వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రైతులు యూరియా వినియోగం తగ్గించి పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. మంగళవారం నిర్వహించిన “రైతునేస్తం” కార్యక్రమంలో పాల్గొని రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని రైతులతో ముఖాముఖి మాట్లాడి, పంటల సాగులో అనుసరించాల్సిన శాస్త్రీయ విధానాలు, భూసారం పెంపు చర్యలు, అధిక ఆదాయం వచ్చే పంటలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పచ్చిరొట్ట, జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలను 50 శాతం సబ్సిడీపై అందజేస్తోందన్నారు. రైతులు వీటిని విస్తృతంగా వినియోగించి భూమిలో సేంద్రియ పదార్థాల శాతాన్ని పెంచాలని సూచించారు. ఈ పంటలను దున్నిపెట్టడం ద్వారా భూమి సారవంతమవడంతో పాటు, రసాయన ఎరువుల అవసరం గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. పచ్చిరొట్ట పంటల వినియోగంతో యూరియా వాడకం తగ్గడమే కాకుండా, యూరియా వాడినప్పటికంటే ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని మంత్రి తెలిపారు. దీని వల్ల రైతుల సాగు ఖర్చులు తగ్గి, భూమి ఆరోగ్యం మెరుగుపడి, దీర్ఘకాలంలో అధిక ఉత్పాదకత సాధ్యమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఎకరాల నల్లబీడు భూములు ఉన్నాయననీ, వాటిలో జిప్సం వినియోగించడం ద్వారా నేల గుణాత్మకత మెరుగుపడి, సాగుకు అనుకూలంగా మారుతుందన్నారు. భూమి సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలు అనుసరించడంలో రైతులు ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మెన్ అన్వేష్ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేంద్ర మోహన్, డైరెక్టర్ డాక్టర్ గోపి, ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా ఇతర అధికారులు పాల్గొన్నారు.
యూరియా తగ్గించి పచ్చిరొట్ట పంటలు సాగు చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



