ప్రపంచ కేంద్రంగా
ఎదుగుతోన్న తీరు
దానిని వాషింగ్టన్ ఆపలేదని బీజింగ్ నమ్మకం
ఇకపై అమెరికా ‘అడ్డుకోలేని మహాశక్తి’ కాదని విశ్వాసం : ప్రముఖ విశ్లేషకులు ఆర్నో బెర్ర్టాండ్
బీజింగ్ : ప్రపంచంలో చైనా ఎదుగుతున్న తీరు అమెరికాను మించి ఉంటుందని కీలక నివేదికను ఉటంకిస్తూ ప్రముఖ అంతర్జాతీయ విశ్లేషకులు ఆర్నో బెర్ర్టాండ్ చెప్తున్నారు. భవిష్యత్‌లో చైనా కేంద్రంగానే ప్రపంచ రాజకీయ గమనం ఉంటుందని అంటున్నా రు. అమెరికా ఇక తమ ఎదుగుదలను అడ్డు కోలేదనీ, భవిష్యత్ ప్రపంచ వ్యవస్థ క్రమంగా చైనా చుట్టూ తిరుగుతుందని బీజింగ్ నమ్ముతోందని ఒక కీలక వ్యూహాత్మక నివేదిక వెల్లడించింది. ఇప్పటి వరకు సూపర్‌పవర్ అని భావిస్తున్న అమెరికాకు ఇక ఆ పరిస్థితి ఉండదని బీజింగ్ భావిస్తున్నట్టు వివరిం చింది. చైనా గూఢచారి వ్యవస్థతో సంబంధా లు ఉన్న పరిశోధనా సంస్థ రూపొందించిన ఈ నివేదికను అంతర్జాతీయ రాజకీయాల నిపుణులు ఆర్నో బెర్ట్రాండ్ విశ్లేషించారు. చైనా విదేశాంగ వ్యూహానికి సంబంధించిన ‘ది గ్రేట్ గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ది పాత్ టు యూఎస్-చైనా కోఎగ్జిస్టెన్స్’ అనే నివేదికను చైనా ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ కాంటెంపరరీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (సీఐసీఐఆర్) రూపొందించింది. కాలం ఇప్పుడు చైనా వైపే ఉందని నివేదిక పేర్కొంది.
చైనా-అమెరికా పోటీని మావో జెడాంగ్ ప్రతిపాదించిన ‘దీర్ఘకాల యుద్ధ సిద్ధాంతం’ కోణంలో వివరించింది. ఆర్నో బెర్ర్టాండ్ విశ్లేషణ ప్రకారం… చైనా ఇప్పటికే అమెరికా విధించిన కఠినమైన చర్యలను, వాణిజ్య యుద్ధాలు, సాంకేతిక పరిమితులు, ఆంక్షలు, సుంకాలు వంటి వాటిని ఎదుర్కొని కూడా తన ఆర్థిక వృద్ధి, రాజకీయ వ్యవస్థను నిలబెట్టుకుంది. “తుఫాను గడిచిపోయింది. అమెరికా వేయగలిగిన అతిపెద్ద దెబ్బ ఇప్పటికే పడిపోయింది” అని ఆర్నో బెర్ర్టాండ్ నివేదిక భావాన్ని వివరిస్తూ పేర్కొన్నారు. ఇక ఈ నివేదికలో మరో ముఖ్యాంశం ఏమిటంటే… అమెరికా కూడా ఇప్పుడు చైనాను ‘సమాన స్థాయి ప్రత్యర్థి’గా అంగీకరిస్తోందని చైనా భావిస్తోంది. అమెరికా ఆధిపత్య యుగం తగ్గిపోతోందని అమెరికా అధికారుల వ్యాఖ్యలు, వ్యూహాత్మక పత్రాలను కూడా నివేదిక ప్రస్తావించింది. ఆర్నో బెర్ర్టాండ్ అభిప్రాయం ప్రకారం… భవిష్యత్తులో ప్రపంచ వ్యవస్థ యుద్ధం ద్వారా కాకుండా చైనా ఆర్థిక బలం, తయారీ ఆధిపత్యం, సాంకేతిక ప్రభావం వల్ల సహజంగానే చైనా చుట్టూ తిరగవచ్చని బీజింగ్ నమ్ముతోంది. “చైనా దృష్టిలో గెలుపు అంటే ప్రత్యక్ష ఘర్షణ కాకపోవచ్చు. ప్రపంచాన్ని నెమ్మదిగా చైనా కేంద్రంగా పునర్ వ్యవస్థీకరించటమే వారి విజయంగా భావిస్తున్నారు” అని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ఇక తమ అస్తిత్వ ప్రమాదం కాదని బీజింగ్ భావిస్తున్నదనీ, ఇందుకు తాజా నివేదికలో కనిపించిన పదాలే నిదర్శనమని వివరించారు. సాధారణంగా చైనా నివేదికల్లో అమెరికాపై ‘తీవ్రమైన ముప్పు’ భావన కనిపిస్తుందనీ, అయితే ఇప్పుడు తాజా నివేదికలో ఆ భయం మచ్చుకు కూడా కనిపించలేదని పేర్కొన్నారు.



