Sunday, May 24, 2026
E-PAPER
Homeహెల్త్జుట్టు రాలుతుందా..?

జుట్టు రాలుతుందా..?

- Advertisement -

రమ్య డిగ్రీ పూర్తిచేసి ఇంట్లోనే పరీక్షలకు సిద్ధమవుతోంది. గత కొన్ని వారాలుగా తల దువ్వుకునేటప్పుడు ముందుకంటే ఎక్కువ జుట్టు రాలుతున్నట్టు గమనించింది. నేలపై, దువ్వెనలో జుట్టు కనిపించడంతో ఆమెకు భయంగా అనిపించింది. ”ఇంత జుట్టు ఎందుకు రాలుతోంది? నాకు బట్టతల వస్తుందేమో?” అని భయపడింది. ఇలాంటి సందేహం చాలామంది యువతులకు వస్తుంది. కానీ ఒక విషయం తెలుసుకోవాలి. కొంతమేరకు జుట్టు రాలడం సహజమే. మన తలలో ఉన్న ప్రతి వెంట్రుకకు ఒక జీవనకాలం ఉంటుంది. పాత జుట్టు రాలిన తర్వాత కొత్త జుట్టు మళ్లీ వస్తుంది. అందుకే రోజుకు కొంత జుట్టు రాలడం సాధారణమే. కానీ కొన్నిసార్లు ముందుకంటే ఎక్కువగా జుట్టు రాలుతున్నట్టు అనిపించవచ్చు. దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు.

మొదటి కారణం:
సరైన ఆహారం తీసుకోకపోవడం. ముఖ్యంగా ప్రోటీన్‌, ఇనుము (iron) తక్కువగా ఉన్నప్పుడు జుట్టు బలహీనపడవచ్చు. తరచూ భోజనం మానేయడం, చాలా తక్కువ తినడం వంటి అలవాట్లు కూడా ప్రభావం చూపవచ్చు.
మరో కారణం: మానసిక ఒత్తిడి, ఎక్కువగా ఆలోచించడం, ఆందోళన చెందడం కూడా జుట్టు రాలడాన్ని పెంచవచ్చు.
పోషకాలు తగ్గిపోతే : ఇప్పుడిప్పుడు చాలా మంది జుట్టును తరచూ స్ట్రైటనింగ్‌ (straightening) చేయించడం, వేడి పరికరాలు (heating tools) ఉపయోగించడం చేస్తున్నారు. ఇవి ఎక్కువగా ఉపయోగిస్తే జుట్టు పొడిగా మారి, సులభంగా రాలే అవకాశం ఉంటుంది. కొంతమంది త్వరగా బరువు తగ్గాలని ఆహారం చాలా తగ్గిస్తారు. ఇలా సరిపడా ఆహారం తీసుకోకపోతే శరీరానికి అవసరమైన పోషకాలు తగ్గిపోతాయి. అప్పుడు జుట్టు బలహీనంగా మారి రాలడం పెరగవచ్చు. కొన్నిసార్లు థైరాయిడ్‌ సమస్యలు,PCOS, రక్తహీనత వంటి పరిస్థితుల్లో కూడా జుట్టు రాలడం ఎక్కువగా కనిపించవచ్చు. అందుకే ఇతర లక్షణాలు కూడా ఉంటే గమనించడం అవసరం.
సరైన ఆహారం చాలా అవసరం : జుట్టు రాలడం ప్రారంభమైన వెంటనే కొత్త కొత్త నూనెలు లేదా మందులు ప్రయత్నించడం చాలా మంది చేస్తారు. కానీ ప్రతి సమస్యకు నూనె మాత్రమే పరిష్కారం కాదు. అసలు కారణం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం చాలా అవసరం. పప్పులు, గుడ్లు, పాలు వంటి ప్రోటీన్‌ ఉన్న ఆహారం జుట్టుకు బలం ఇస్తుంది. అలాగే ఆకుకూరలు, పండ్లు కూడా ఉపయోగపడతాయి. తల శుభ్రంగా ఉంచడం కూడా ముఖ్యమైన అలవాటు. చాలా రోజులు తలస్నానం చేయకుండా ఉండటం మంచిది కాదు. అలాగే చాలా గట్టిగా జుట్టు కట్టుకోవడం తగ్గించడం మంచిది.
ప్రత్యేక జాగ్రత్తలూ అవసరమే: చాలా ఎక్కువగా జుట్టు రాలడం, తలపై కొన్నిచోట్ల మాత్రమే జుట్టు తగ్గిపోవడం, చాలా కాలంగా జుట్టు రాలడం కొనసాగడం.. ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఒక విషయం గుర్తుంచుకోవాలి: జుట్టు రాలడం ప్రారంభమైన వెంటనే భయపడాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాల్లో సరైన ఆహారం, సరైన అలవాట్లతో మెల్లగా తగ్గవచ్చు. జుట్టు రాలడాన్ని చూసి భయపడకండి. కారణాన్ని గమనించడం ముఖ్యం.

డా|| యం. రమాదేవి
ప్రొఫెసర్‌ డ హెడ్‌, ఫిజియాలజీ
గాంధీ మెడికల్‌ కాలేజ్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -