బర్తరఫా? రాజీనామానా?
నోరుమెదపని పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మౌనంపై పలు అనుమానాలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ వ్యవహారం బీజేపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. కమలనాథులను ఢిపెన్స్‌లో పడేసింది. బీజేపీలో చిచ్చు రగిల్చిందా? పార్టీని నిలువునా చీల్చిందా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఒకప్పుడు దూకుడు రాజకీయాలతో నిత్యం వార్తల్లో నిలిచిన బండి సంజయ్ నాయకత్వం, ఇప్పుడు వివాదాలతో డ్యామేజ్లో పడిందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బండి సంజయ్‌పై వేటు పడనుందనే చర్చ జరుగుతోంది. ఆయన్ను బర్తరఫ్ చేస్తారనీ, తన కుమారుడు చేసిన నిర్వాకానికి నిరసనగా ఆయనే తన పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారమూ జరుగుతున్నది. అయితే ఇప్పటికే బీజేపీకి పార్టీకి జరగాల్సిన నష్టం జరిగిందని పార్టీ అంతర్గత సమావేశాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. మొత్తంగా బండి భగీరథ్, బండి సంజయ్ తండ్రి కొడుకుల చుట్టూ తిరుగుతున్న పోక్సో వివాదం కమలం పార్టీ ఉనికినే ప్రమాదంలో పడేసిందన్న చర్చ జరుగుతున్నది. ఆ పార్టీలో బండి సంజయ్ అంటే గిట్టని నేతలు పండగ చేసుకుం టున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆ పార్టీ కీలక నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బండి సంజయ్ వ్యవహారం పై పెదవి విరుస్తున్నారు. పార్టీ పరువు తీశారని అసహనం వ్యక్తం చేస్తున్నారన్న టాక్ సైతం వినిపిస్తోంది. ప్రధాని మోడీ తెలంగాణకు వచ్చి జోష్ నింపాడానే సంతోషం కొద్ది కాలం కూడా ఆ పార్టీకి మిగల్లేదు. ఆ సభకు మూడు నాలుగు రోజుల ముందు నుంచే బండి భగీరథ్ నిర్వాకం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీసం మోడీ సభతోనైనా ఆ సమస్యను పక్కదారి పట్టించవచ్చనే బీజేపీ చేసిన వ్యూహాత్మకమైన ఆలోచనకు ఈ అంశం దెబ్బకొట్టిందనే భావం వ్యక్తమవుతున్నది. ఈ ఘటన తర్వాత ఒకవర్గం బండి సంజయ్‌కి అనుకూలంగా, మరో వర్గం ప్రతికూలంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నోరుమెదపడం లేదు. ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే భావనలో ఉన్నారు. ఎందుకంటే భగీరథ్‌పై ఫోక్సో మరకలు కనిపిస్తున్న నేపథ్యంలో అటు బండికి మద్దతు ఇవ్వాలేక, అటు వ్యతిరేకించలేక మథన పడుతున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కొన్నేండ్లుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య అంతర్గత కుమ్ములాటలు ఉన్న సంగతి తెలిసిందే, కలిసి ఒకే వేదిక మీద ఉన్నా ఎడమొహం, పెడమొహంగానే ఉంటారు. బండి కుమారుడు మైనర్‌పై లైంగికదాడికి పాల్పడినట్టు ఎఫ్‌ఐఆర్ నమోదు కావడంతో కిషన్‌రెడ్డి ఒక మాట కూడా మాట్లాడకపోవడంతో మధ్య ఉన్న విభేదాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. దీంతో కిషన్‌రెడ్డి అనుచరులు కూడా ఏది జరిగితే అది జరుగుతుందన్న దోరణితో ఉన్నారు. ప్రతి దానికి సంబంధించే డాక్టర్ కె. లక్మణ్ కూడా బండిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇంతకు ముందు రాష్ట్ర బీజేపీ ఇన్‌ఛార్జీగా ఉన్న మంత్రి శ్రీనివాస్‌తోనూ బండి సంజయ్‌కి తీవ్ర విభేదాలు ఉన్నట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. అందుకే ఆయన్ను అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జీల బాధ్యతల నుంచి తప్పించారని వినికిడి. ఈ క్రమంలో బండి సంజయ్ రాజీనామా చేయాలనే డిమాండ్‌కు వీరు మౌనంగా ఉంటూనే మద్దతు ఇస్తున్నట్టు పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. పార్టీలో పెరుగుతున్న రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. బండి సంజయ్‌కుమార్‌ను మంత్రి వర్గం నుంచి తప్పించి ఎంపీ ఈటల రాజేందర్ లేదా ఎంపీ అర్వింద్‌కుమార్‌కు అప్పగిస్తారనే చర్చ మొదలైంది. ఇదే క్రమంలో బండికి అనుకూలంగా వర్గం కూడా బలమైన వాదనలు వినిపిస్తోంది. బండి సంజయ్ కుమార్‌కు, భగీరథ్ చేసిన తప్పుడు పనికి ఏం సంబంధం అని ప్రశ్నిస్తున్నారు. కుమారుడు చేసిన పనికి తండ్రికి శిక్ష వేస్తారా? అని ఆయన అనుచరులు సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున్న ప్రచారం చేస్తున్నారు. ఈ ఘటన విషయంలో పార్టీ ఇప్పటివరకు ఒక లైన్ తీసుకోలేని దుస్థితిలో ఉన్నది. దీనిపై చాలా మంది నాయకులు వ్యక్తగత అభిప్రాయాలను చెబుతున్నారు. ఏమైనప్పటికీ పాము తన పిల్లలను తానే తిన్నట్టుగా.. ఆ పార్టీలో నేతల వ్యవహారం రాజకీయంగా మైలేజ్ తీసుకురా వడమేమో కానీ ఇప్పుడు వారి గోతులు వారే తవ్వుకునునే పరిస్థితులు దాపరించాయన్న చర్చ నేతల్లో సాగుతుంది. సొంత పార్టీ నేతలే సైలెంట్ మోడ్ లోకి వెళ్లడం, కీలక నాయకులు స్పందించకుండా దూరం పాటించడం, ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఒకప్పుడు దూకుడు రాజకీయాలతో నిత్యం వార్తల్లో నిలిచిన బండి సంజయ్ నాయకత్వం, ఇప్పుడు వివాదాలతో డ్యామేజ్ లో పడిందనే చర్చ జరుగుతోంది. సొంత పార్టీ నేతలే సైలెంట్ మోడ్ లోకి వెళ్లడం, కీలక నాయకులు స్పందించకుండా దూరం పాటించడం, ఇప్పుడు మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.
బండి భవిష్యత్ ఏంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



