ఎండదెబ్బకు అట్టుడుకుతున్న తెలంగాణ
20 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు
ఈనెల 25 వరకు వడగాలులు వీస్తాయన్న వాతావరణశాఖ
మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని ప్రజలకు సూచన
హైదరాబాద్ : రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. భానుడి సెగతో అట్టుడుకుతోంది. అధిక వేడితో కూడిన వడగాలులకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక వేడిగాలులకు బయటకు రాలేక నానా తంటాలు పడుతున్నారు. గురువారం రాష్ట్రంలోని 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైనే నమోదయ్యాయి. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు. మరోప క్క ఈ వడగాలులు ఈనెల 25 వరకు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
పలుచోట్ల పదేండ్ల రికార్డులు దాటేసి
సూర్యుడి ఉగ్రరూపంతో పలుచోట్ల గత పదేండ్ల మే నెల రికార్డులు బద్దలయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2019 మే 24, 29, 30 తేదీల్లో అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు 46.3 డిగ్రీలుండగా బుధవారం దానిని అధిగమించి దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే హనుమకొండలో పదేండ్ల రికార్డు 2017 మే 22, 23 తేదీల్లో 45 డిగ్రీలుంటే తాజాగా 46.4 డిగ్రీలతో ఊహించని కొత్త రికార్డు నమోదైంది. కుమురం భీం ఆసిఫాబాద్, జనగామ జిల్లాల్లో తీవ్ర వడగాలులు, ఇతర జిల్లాల్లో వడగాలులు వీచినట్టు హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్‌లో 46.5, హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలో 46.4, కరీంనగర్ జిల్లా చొప్పదండిలో 46.4 డిగ్రీల రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవ్వడం కలవరపాటు పెడుతోంది. మొత్తం 33 జిల్లాల్లోనూ 40.5 డిగ్రీలకన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ ఎండల ధాటికి జనం అల్లాడిపోతున్నారు. రైతులు, కూలీల పరిస్థితి మరింత దయనీ యంగా మారింది. వారికి పని స్థలాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మూగజీవాల పరిస్థితి చెప్పనవసరం లేదు.
ముందస్తు నైరుతి రుతుపవనాల రాకతో ఉపశమనం
ఎండల వేడి పెరిగినా నైరుతి రుతుపవనాల రాక ఆశాజనకంగా ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. రాబోయే 3, 4 రోజుల్లో తూర్పు, మధ్య బంగాళాఖాతంలోకి ఇవి వేగంగా ప్రవేశించే అవకాశాలున్నట్టు పేర్కొంది. మరోవైపు భూమికి 900 మీటర్ల ఎత్తులో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఉత్తర తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడినట్టు తెలిపింది. దీనికారణంగా తెలంగాణలో అక్కడక్కడ గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశాలు ఉన్నట్టు వివరించింది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మధ్నాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదు.
రోజూ తగినంత ఓఆర్ఎస్, మజ్జిగ, నిమ్మరసం, నీరు తాగాలి.
బయటకు వెళ్లేటప్పుడు తలకు టోపీ, టవల్ లాంటివి ధరించాలి.
ఆయిల్, మసాలా ఫుడ్స్ తినడం చాలా వరకు తగ్గించాలి.
కీర దోస, పెరుగు, పుచ్చకాయ వంటి శరీరాన్ని చల్లబరిచేవి తినాలి.
వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి.
పిల్లలకు జ్వరం, వాంతులు, దద్దుర్లు, విరేచనాలు వంటివి వస్తే వెంటనే ఆస్ప్రతికి తీసుకెళ్లాలి.
డీహైడ్రేషన్ వల్ల చిన్న పిల్లలకు గంటల తరబడి మూత్రం రాకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి సమస్యలు వస్తాయి. వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
ఆల్కహాల్, టీ, కాఫీ, శీతల పానీయాలు డీహైడ్రేషన్కు దారితీస్తాయి. వాటికి దూరంగా ఉండటం మంచిది.
ఈ లక్షణాలు ఉంటే ఆస్పత్రికి తప్పక వెళ్లాలి :
శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం.
తల తిప్పినట్లు అనిపించడం.
వాంతులు చేసుకోవడం.
గుండె వేగంగా కొట్టుకోవడం.
ఉన్నట్టుండి అపస్మారక స్థితికి చేరుకోవడం.



