నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణలో పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్‌లోని సాంకేతిక భవన్‌లో. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. ఈ ఏడాది కూడా పాలిసెట్ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలుర ఉత్తీర్ణత 79.92 శాతం నమోదు కాగా.. బాలికలు ఏకంగా 86.38 శాతంతో టాప్‌లో నిలిచారు. మొత్తం 120 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షలో.. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత మార్కులుగా 36 మార్కులు నిర్ణయించారు. కాగా, ఎస్సీ, ఎస్టీ (SC, ST) అభ్యర్థులకు కనీస ఉత్తీర్ణత మార్కుల నుండి మినహాయింపు ఇచ్చారు.
మే 13న రాష్ట్రవ్యాప్తంగా పాలిసెట్ పరీక్ష నిర్వహించగా.. మొత్తం 1,06,439 మంది దరఖాస్తు చేసుకోగా.. 98,029 మంది పరీక్షకు హాజరయ్యారు.వీరిలో 81,307 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82.94 శాతం ఉత్తీర్ణత నమోదైంది.



