Thursday, May 21, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅమెరికా నుంచి క్యూబాను రక్షించుకోవాలి

అమెరికా నుంచి క్యూబాను రక్షించుకోవాలి

- Advertisement -

​తిండిగింజలు మొదలుకొని చమురు నిక్షేపాల దాకా నిర్బంధమే
ఉచిత విద్య, వైద్యంలో 
ప్రపంచానికే క్యూబా ఆదర్శం
సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యం పెరగాలి
యుద్ధం వల్లే దేశ ప్రజలపై భారాలు : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అరుణ్‌కుమార్‌
మహబూబ్‌నగర్‌లో 
పార్టీ విస్తృతస్థాయి సమావేశం

నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి
అమెరికా అష్టదిగ్బంధనం నుంచి క్యూబాను రక్షించుకోవాలని, తిండిగింజల నుంచి చమురు నిక్షేపాల దాకా ఆ దేశానికి అవసరమైన ప్రతి అంశంపైనా నిర్బంధం కొనసాగుతోందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు అరుణ్‌కుమార్‌ తెలిపారు. క్యూబాపై 1962 నుంచి ఆంక్షలు కొనసాగిస్తూ అమెరికా అక్కసు వెల్లగక్కుతోందని అన్నారు. క్యూబాలోని సోషలిస్టు వ్యవస్థను అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ టార్గెట్‌ చేస్తున్నారని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రం మెట్టుగడ్డలోని అరుంధతి కార్యాలయంలో బుధవారం సీపీఐ(ఎం) జిల్లా విస్తృత స్థాయి సమావేశం కిల్లె గోపాల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా ఉచిత వైద్యం, విద్య క్యూబాలో కొనసాగుతోందని తెలిపారు. క్యూబా విధానాలతో అమెరికా యువత ప్రభావితం కావడాన్ని తట్టుకోలేక ట్రంప్‌ ఆ దేశంపై విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని అన్నారు. క్యూబాకు సరుకులు అమ్మరాదు.. అక్కడివి కొనరాదన్న ఆంక్షలు పెట్టి ఆ దేశంపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సహజ వనరులు కూడా వాడుకోకుండా అమెరికా దిగ్బంధనం కొనసాగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. 1990లో రష్యాలో సోవియట్‌ యూనియన్‌ కూలిపోయిన తర్వాత క్యూబాకు సహకారం నిలచిపోయిందని, అప్పటి నుంచి చైనా క్యూబాను ఆదుకుంటోందని తెలిపారు.

సీపీఐ(ఎం) జాతీయ కార్యదర్శిగా ఇఎంఎస్‌ తర్వాత సూర్జిత్‌సింగ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత క్యూబా సంఘీభావ కమిటీ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ఈ కమిటీ ద్వారా పిడికెడు బియ్యం క్యూబా ప్రజలకు ఇవ్వాలని పిలుపునిస్తే.. భారత దేశవ్యాప్తంగా 10వేల టన్నుల బియ్యం, 10వేల టన్నుల గోధుమలు సమకూరాయని చెప్పారు. క్యూబాలో యూకేజీ నుంచి ఎంతటి ఉన్నత చదవులు అయినా ఉచితమేనన్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ అయిన తర్వాత 243 షరతులు పెట్టాడని అన్నారు. దానిపై ఐక్యరాజ్య సమితి సైతం అక్షేపణ చెప్పిందన్నారు. క్యూబా దగ్గర డ్రోన్‌ కెమెరాలు ఉన్నాయని చెబుతూ.. అమెరికా 845 చోట్ల తన సైనిక స్థావరాలు ఏర్పాటు చేసిందన్నారు. విద్యుత్‌ కోతలు విధిస్తూ.. ఆస్పత్రులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అమెరికా క్యూబాపై ఎన్ని నిర్బంధాలు పెట్టినా సోషలిస్టు సమాజాన్ని ఆ ప్రజలు కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.

ప్రాణ త్యాగాలకైనా వెనుకాడం.. క్యూబాను రక్షించుకుంటామని ఆ దేశ ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇప్పుడిప్పుడే క్యూబాలో విద్యుత్‌, ఆహారం విషయంలో మెరుగుదల సాధించిందని అన్నారు. సామ్రాజ్యవాద వ్యతిరేక శక్తులంతా ఏకం కావడం ద్వారా అమెరికాను ఒంటరి చేయాలని, ముఖ్యంగా క్యూబాలాంటి సోషలిస్టు దేశాలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మన ప్రధాని మోడీ ప్రజలు మాత్రమే పొదుపు చర్యలు చెబుతున్నారని, అదాని, అంబానీలు పెట్టే ఖర్చులపై నియంత్రణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. యుద్ధ ప్రభావం మన దేశంపై పడటం వెనుక బీజేపీ పాత్ర ఉందని, అమెరికా యుద్ధనీతిని ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. గ్యాస్‌, పెట్రోల్‌ వంటి ధరలు పెరిగిపోతున్నాయని, వాటి కొరత ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మహబూబ్‌నగర్‌ జిల్లా కార్యదర్శి ఎ.రాములు, కార్యదర్శివర్గ సభ్యులు నల్లవెల్లి కురుమూర్తి, నాయకులు చంద్రకాంత్‌, కురుమూర్తి, కడియాల మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -