కార్మికుల పనితీరును పర్యవేక్షించే ఏఐ
ఉద్యోగాలకు ఎసరు పెట్టే సాంకేతిక విప్లవం
ఏఐ డేటా సాయంతో కార్మికుల వేలితో వారి కళ్లనే పొడుస్తున్న బడా సంస్థలు
న్యూఢిల్లీ : ‘కత్తి’ బహుళ ప్రయోజనకారి. కూరలు తరగొచ్చు. హత్యలూ చేయోచ్చు. మనిషి మానసిక ప్రవర్తన ఆధారంగానే దాని వినియోగం ఉంటుంది. ఇప్పుడు కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) పరిస్థితి కూడా అలాంటిదే. ఈ సాంకేతిక విప్లవంతో ఉపాధి అవకాశాలను సృష్టించొచ్చు. వద్దనుకుంటే ఉన్న ఉద్యోగుల సంఖ్యను కుదించుకోనూ వచ్చు. ఉద్యోగం ఊడితే నిరుద్యోగిగా మారి ‘కాక్రోచ్ జనతాపార్టీ’లోనూ చేరొచ్చు. సహజంగా కార్పొరేట్లు, పెట్టుబడిదారులు తమ లాభాల కోసమే సాంకేతికతను అభివృద్ధి చేస్తుంటారు. మానవ ప్రమేయాన్ని తగ్గించి, యంత్రాలకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇప్పుడు ఆవిషృతమౌతున్న ఏఐ కూడా ఆ కోవలోదే. చిత్రంగా ఆ ఏఐకి అవసరమైన ముడి సరుకును రేపటికి కొలువును కోల్పోబోయే ఉద్యోగితోనే సమకూర్చేలా విధుల్ని డిజైన్ చేస్తుండటం ఇప్పటి కార్పొరేట్ వర్కింగ్ స్టైల్. ఇవ వివరాల్లోకి వెళ్తే… మనం చేసే పనే మనపై గూఢచర్యం చేస్తుందంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అదే జరుగుతోంది. కార్మికుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టగానే ఏఐ ద్వారా మన పని, జీవనశైలి, ఇతర ఉద్యోగుల సహకారం, వస్తు ఉత్పత్తిలో అనుసరిస్తున్న సమిష్టి తత్వం వంటి అన్నింటినీ ‘ఏఐ’ ద్వారా గ్రాఫింగ్ చేసి, ఆ సమాచారం ఆధారంగా రోబోలకు శిక్షణ ఇస్తారు. ఇటీవల సోషల్ మీడియాలో తెల్లని తలపాగాలు ధరించిన వస్త్ర కార్మికులకు సంబంధించిన ఓ వింత వీడియోను చూస్తుంటే ఈ విషయాలను నమ్మి తీరాల్సిందే. కార్మికులు, ఉద్యో గులు చేసే పనికి సంబంధించిన డేటా ఏఐ, రోబోట్లకు ఏ విధంగా ఉపయోగపడుతోందో ఆ వీడియోను చూస్తే తెలుస్తుంది.
పనితీరును పసిగట్టే కెమేరా పరికరం
స్క్రోల్ పోర్టల్ కథనం ప్రకారం… గురుగ్రామ్‌లో పెర్ల్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అనే గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ కర్మాగారంలో పని చేసే కార్మికులను కెమేరాతో అనుసంధానించిన ఓ పరికరాన్ని నుదిటిపై ధరించాలని చెప్తున్నారు. ఆ వస్ర్త పరిశ్రమలో కార్మికులు ఎలా కదలాలో, వస్త్రాలు ఎలా కుట్టాలో, ఒకరితో ఒకరు ఎలా వ్యవహరించాలో నేర్పడానికి ఏఐ కంపెనీలకు ఈ పరికరాలు సహాయపడతాయి. ఉత్పాదకతను పర్యవేక్షించడానికి, కార్మికుల పని విధానాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడే ఈ పరికరాలను ధరించాల్సిందిగా యాజమాన్యం ఉద్యోగులను ఆదేశిస్తున్నది. అయితే ఆ పరికరాన్ని రోజుల తరబడి అదే పనిగా ఉపయోగించిన కొందరు కార్మికులు అసౌకర్యానికి గురయ్యారు. పరికరంలో అమర్చే బ్యాటరీల నుంచి వెలువడే వేడి వల్ల వారి శారీరక, మానసిక ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ హార్డ్‌వేర్ పరికరం ఎగోలాబ్.ఏఐ అనే స్టార్టప్‌కు చెందినది. ఈ సంస్థ తనను తాను ఓ పెద్ద ‘ఫస్ట్’ పర్సన్ పీఓవీ డేటా అగ్రిగేటర్’గా చెప్పుకుంటుంది. ఇది తేలికగా ఉండే కెమేరాలను ఉపయోగించి కార్మికుడి దృష్టి కోణం నుంచి వీడియో క్లిప్పులను రికార్డ్ చేస్తుంది. దీనినే ‘ఇగోసెంట్రిక్ డేటా’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ విజన్‌పై పనిచేస్తున్న ఏఐ, రోబోటిక్ సంస్థల కోసం ఈ క్లిప్పులను డేటాసెట్లుగా ప్రాసెస్ చేయవచ్చు. ఆ తర్వాత ఈ డేటాను ఫిగర్ ఏఐ, టెస్లా, బోస్టన్ డైనమిక్స్ అనే సంస్థలకు అందజేస్తారు.
ఏఐ కంపెనీలకు ఈ డేటా ఎందుకు?
మానవుల ప్రవర్తన నుంచి ఏఐ వ్యవస్థలు, రోబోట్‌లు డేటాసెట్ల ఆధారంగా తమకు కావాల్సినవి నేర్చుకుంటాయనీ, శిక్షణ పొందుతాయని నిపుణులు చెప్తున్నారు. ఉదాహరణకు వస్త్రాలు ఎలా కుడతారో, వస్తువులను ఎలా తీసుకుంటారో, చేతులను ఎలా కదుపుతారో, ఒకరితో ఒకరు ఎలా సమన్వయం చేసుకుంటారో ఫ్యాక్టరీల కోసం రూపొందించిన రోబోట్‌లు నేర్చుకుంటాయి. గతంలో మెటా సంస్థ తన ఉద్యోగులు ఎలా పనిచేస్తారో తెలుసుకోవడానికి వారి కంప్యూటర్లను ట్రాక్ చేసి, ఉద్యోగుల మౌస్‌క్లిక్‌లు, టైపింగ్ శైలి, కీస్ట్రోక్‌లపై కూడా నిఘా ఉంచింది. ఆ తర్వాత ‘లే ఆఫ్’ల పేరుతో వందలమంది ఉద్యోగులను రాత్రికి రాత్రే తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా ఏఐ సంస్థలు ఇప్పుడు కంపెనీలు, ఫ్యాక్టరీల డేటా కోసం ముమ్మరంగా అన్వేషిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తమ ఉద్యోగాలను ఊడబీకే ఏఐకి ఉద్యోగులే శిక్షణ ఇస్తుండటం గమనార్హం!



