ధర్మం, సనాతనం, హిందూ, సంస్కృతి అని నిత్యం గొంతు చించుకుని, కాషాయ జెండాలతో, కండువాలతో చెలరేగుతూ తిరుగుతున్న వాళ్ల గుంపు మనిషే కదా ఇతనూ! ఎందుకింత అరాచకం! హిందూరాష్ట్రం ఏర్పడాలని కోరుకుంటున్నది ఇందుకోసమేనా? ఎవరూ మాట్లాడరేమి? సంఘీయులుగానీ, బీజేపీ నాయకులుగానీ, ప్రభుత్వ పెద్దలు, యోగులు, పీఠాధిపతులు ఏమీ మాట్లాడరు. కనీసంగానైనా ఖండించరు. అదే ఇంకొక మతవ్యక్తి చేస్తే మాత్రం వీరంగం వేస్తారు. సిగ్గుండాలి. ఇలాంటి ఊరేగింపులు చేయటానికి, వాటిని చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడానికి! వాళ్లేమి చేస్తున్నారో అర్థమవుతోందా! దేశంలోని కోట్లాది మంది హిందువుల పేరు చెప్పుకుని, ఆ పేరు పెట్టుకుని మానవత్వానికే మచ్చ తెస్తున్న వీరి ఆగడాలను చూస్తూ ఊరుకుంటే, అవి కొనసాగుతూనే ఉంటాయి.
అది ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్. అక్కడి జైలు వెలుపల పెద్దఎత్తున హిందూవాహిని సమూహం గుమిగూడి పెద్ద పెద్దగా అరుస్తూ నినాదాలిస్తున్నది. అందరూ కాషాయ కండువాలతో, జెండాలతో ఉన్నారు. జై కొడుతున్నారు. జైలు నుండి బయటకు వచ్చిన ఒక వ్యక్తిని వాళ్లు భుజాల మీదకు ఎత్తుకుని ఊరేగింపు తీస్తున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. అతను ఆనందోత్సాహాలలో ఊరేగుతున్నాడు. అతని పేరు సుశీల్ ప్రజాపతి. హిందూ యువ వాహిని మాజీ నేత. ఇతడేం స్వాతంత్ర్య సమరయోధుడు కాదు. లేదా ప్రజల సమస్యలపై పోరాడి జైలుకు వెళ్లలేదు. లేదా గొప్ప క్రికెట్లో వరల్డ్ కప్ మోసుకొచ్చినోడు కాదు. ఒక లైంగికదాడి నిందితుడు. బెయిల్పై విడుదలయిన సందర్భం అది. జైలు తలుపుల నుంచి బయటికి అడుగుపెట్టగానే పూలమాలలతో స్వాగతం పలికారు సహచరులు. హిందూవాహిని నేతలు. ఈ దృశ్యాలను వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పెట్టడంతో అది వైరల్ గా మారింది. ఒక హేయమైన నేరానికి పాల్పడిన వ్యక్తికి ఈ విధంగా హీరోలా స్వాగతం పలకడంపై అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ కాషాయాన్ని ధరించి అధికారం చేస్తున్న అక్కడి ముఖ్యమంత్రి యోగీ కానీ, మంత్రులు కానీ ఏమీ మాట్లాడటం లేదు.
ఇంతకీ ఈ సుశీల్ ప్రజాపతి చేసిన ఘనకార్యమేమంటే, ఘజియాబాద్ కే చెందిన ‘లా’ చదువుతున్న విద్యార్థినికి, మాయమాటలు చెప్పి ఓ ఫ్లాటుకు తీసుకువెళ్లి, మత్తుమందు ఇచ్చి లైంగిక వేధింపులకు పాల్పడినట్లు, చంపుతానని బెదిరించినట్లు 2025 ఆగస్టులో కేసు నమోదయింది. ఆరోపణలు రుజువు కావడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. తొమ్మిది నెలల తర్వాత మే నెల 17న ఆయనకు బెయిల్ మంజూరయింది. ఇలాంటి ఘటనలు హిందూవాహినికి కొత్తేమీ కాదు. 2017లో బరేలీలో కూడా లైంగికదాడి నేరంపై జైళ్లకు వెళ్లారు. జై హిందూ నినాదాలు చేసిన మన రాష్ట్రంలో బండి భగీరథ్ కూడా ఇదే ఆరోపణలతో జైల్లో ఉన్న విషయం మనకు తెలుసు. ఇలాంటి ఉత్సవ సన్నివేశాలు ఇంతకు ముందు కూడా జరిగాయి. బిల్కిస్ బానోపై లైంగికదాడి, కుటుంబ సభ్యుల హత్యకేసులో శిక్షపడిన నేరస్తులను విడుదల చేసినప్పుడు కూడా ఇదే హిందూ పేరు పెట్టుకున్న సంస్థలు వారిని పూలదండలతో సత్కరించిన దౌర్భాగ్య సంఘటనను చూశాం. అంతేకాదు మహిళలపై, మైనరు బాలికలపై లైంగికదాడి, జర్నలిస్టు హత్య కేసులో జైళ్లో ఉన్న డేరా బాబాకు పెరోల్ ఇవ్వడం, బయట అతనికి నీరాజనాలు పలకడం చూస్తూనే ఉన్నాం కదా! అలాగే ఆశారాం బాబా జైల్లోనే ఉన్నాడు. వీళ్లంతా నీతి, ధర్మం అంటూ ప్రవచనాలు పలికేవాళ్లే.
వీళ్లలాంటి వాళ్లు ఇంకో మతంలో ఉంటే ‘లవ్ జిహాద్’ అని మొత్తం మతాన్ని ద్వేషించే ప్రచారం చేస్తారు. కానీ హిందూవాహిని పేరుతో చలామణి అవుతున్న వీళ్లు చేస్తున్న ఈ నీచ పనులకు సంబంధించి విషయాలపై ఒక్క ఖండన కూడా చేయరు. అంటే సమర్థిస్తున్నట్లే కదా! అన్యాయం అని తెలిసినా ఎవరూ ఎందుకు మాట్లాడటం లేదు. మహిళలకు, అమ్మాయిలకు ఇవ్వాల్సిన గౌరవం, వ్యక్తుల ఆరాధనలో కొట్టుకుపోతోందా! ఆడవాళ్లు ఆదిపరాశక్తులని, దేవతలని, మా సంస్కృతిలో వారిని పూజిస్తామని చెప్పే మాటలన్నీ అబద్ధాలుగా నిలుస్తున్నాయి. వేల ఏండ్ల సంస్కృతి, నాగరి కతలుగా చెప్పే వీరి విలువల ప్రయాణం చాలా దారుణంగా కనపడుతోంది. గతంలో కంటే ఇదంతా ఈ పదేండ్లలో మహిళలపై దాడులు, లైంగికదాడులు, హత్యలు విపరీతంగా పెరిగాయని నేర గణాంకాలు వివరిస్తున్నాయి. దేశ పాలకులు ఒట్టి నినాదాలివ్వడం కాదు, మహిళల భద్రతకు కావలసిన చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం.
నీచత్వానికి నీరాజనమా!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



