Thursday, May 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుసమస్యలకు దోపిడీ వర్గాలే కారణం

సమస్యలకు దోపిడీ వర్గాలే కారణం

- Advertisement -

పార్టీలు, జెండాలు వేరైనా వారివి అవే విధానాలు
సమాజంలో ప్ర‌శ్నించే గుణం పెర‌గాలి.. మార్పు రావాలి
దోపిడీ ఉన్నంత కాలం తిరుగుబాటు తప్పదు
అసమానతలు లేని సమాజం కోసం పోరాడ‌దాం
అదే సుందరయ్యకు నిజమైన నివాళి : వర్థంతి సభలో సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
స‌మాజంలోని అన్ని రకాల సమస్యలకు దోపిడీ వర్గాలే కారణమని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాజకీయ పార్టీలు, జెండాలు వేరైనా ఆయా వ‌ర్గాల‌న్నీ అవే విధానాల‌ను కొన‌సాగిస్తాయ‌ని ఆయ‌న తెలిపారు. అన్ని రకాల అసమానతలకు అవే మూలమని చెప్పారు. అందువ‌ల్ల సమాజంలో మార్పు రావాలనీ, దోపిడీ విధానాలను ప్రశ్నించాలని ఆకాంక్షించారు. సమాజంలో దోపిడీ ఉన్నంత కాలం ఎర్రజెండా తిరగబడుతూనే ఉంటుందని హెచ్చరించారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కమ్యూనిస్టు ప్రభుత్వాలు లేకపోయినా, తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎంపీలు లేకున్నా శ్రామికుల కోసం ప్రాణత్యాగాలు చేసే వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. అసమానతలు లేని సమాజాన్ని స్థాపించేంత‌వ‌ర‌కు తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. అదే పుచ్చలపల్లి సుందరయ్యకు ఇచ్చే నిజమైన నివాళి అని తెలిపారు. క‌మ్యూనిస్టు అగ్ర‌నేత‌, స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుడు పుచ్చ‌ల‌ప‌ల్లి సుంద‌ర‌య్య 41వ వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకుని బుధవారం హైద‌రాబాద్‌లోని గచ్చిబౌలి ఎస్వీకేలో స‌భ‌ను నిర్వ‌హించారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇన్‌ఛార్జి పి.ప్ర‌భాక‌ర్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన ఈ స‌భ‌కు జాన్ వెస్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోపిడీ, అసమానతలు లేని సమాజం కోసం, కుల వివక్షకు వ్యతిరేకంగా, వ్యవసాయ కూలీల కోసం సుందరయ్య పోరాడార‌ని గుర్తుచేశారు. నిజాం పాలనలో వెట్టిచాకిరికి, మహిళలపై దాడులకు, దొరలకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఆయ‌న నాయకత్వం వహించారని తెలిపారు. త‌ద్వ‌రా మూడు వేల గ్రామాల్లో ప్రజా రాజ్యాలను నెలకొల్పారనీ, 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారని చెప్పారు. సామాన్యులను సంఘటితం చేసి దొరలను పట్టణాలకు తరిమికొట్టారనీ, పార్లమెంటులోనూ, శ్రామిక వర్గ పోరాటంలోనూ, కమ్యూనిస్టు పార్టీని దేశవ్యాప్తంగా విస్తరించడంలోనూ సుందరయ్య కీల‌క పాత్ర పోషించార‌ని గుర్తు చేశారు. ఆయ‌న ఆశ‌యాలైన లౌకికవాదం, ప్రజాస్వామ్యం, శ్రామిక వ‌ర్గాల హ‌క్కుల ర‌క్ష‌ణ‌, పేద – ధనిక, స్త్రీ – పురుష తదితర అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

దోపిడీ వర్గాల మోసపూరితమైన మాటలకు మోసపోయి వారికే ఓటేసి, అసమానతలకు కారణమైన ఆ దోపిడీ వర్గాలనే అడిగే పరిస్థితి వచ్చిందని జాన్ వెస్లీ ఈ సంద‌ర్భంగా ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్రజలు మతం, కులం, పార్టీల పేరుతో అనైక్యంగా ఉన్నంత కాలం దోపిడీ కొనసాగుతూనే ఉంటుంద‌ని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఓడిపోవచ్చు. పశ్చిమ బెంగాల్లో ఇప్పట్లో ఎదిగే పరిస్థితి కనిపించకపోవచ్చు. త్రిపురలో గతంలో పాలన చేసి ఉండొచ్చు.. తెలంగాణలో ఎమ్మెల్యేలు లేకపోవచ్చు. కానీ వేలాది మంది నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు, శ్రామిక వర్గాలను సంఘటితం చేసేందుకు, సమ సమాజం తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని దోపిడీ వర్గాలను హెచ్చరించారు.

ఆదర్శ జీవి సుందరయ్య
-పి.ప్రభాకర్

సుంద‌ర‌య్య ఆదర్శ జీవి, మహనీయుడు, కమ్యూనిస్టు గాంధీ అని ప్ర‌భాక‌ర్ నివాళుల‌ర్పించారు. నేడు ఏ పార్టీలో ఎవరు ఎంత కాలం ఉంటారో తెలియని పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానించారు. కానీ సుందరయ్య చనిపోయేంత వరకు కమ్యూనిస్టుగా బతికారని గుర్తుచేశారు. ఆయ‌న వ్యక్తిత్వం, నిస్వార్థ్యం, ప్రజలకు చేసిన సేవలు నిరంతరం స్మ‌ర‌ణీయాల‌ని పేర్కొన్నారు. కులం పేరుతో మనుషుల గుర్తింపును చిన్నప్పుడే వ్యతిరేకించిన సుంద‌ర‌య్య ఆదర్శంగా నిలిచారని తెలిపారు. ఆయ‌న ఆనాడే కులాంతర వివాహం చేసుకున్నారని గుర్తు చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యేగా, సీపీఐ (ఎం) ప్రధాన కార్యదర్శిగా అనేక పదవుల్లో ఉన్నప్పటికీ ఏనాడూ నిరాడంబరతను వ‌దిలిపెట్ట‌లేద‌ని కొనియాడారు. అందుకుభిన్నంగా ఇంతకాలం అన్నింటినీ అనుభ‌వించిన ప్ర‌ధాని మోడీ… ఖర్చులు తగ్గించుకోవాలంటూ ముఖ్య‌మంత్రుల‌కు, ప్ర‌జ‌ల‌కు సూచిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు. దేశంలో కమ్యూనిస్టులు ఎక్కడున్నారంటూ కొంద‌రు ప్రశ్నిస్తున్నారనీ, కానీ కమ్యూనిస్టులే లేకుంటే దేశం ఎలా ఉండేదో చెప్పాలని ప్రశ్నించారు. గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీని డిజిటలైజేషన్ చేస్తున్నామనీ, అందరూ ఉచితంగా పుస్తకాలు చదుకోవచ్చని తెలిపారు. సమీప ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ట్యూషన్లు చెబుతున్నామనీ, ఆయా సేవలను మ‌రింత‌గా విస్త‌రిస్తామ‌ని వివ‌రించారు. బాలోత్సవ్ నిర్వహించి పిల్లల్లో కళలలను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. పేదలకు ఏ కష్టమొచ్చినా ఎస్వీకే అండగా నిలబడుతుంద‌ని భ‌రోసానిచ్చారు.

సభలో సీపీఐ (ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారనీ, అవే పాలకవర్గాలను గద్దె దించుతాయని హెచ్చరించారు. టీఎస్ యూటీఎఫ్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వెంకటప్పయ్య మాట్లాడుతూ దేశంలో స్వేచ్ఛ కోసం పోరాడాలంటూ పిలుపునిచ్చారు. దేశాన్ని ప్రేమించడమంటే … అనే గీతాన్ని ఆలపించి పాలకవర్గాల నైజాన్ని ఎండగట్టారు. అంతకు ముందు ఎస్వీకే, త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ కళాకారులు భరతమాత ముద్దు బిడ్డ సుందరయ్య… అనే నృత్య ప్రదర్శననిచ్చారు. సుందరయ్య జీవితం ఆధారంగా మరో నృత్యాన్ని ప్రదర్శించారు. బషీర్ బృందం దేశం కథ పేరుతో ప్రశ్న ఆవశ్యకతను తెలుపుతూ ప్రదర్శించిన నాటిక ఆకట్టుకుంది. సమాజంలోని వివిధ త‌ర‌గ‌తులను పాలకవర్గాలు పోలీసులతో అణచివేస్తున్నతీరును అది కళ్ళకు కట్టింది. ఈ సంద‌ర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం సిబ్బందికి వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ రంగారెడ్డి జిల్లా నాయకులు జగదీశ్, శోభన్, శేరిలింగంపల్లి నాయకులు కృష్ణ, గచ్చిబౌలి జేవీవీ నాయకులు శ్రీనివాసరావు, ఎస్వీకే బాధ్యులు విజయ కుమార్,అనిల్, రవీందర్, మంజుల, పీఎన్ఎం రాష్ట్ర నాయకులు బషీర్. పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -