Saturday, May 23, 2026
E-PAPER
Homeక్రైమ్అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

అమీన్ పూర్ బంగారం చోరీ కేసును ఛేదించిన పోలీసులు

- Advertisement -

అరకేజీ బంగారం రికవరీ
మహబూబ్‌నగర్ దొంగ అరెస్ట్
నవతెలంగాణ – అమీన్‌పూర్
 సైబరాబాద్ అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక భారీ దొంగతనం కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. కేవలం 15 రోజుల్లోనే నిందితుడిని పట్టుకుని, అతని వద్ద నుండి సుమారు రూ. 50 లక్షల విలువైన అరకేజీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. గత నెల 14వ తేదీన అమీన్‌పూర్ పరిధిలోని బంధం కొమ్ము కాలనీలో ఉన్న ‘హిల్ టాప్ హోమ్స్’ నివాసి వెంకటరమణ భవాని ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఒక దుండగుడు చొరబడ్డాడు. ఇంట్లో దాచిన అరకేజీ బంగారు ఆభరణాలను దోచుకెళ్లాడు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు, దొంగతనానికి పాల్పడింది మహబూబ్‌నగర్‌కు చెందిన శివ అనే వ్యక్తిగా గుర్తించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. రికవరీ చేసిన రూ. 50 లక్షల విలువైన బంగారాన్ని బాధితులకు అప్పగించారు. కేసు విజయవంతంగా ముగిసిన సందర్భంగా హిల్ టాప్ హోమ్స్ కాలనీవాసులతో పోలీసులు ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నరేష్, డీఐ సత్యనారాయణ మరియు కాలనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రజల భద్రత దృష్ట్యా పలు కీలక సూచనలు: ఏసీపీ శ్రీనివాస్ కుమార్ 
ప్రతి కాలనీలో, వీలైతే ప్రతి ఇంటికి తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఏసీబీ శ్రీనివాసరావు తెలిపారు. హిల్ టాప్ హోమ్స్ కాలనీలో కూడా అతి త్వరలోనే సీసీ ఫుటేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇళ్లకు సాధారణ తాళాలకు బదులు భద్రత ఎక్కువగా ఉండే ‘సెంటర్ లాకింగ్ సిస్టమ్’ను అమర్చుకోవాలన్నారు. ఊర్లకు లేదా బయటకు వెళ్లే సమయంలో ఇంట్లో ఎక్కువ నగదు, బంగారం ఉంచకూడదని, వాటిని బ్యాంకు లాకర్లలో గానీ లేదా నమ్మకస్థులైన బంధువుల వద్ద గానీ భద్రపరచాలని కోరారు. అలాగే రాత్రి పూట ఇల్లు ఖాళీగా ఉందని తెలియకుండా ఉండేందుకు బయట లైట్లు వేసి ఉంచాలని పేర్కొన్నారు. మరోవైపు సకాలంలో స్పందించి దొంగతనం కేసును ఛేదించిన అమీన్‌పూర్ పోలీసులను కాలనీవాసులు అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -