నిరాశ్రయులైన 10 లక్షల మంది మహిళలు, బాలికలు
ఐక్యరాజ్యసమితి మహిళల వాదనా నివేదిక వెల్లడి
గాజా : రఫా, ఇజ్రాయిల్ దురాక్రమణతో పాలస్తీనా పౌర జీవనం అస్తవ్యస్తమైంది. ఇండ్లు, పాఠశాలలు, నిర్దేశిత ఆశ్రయాలతో సహా దాదాపు 90 శాతం పౌర మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. నీరు, ఆహారం, విద్యుత్, పారిశుధ్యం వంటి నిత్యావసర సేవలను ఇజ్రాయిల్ కఠినతరం చేసింది. అయినా ప్రాణాలతో బయటపడిన వారు ఆకలి దప్పికలతో అలమటిస్తున్నారు. అంతేకాక పదేపదే నిరాశ్రయులుగా మారడంతో పాటు వ్యాధుల ముప్పును ఎదుర్కొంటు న్నారు. ఇది ఊహించని మానవతా సంక్షోభాన్ని సృష్టిస్తోంది. ఈ కమ్రంలోనే ఐక్యరాజ్యసమితి మహిళల వాదనా విడుదల చేసిన నివేదిక పక్రారం అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 వరకు మహిళలు , బాలికలపై తీవ్రమైన మానవతా సంక్షోభ ప్రభావాన్ని వెల్లడించింది. యుద్ధం జరిగినంత కాలం లింగ-నిర్దిష్ట దుర్బలత్వాలు ఎలా అభివృద్ధి చెంది, తీవ్రమయ్యాయో వివరిస్తోంది. భారతదేశంలోని పాలస్తీనా రాయబార కార్యా లయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ప్రకారం.. ఐక్యరాజ్యసమితి నివేదికను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, దానిలోని కొన్ని కీలక అంశాలను వెల్లడిం చింది. ఈ సంఘర్షణలో మరణించిన వారిలో 70 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు, పిల్లలేనని ఆ ప్రకటనలో పర్కొంది.
90 శాతం జనాభా తీవ్ర ఆహార అభద్రతను ఎదుర్కొంటోందనీ, దీనివల్ల ఎక్కువగా ప్రభావితమవుతున్న వారిలో మహిళలు, పిల్లలే ఉన్నారని కూడా ఆ ప్రకటనలో జోడించింది. వ్యక్తిగత పరిశుభ్రత సామాగ్రి, నిత్యావసర సంరక్షణ ఉత్పత్తుల తీవ్ర కొరత కారణంగా, రుతుస్రావాన్ని ఆలస్యం చేయడానికి లేదా నివారించడానికి మైనర్లతో సహా మహిళలు, బాలికలు గర్భనిరోధక మాత్రలను ఆశ్రయించ వలసి వస్తోందనే ఆందోళనకరమైన ధోరణిని కూడా రాయబార కార్యాలయం ప్రముఖంగా ప్రస్తావించింది. ఇది మహిళలు, పిల్లలపై యుద్ధం చూపుతున్న అసమాన ప్రభావాన్ని మరింత స్పష్టం చేస్తోంది.
మహిళలు , పిల్లలపై ప్రభావం
అక్టోబర్ 2023 నుంచి డిసెంబర్ 2025 మధ్య కాలంలో సుమారు 38,000 మంది మహిళలు , బాలికలు మరణించారు. గాజాలో గతంలో జరిగిన సంఘర్షణలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. 2008-2009 సంఘర్షణ లలో మరణించిన వారిలో మహిళలు, బాలికల వాటా 15 శాతం కాగా, 2014 సంఘర్షణలలో ఇది 22 శాతంగా ఉంది. అంతేకాకుండా, బాంబు దాడులు తీవ్రమైన కాలంలో, ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైన మొదటి ఆరు నెలల్లో మహిళలు, పిల్లల మరణాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఆ సమయంలో సంభవించిన మరణాలలో దాదాపు మూడింట రెండు వంతుల మంది మహిళలే ఉన్నారు. మహిళలు .. పిల్లల మరణాల పెరుగుదల పౌర మౌలిక సదుపాయాల భారీ విధ్వంసం జరిగిన కాలాలతో ఏకీభవించింది. మహిళలు , పిల్లల మొత్తం మరణాలలో దాదాపు 59 శాతం ఈ తీవ్ర హింసా కాలంలోనే సంభవిం చాయి. ఇది ప్రత్యక్ష , పరోక్ష దాడులకు వారు ఎంతగా గురయ్యే అవకాశం ఉందో స్పష్టం చేస్తుంది. అదనంగా, ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం యొక్క అంచనాల ప్రకారం, దాదాపు 11,000 మంది మహిళలు, బాలికలు జీవితాంతం ఉండే గాయాలతో బాధపడు తున్నారు. వీరికి దీర్ఘకాలిక పునరావాసం అవసరమని ప్రస్తావించింది.
నాలుగు కంటే ఎక్కువసార్లు స్థానభ్రంశం..
దాదాపు 10 లక్షల మంది మహిళలు , బాలికలు నిరాశ్రయులయ్యారు. వారిలో చాలామంది నాలుగు కంటే ఎక్కువసార్లు స్థానభ్రంశం చెందారు. ఇది గర్భిణీ స్త్రీలు, వికలాంగులు మొదలైన బలహీన వర్గాలపై అసమానంగా ప్రభావం చూపింది. వీరు అతి తక్కువ సహాయంతో వేరే చోటికి తరలి వెళ్ళవలసి వచ్చింది. ఇంకా, రద్దీగా ఉండే ప్రదేశాలకు తరలించడం , అవసరమైన వనరులు, ప్రాథమిక అవసరాలకు పరిమిత ప్రాప్యత కారణంగా మహిళలు ఆహారం, నీరు తీసుకోవడాన్ని పరిమితం చేసుకోవాల్సి వచ్చింది . రుతు పరిశుభ్రతను త్యాగం చేయవలసి వచ్చింది. ఇది వారి సాధారణ , పునరుత్పత్తి ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపవచ్చు.
లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య సేవలకు పరిమిత ప్రాప్యత
యుద్ధం వల్ల మహిళలు , బాలికల లైంగిక , పునరుత్పత్తి ఆరోగ్య (ఎస్ఆర్ హెచ్ ) సేవలకు ప్రాప్యతను తీవ్రంగా పరిమితం చేసింది. అక్టోబర్ 2023 నుంచి అక్టోబర్ 2025 మధ్యకాలంలో ప్రధాన ప్రసూతి వార్డులు , సంతానోత్పత్తి క్లినిక్‌లతో సహా ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్‌లను లక్ష్యంగా చేసుకుని కనీసం 927 దాడులు జరిగాయి. సెప్టెంబర్ 2025 నాటికి.. 358 లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్య (ఎస్ఆర్ హెచ్ ) సేవా కేంద్రాలలో కేవలం 37 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. అల్-బస్మా ఐవీఎఫ్ సెంటర్ విధ్వంసం గాజా యొక్క సంతానోత్పత్తి క్లినిక్ తోపాటు జన్యు బ్యాంకును ఇజ్రాయిల్ నిర్వీర్యం చేసింది. తద్వారా వేలాది కుటుంబాలకు పునరుత్పత్తికి సంబంధించిన అవకాశాలు లేకుండా పోయాయి.
కొత్త కుటుంబ నిర్మాణం..
యుద్ధం యొక్క సామాజిక మూల్యం
సుదీర్ఘ యుద్ధం , ఇజ్రాయిల్ కఠినతరం చేసిన దిగ్బంధనం కారణంగా గాజాలోకి నిత్యావసర వస్తువులు ప్రవేశించకుండా నిరోధించబడ్డాయి. సెప్టెంబర్ 12, 2025 నాటికి, పోషకాహార లోపంతో కనీసం 369 మరణాలు సంభవించినట్టు ధ్రువీకరించబడింది. అక్టోబర్, 2025 నాటికి 49,500 మందికి పైగా పిల్లలు పోషకాహార లోపానికి చికిత్స పొందుతున్నారు. 2025 జులై నాటికి సుమారు 40 శాతం మంది గర్భిణీలు, పాలిచ్చే మహిళలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు . అంచనా ప్రకారం 5 లక్షల మంది మహిళలు , బాలికలు ఆకలితో చనిపోయే ప్రమాదంలో ఉన్నారు. దీనికి కారణం… సైనికీకరించబడిన ఆహార పంపిణీ కేంద్రాల ద్వారా ఆహారాన్ని పొందడం వల్ల సుమారు 2,600 మంది పౌరులు చంపబడటం , 19,182 మంది గాయపడటం జరిగింది, ఇది మహిళలను మరింత కష్టతరం చేసింది.
మారిన కుటుంబ స్వరూపం
అక్టోబర్ 2023 నుంచి సంభవించిన మొత్తం మరణాలలో 48 శాతం మంది పురుషులే ఉన్నారు. ఇది కుటుంబ స్వరూపాన్నే మార్చివేసింది . వాస్తవానికి మహిళా గృహ యజమానులు (డబ్ల్యూహెచ్ హెచ్ ) పెరుగుతున్న సంఖ్యకు దారితీసింది. 2023లో సంఘర్షణ తీవ్రతరం కావడానికి ముందు కేవలం 9 శాతం మంది మహిళలు మాత్రమే గృహయజమానులుగా ఉండగా, ఇప్పుడు దాదాపు 14 శాతం కుటుంబాలు మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం అంచనా వేస్తోంది. పురుషుల నేతృత్వంలోని కుటుంబాలతో (77 శాతం) పోలిస్తే, మహిళా గృహ యజమానులు (88 శాతం) ఎక్కువగా నిరాశ్రయుల య్యే అవకాశం ఉందని ఆధారాలు సూచిస్తున్నందున, వారు ప్రతికూల స్థితిలో ఉన్నారు.
ఈ యుద్ధంలో మరో ముఖ్యమైన అంశం ఇజ్రాయిల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ద్వారా విద్యా మౌలిక సదుపాయాలు ధ్వంసం కావడం. బాలికలు, మహిళలు విద్యను పొందలేకపోవడం లింగ అసమానతలను మరింత తీవ్రతరం చేస్తుంది. గాజాలో చాలా మంది ఉపాధ్యాయులు మహిళలే కాబట్టి, పాఠశాలల విధ్వంసం మహిళలకు ఒక ప్రధాన ఉపాధి మార్గాన్ని దూరం చేస్తుంది. అయితే, దీని పర్యవసానాలు ముఖ్యంగా బాలికలపై తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే వారు బాల్య, బలవంతపు వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, సాంప్రదాయ లింగ , అసమానతల పటిష్టత, భవిష్యత్తులో తమ గళాన్ని వినిపించడానికి, తమ స్వేచ్ఛను వినియోగించుకోవడానికి, ఉపాధి పొందడానికి ఉన్న అవకాశాలపై తీవ్ర పరిమితులను ఎదుర్కొంటారు.
యుద్ధవిరమణ తర్వాత కూడా ప్రభావం
యుద్ధ విరమణ తరువాత కనీసం ఆరునెలల పాటు మానవతా సంక్షోభం తీవ్రంగానే కొన సాగుతుందని అంచనా. యుద్ధ విరమణ జరిగిన తరువాతి సంవత్సరంలో, సుమారు 37,000 మంది గర్భిణీ , పాలిచ్చే తల్లులతో పాటు దాదాపు 50,000 మంది బాలికలకు తీవ్రమైన పోషకాహార లోపానికి చికిత్స అవసరం. ఇది మహిళలు , పిల్లలపై ఈ సంఘర్షణ యొక్క దీర్ఘకాలిక , అసమాన ప్రభావాన్ని స్పష్టం చేస్తుంది.
ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఐదు సూత్రాల ఎజెండా
గాజాలో కాల్పుల విరమణను కొనసాగించడం, దాని నిబంధనలను పూర్తిగా పాటించేలా చూడటం. పౌరులు , పౌర మౌలిక సదుపాయాలకు రక్షణ కల్పించడం, న్యాయమైన, శాశ్వత శాంతికి అనుకూలమైన పరిస్థితులకు మద్దతు ఇవ్వడం. గాజాలోని పాలస్తీనియులందరికీ తక్షణమే, నిరాటంకంగా, పెద్ద ఎత్తున మానవతా సహాయం అందించేలా చూడటం. ఇందులో మహిళలు, బాలికల లింగ-నిర్దిష్ట అవసరాలు , ప్రాధాన్యతలను పరిష్కరించే సేవలందించడం. గాజాలో మహిళలు , బాలికలపై యుద్ధం యొక్క లింగపరమైన ప్రభావం గురించిన డేటా , విశ్లేషణల లభ్యతను పెంచే ప్రయత్నాలను బలోపేతం చేయడం మహిళలు, బాలికలు ఎదుర్కొన్న అంతర్జాతీయ మానవ హక్కుల చట్ట ఉల్లంఘనల డాక్యుమెంటేషన్‌ను మెరుగుపరచడం, తద్వారా పునరుద్ధరణ , పునర్నిర్మాణ ప్రక్రియలకు మద్దతు ఇవ్వడం. శాంతి నిర్మాణం, పునరుద్ధరణ , పునర్నిర్మాణంలో పాలస్తీనా మహిళల పాత్రను నిర్ధారించడం, అదే సమయంలో న్యాయం, నివారణ, నష్టపరిహారాలకు సమాన ప్రాప్యతను కల్పించడానికి, పాలస్తీనాలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం 1325 , దాని తదుపరి తీర్మానాలను అమలు చేయడం.



