మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శులు కెఎన్.ఆశాలత, బుగ్గవీటి సరళ, రాష్ట్ర కోశాధికారి మాచర్ల భారతి, రాష్ట్ర సహాయకార్యదర్యులు బండి పద్మ, కె.నాగలక్ష్మి, బట్టుపల్లి అనూరథ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎమ్.వినోద, పి.శశికళ, వై.వరలక్ష్మి, షబానా బేగం, రాష్ట్ర కమిటీ సభ్యులు లక్ష్మమ్మ, ఎ.పద్మ, షబానా బేగం, స్వరూప, మెరుగు రమణ, మంగ, సులోచన, మస్క్ అరుణ, లిలావతి, విజయ, జ్యోతి, కవిత, సంధ్య పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -