Tuesday, July 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంలైంగిక వేధింపుల ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్‌ అధికారి సస్పెండ్‌

లైంగిక వేధింపుల ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్‌ అధికారి సస్పెండ్‌

- Advertisement -

ఆత్మహత్యాయత్నం చేసిన ఐపీఎస్‌
నాకు ఆమెతో సన్నిహిత సంబంధాలున్నాయి
నన్ను కుట్రపూరితంగా ఇరికిరించారు : సూసైడ్‌ నోట్‌లో ఉదయ్‌ కృష్ణారెడ్డి
ప్రతిష్టాకరమైన ఎన్‌పీఏలో ఈ ఘటన జరగడంపై ఎంహెచ్‌ఏ ఆరా
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి

సహచర ఐపీఎస్‌ అధికారిణిపై లైంగికదాడి జరిపిన ఆరోపణలపై ట్రైనీ ఐపీఎస్‌ అధికారి ఉదరు కృష్ణారెడ్డి సస్పెండ్‌ అయ్యారు. ఈయనను కేంద్ర డీఓపీటీ మంత్రిత్వ శాఖ సస్పెండ్‌ చేస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. శివరాంపల్లిలోని ప్రతిష్టాత్మక సర్ధార్‌ వల్లభభారు పటేల్‌ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న ఉదరు కృష్ణారెడ్డి తన తోటి మహిళా ఐపీఎస్‌ అధికారిపై లైంగికదాడి జరిపినందుకు గానూ స్థానిక అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ విషయమై సమాచారం అందుకున్న డీఓపీటీ విభాగం సీరియస్‌ అయింది. దీనిపై ఎన్‌పీఏ డైరెక్టర్‌తో జరిగిన ఘటనపై వివరాలను తెప్పించుకున్న డీఓపీటీ.. ఉదరు కృష్ణారెడ్డిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది.ఇదిలా ఉంటే తనపై అత్తాపూర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయ్యాక సంజీవరెడ్డి నగర్‌లోని తన సోదరుడి నివాసానికి ఉదరుకృష్ణారెడ్డి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఆయన సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీన్ని గమనించిన సోదరుడు, ఆయన స్నేహితులు ఉదరుకృష్ణారెడ్డిని అపస్మారక స్థితిలో స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చేరాక ఉదరు కృష్ణారెడ్డికి అత్యవసర చికిత్స ప్రారంభించిన డాక్టర్లు.. ఆయనకు వాంతులు చేయించి, బయటపడ్డ పదార్థంలో విషతుల్య పదార్థాలు ఏమైనా ఉన్నాయా అని మొదట పరీక్ష చేశారు. అనంతరం ఉదరు కృష్ణారెడ్డి రక్తం, మూత్రంను పరీక్షలకు పంపారు. ఈ సందర్భంగా ఆస్పత్రి డాక్టర్లు మాట్లాడుతూ.. ఆయన పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నాడనీ, 24 గంటలు గడిస్తేనే ఆయన స్పృహలోకి వస్తాడని భావిస్తున్నామనీ, వాంతింగ్‌ చేసుకున్న పదార్థంలో విషతుల్య పదార్థాలు ఏవీ తమకు తేలలేదని తెలిపారు. మూత్ర, రక్త పరీక్షల రిపోర్టులు వస్తే గానీ ఉదరుకృష్ణారెడ్డి ఏమి తీసుకున్నాడో తేలుతుందని చెప్పారు.
కాగా తన సోదరుడు కానిస్టేబుల్‌ స్థాయి నుంచి కష్టపడి చదివి, ఐపీఎస్‌గా ఎదిగాడనీ, ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని సోదరుడు తెలిపాడు. దీని వెనుక కారణాలను సమగ్రంగా దర్యాప్తు జరిపితే తేలుతుందని అన్నాడు. ఇదిలా ఉంటే.. ఉదరు కృష్ణారెడ్డి రాసిన సూసైడ్‌ నోట్‌ ఒకటి సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నది. తనకు బాధిత మహిళా ఐపీఎస్‌ అధికారితో 2025 జూన్‌ నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆ నోట్‌లో ఉదరు కృష్ణారెడ్డి పేర్కొనట్టుగా ఉంది. అదే విషయాన్ని తాను ఆమె భర్తకు కూడా సమాచారం ఇచ్చినట్టుగా వివరించాడు. తనను ఆమెతో పాటు మరో ఇద్దరు కుట్రపూరితంగా కేసులో ఇరికించారనీ, అందుకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఉదరు కృష్ణారెడ్డి రాసుకున్న లేఖలో ఉంది. ఈ లేఖపై దర్యాప్తు జరుపుతున్న అత్తాపూర్‌ పోలీసులు కూడా సీరియస్‌గా ఆరా తీస్తున్నట్టు తెలిసింది. కాగా దేశంలోనే సివిల్‌ సర్వీస్‌లో ఎంపికైన ఐపీఎస్‌ అధికారులకు శిక్షణనిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో పేరు, ప్రతిష్టలు గడించిన జాతీయ పోలీసు అకాడమీలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై కేంద్ర హౌం మంత్రిత్వ శాఖ సీరియస్‌ అయినట్టు తెలిసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌పీఏ డైరెక్టర్‌ను కేంద్ర హౌం శాఖ ఆదేశించినట్టు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -