రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య ఫెవికాల్ బంధం
అధికారంలోకి వస్తామనే నమ్మకముంటే
అసెంబ్లీని రద్దు చేయాలి
9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలతోనైనా
రాజీనామా చేయించాలి
పంట కొనుగోళ్లపై శ్వేతపత్రం ప్రకటించాలి
క్యాబినెట్‌లో ఈ అంశంపైనే చర్చించాలి :
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బండి భగీరథ్‌ను తొమ్మిది రోజులపాటు దాచి పెట్టిందెవరని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) పశ్నించారు. పోక్సో కేసు నిందితుడిని దాచి ఉంచడం నేరమనీ, ఇది ముమ్మాటికి హోంమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత అని చెప్పారు. దీన్ని బట్టి రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌కు మధ్య ఫెవికాల్ బంధం ఉందని ర్థమవుతోందన్నారు. వారి మధ్య అనుబంధం వల్లే ఓ ఆడబిడ్డకి అన్యాయం చేయాలని చూశారని విమర్శించారు. దీనిపై వారిద్దరూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ మైనర్ బాలిక అన్యాయం జరిగిందని తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్తే అర్ధరాత్రి వరకు అక్కడే నిలబెట్టి తీవ్ర ఆవేదనకి గురిచేసింది రాష్ట్ర ప్రభుత్వం కాదా?అని కేటీఆర్ ప్రశ్నించారు.
హైకోర్టు బెయిల్ నిరాకరించడం వల్లే నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. ప్రధాని పర్యటన వల్ల పోలీసులంతా బిజీగా ఉన్నారంటూ సీఎం రేవంత్‌రెడ్డి అడ్డగోలు సాకులు చెప్పడం సరైంది కాదన్నారు. ప్రధాని వస్తే నేరస్తులను స్వేచ్ఛగా వదిలేస్తారా?అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి సన్నిహితుడి ఆస్పత్రిలో తొమ్మిది రోజుల పాటు నిందితుడిని దాచిపెట్టారన్న వార్తలు వస్తున్నాయనీ, దీనిపై ప్రభుత్వం విచారణ చేయాలని కోరారు. అమ్మాయి కుటుంబంపైనే ‘హనీ ట్రాప్’ అంటూ కౌంటర్ కేస్ పెట్టి కుట్ర చేయించింది ఎవరో చెప్పాలని బండి సంజయ్‌కి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. దేశంలో ఎక్కడైనా పోక్సో కేసు నిందితులు తొమ్మిది రోజులు తప్పించుకోలేరనీ, కేంద్రమంత్రి కొడుకు కావడం, ముఖ్యమంత్రి అండదండలు ఉండడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు.
తన బావమరిది డ్రగ్స్ తీసుకుంటే కేసు ఎందుకు పెట్టడం లేదనీ, దమ్ముంటే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్లపైన, పంటల వారీగా ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పినట్టుగా 80 శాతం కొనుగోళ్లు పూర్తయ్యాయని నిరూపిస్తే ఏ శిక్షకైనా తాము సిద్ధమని అన్నారు. కొడంగల్ సహా ఏ కొనుగోలు కేంద్రానికి వెళ్దామని పశ్నించారు. రాష్ట్రంలో గన్నీ బ్యాగులు దొరకడం లేదు కానీ గన్నులు మాత్రం విచ్చలవిడిగా దొరుకుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పంట కొనుగోళ్ల సంక్షోభం తీవ్రంగా ఉందన్నారు. దీన్ని పట్టించుకోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా అవాస్తవాలు చెప్తున్నారని అన్నారు. శనివారం జరిగే క్యాబినెట్ సమావేశంలోనైనా అత్యంత కీలకమైన ఈ పంట కొనుగోళ్ళ సంక్షోభంపైన చర్చించాలని డిమాండ్ చేశారు. రైతన్నల కష్టాలే ఏకైక ఎజెండాగా క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని కోరారు. అన్నదాతల ఆత్మహత్యలపైన, మరణాలపైన ప్రభుత్వానికి సమాచారం ఇస్తే పౌర సరఫరాల మంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఎవరూ చనిపోలేదని బుకాయిస్తున్నదని అన్నారు.
పంట కొనుగోళ్ళు ఆలస్యమై, నష్టపోయిన రైతన్నలు మరణాలపాలయ్యారని వివరించారు. అవసరమైతే వారి వివరాలను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆరుగాలం కష్టపడి పండించి తెచ్చిన పంటను కొనుగోలు కేంద్రాలకి తరలిస్తే కనీసం వాటిని కొనేందుకు కాంటా పెట్టడం లేదన్నారు. కాంటా పెట్టినా భారీగా తరుగు తీసి దోపిడీకి గురి చేస్తున్నదని అన్నారు. పంట కొనుగోళ్లకు సంబంధించి సీఎం ’80 శాతం అంటే, మంత్రులేమో 50 శాతం పూర్తయ్యాయని అంటున్నారని వివరించారు. కానీ క్షేత్రస్థాయిలో కనీసం 30 శాతం కొనుగోళ్లు కూడా పూర్తి కాలేదని అన్నారు. రాష్ట్రంలో రైతులకు యూరియా దొరకడం లేదని చెప్పారు. పంటలను కొనుగోలు చేయకుంటే భవిష్యత్తులో కార్యాచరణకు దిగుమతామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీస్తామని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి మళ్లీ అధికారంలోకి వస్తామనే నమ్మకముంటే అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తాము రాజీనామా చేస్తామనీ, వారు సిద్ధమా?అని ప్రశ్నించారు. కనీసం ఫిరాయింపు ఎమ్మెల్యేలతోనైనా రాజీనామా చేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



