కాంటాలు కాక..లారీలు రాక
కొనుగోలు కేంద్రాల్లో తల్లడిల్లుతున్న రైతులు
ఓపిక నశించి పంటను తగలబెట్టి నిరసన
వడ్లు కొనుగోలు చేయాలని రాస్తారోకో
నవతెలంగాణ – నర్సింహులపేట, వనపర్తి, రాయపోల్
అన్నదాత కడుపు మండింది. కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేక రోడ్డెక్కి ఆ పంటనే తగలబెట్టి నిరసన తెలిపే దుస్థితి వచ్చింది. ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొంటారంటూ అధికారుల తీరుపై రైతుల ఆక్రోశం కట్టలు తెంచుకున్నది. మహబూబాబాద్, వనపర్తి, సిద్దిపేట జిల్లాల్లో మంగళవారం రైతులు రోడ్లపై భైటాయించి ధాన్యం బస్తాలకు నిప్పుపెట్టి నిరసన తెలిపారు. గన్నీ సంచులు లేకుండా, కాంటాలు వేయకుండా ఇంకెన్ని రోజులంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని వస్త్రం తండాలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెలలుదాటినా కొనుగోళ్లు చేయడం లేదని రైతులు ఆగ్రహించారు. వచ్చిన బస్తాలు కొందరు రైతులకు ఇచ్చారని, మరికొందరికి ఇవ్వలేదని తెలిపారు. కొనుగోళ్ల విషయంలో జిల్లా యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి కొనుగోలు కేంద్రాలకు లారీలను తరలించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులకు గన్నీ సంచుల కొరత లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు.
బయట వ్యక్తులకు తరలి వెళ్ళిన గన్నీ సంచులను రికవరీ చేసి రైతులకు అందజేయాలని ఆదేశించారు. తనిఖీల్లో కలెక్టర్ వెంట జిల్లా సహకార శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయ్ అధికారి రమేష్, మేనేజర్ నరసింహారావు, తహసిల్దార్ రమేష్ బాబు, ఏవో వినయ్ కుమార్, అర్ఐ అఖిల్, వివిధ శాఖల సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. వనపర్తి జిల్లా రాజపేటలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి 45 రోజులు అవుతున్నా కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్లకు ధాన్యం బస్తాలు ఎత్తి కొత్తకోటకు వెళ్లే రోడ్డుపైకి తీసుకొచ్చారు. కొన్ని ధాన్యం బస్తాలను నడి రోడ్డుపై వేసి నిప్పు పెట్టారు. రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొండి వైఖరిని వీడి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి.. వెనువెంటనే లారీలకు ఎత్తి మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షులు రఘవర్ధన్ రెడ్డి, సర్పంచ్ ఎల్లయ్య, ఉప సర్పంచ్ చిన్నారెడ్డి, మాజీ సర్పంచ్ జయరాములు, నాయకులు సుదర్శన్‌రెడ్డి, మాధవరెడ్డి, రైతులు తిరుపతయ్య, తెలుగు నారాయణ, మెహాన్ రెడ్డి, సత్యా రెడ్డి, శంకర్ రెడ్డి, మహిళా రైతులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని వీరనగర్, తిమ్మక్‌పల్లి గ్రామాల రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. రోజుల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిల్వ ఉంటుందని, ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతుందని ఆగ్రహించి ఐకేపీ ద్వారా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్-చేగుంట, గజ్వేల్-రామాయంపేట ప్రధాన రోడ్లపై రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్క లారీ కూడా రాలేదని.. దాంతో కేంద్రంలో ధాన్యం కుప్పలు తిప్పలుగా పడి ఉందని తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు ఐకేపీ అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకపోయిందన్నారు. కాగా విషయం తెలుసుకొని ఆందోళన జరుగుతున్న ప్రాంతాలకు చేరుకున్న పోలీసులు రైతులతో చర్చించారు. లారీలు తొందరగా వచ్చే విధంగా సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరిస్తామని.. హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.



