Sunday, July 19, 2026
E-PAPER
Homeహెల్త్లెర్నింగ్‌తోనే ఎర్నింగ్‌

లెర్నింగ్‌తోనే ఎర్నింగ్‌

- Advertisement -

ఎర్నింగ్‌ నిరంతరం కొనసాగే ప్రక్రియ. ఆ ఎర్నింగ్‌ను సుసాధ్యం చేసుకోవటానికి మాత్రం పరిమితమైన లెర్నింగ్‌ సరిపోతుందనుకుంటే పొరబాటు. నేర్చుకోవటం, విజ్ఞానాన్ని పెంపొందింప చేసుకోవడం ఇవి రెండూ కూడా ఎర్నింగ్‌తో సమానంగా నిరంతర ప్రక్రియ కావాలి. గత వందేండ్లతో పోలిస్తే, నేటి ఆధునిక ప్రపంచంలో కెరీర్‌ చిత్రపటం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ఏదో వానాకాలం చదువులా కొంత చదువు చదివి ఆపైన ఏ సర్కారీవాడు పిలిచి వుద్యోగమిస్తే, ఆ వుద్యోగం చేసుకుంటూపోతే హాయిగా రోజులు వెళ్ళిపోయేవి. మా నాన్న అంటుంటారు ఫస్ట్‌ ఫారం చదువుంటే చాలు, స్కూలు టీచరుగా పోస్టు వచ్చేది’ అని. మరి ఇప్పుడో? సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ కావాలంటే, ఎంత ప్రిపేర్‌ అవ్వాలో, ఆ తర్వాత ఎంత ‘తతంగం’ జరిపించాలో మీకు తెలియనిదేం కాదు. సరే ఉద్యోగాల మాట అలా వదిలిపెట్టండి. వ్యాపారాలు కూడా అట్లాగే వుండేవి. ఓ మోస్తరు తెలివితేటలుంటే, ఎటువంటి వ్యాపారమయినా ఇట్టే చేయగలిగేవాళ్ళు. కావల్సినంత డబ్బూ సంపాదించేవాళ్ళు. మా నాన్న మిత్రుడే, ఈ వూళ్ళోనే వుండేవారు. ఆయనది బట్టల వ్యాపారం.

అప్పట్లో ‘బిన్నీ’ కేస్మెంట్లకు బాగా పేరు. పుష్కలంగా అమ్ముడుపోయేవి. అయితే వాటిని అమ్మడం వల్ల మిగిలే తేలికపాటి లాభం కన్నా ఎక్కువ సంపాదించాలనే తపనతో ఆయనే స్వయంగా ఆ నాణ్యతగల బట్టను తయారుచేసి అమ్మకాలు మొదలుపెట్టారు, బాగా ఆర్జించారు. మార్కెట్లో పోటీ తక్కువ. నిజాయితీ, మంచితనం, నాణ్యత వీటికే అగ్రతాంబూలం. మనకు నాగరికత ఎంత పెరిగిందో, అదే స్థాయిలో పోటీ కూడా పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో తెలివితేటలు ఎంతున్నా సంపాదన పెంచుకోవాలంటే అందుకు సరిపోయే తెలివితేటలను కూడా పెంచుకోవాల్సిందే! ఎవరికయినా తెలివితేటలు ఎలా పెరుగుతాయి? నేర్చుకోవాలి, విజ్ఞానాన్ని పెంచుకోవాలి. మెదడులో కుడి పార్శ్వం, ఎడమ పార్శ్వం ఒకదానితో ఒకటి పోటీ పడి పనిచేయాలి. అలా పనిచేయాలంటే మనం ‘ఎం.ఎ. గోల్డ్‌ మెడల్‌ వచ్చింది’ అని అంతటితో ఆగిపోతే సరిపోదు.

నిరంతరం నేర్చుకోండి
జర్మనీకి చెందిన కెరీర్‌ సైకాలజిస్టు మిచెల్‌.ఎల్‌. క్యాస్టో ఏమంటాడంటే, నేర్చుకోవడం అన్నది ఏదో ఒకదశలో ఆగిపోకూడదంటాడు. ఈ ఆధునిక ప్రపంచంలో విజయులై ముందుకు సాగిపోతూనే వుండాలంటే నిజజీవితంలో ఎప్పుడూ విద్యార్థిగానే గడపాలంటాడు. పాఠశాలల్లోనూ, కాలేజీల్లోనూ చదివేస్తే మొత్తం చదువంతా వచ్చేసినట్టు కాదు. ప్రపంచంలో వున్న విజ్ఞానమంతా పుక్కిట పట్టినట్టు కాదు. జీవితంలో ప్రతి నిమిషం, ప్రతి రోజూ నేర్చుకుంటూనే వుండాలి. అవధులు లేకుండా పెరిగిపోతున్న సాంకేతిక ప్రపంచంలో, అస్థవ్యస్థంగా వున్న ఆర్థిక వ్యవస్థల్లో, కార్పొరేట్‌ స్థాయిలో ఏర్పడుతున్న పరిణామ దశల్లో నిరంతరం విజ్ఞాన సముపార్జన చేస్తూ వుంటేనే ధనార్జన కూడా సమద్ధిగా వుంటుంది. జీవితాంతం డబ్బు సంపాదిస్తేనే బతుకు వెళ్ళదు. అది ఒక నిరంతరమైన ప్రక్రియ అయినప్పుడు, ఆ సంపాదనకు నేర్చుకోవడం కూడా నిరంతరం జరిగే ప్రక్రియ కావల్సివుంది.

పని చేయని వాటిని వదిలివేయాలి
క్యాస్ట్రో ఇంకా ఇలా అంటాడు. ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంతో పాటు సమానంగా మనమూ పరుగుపెట్టాలంటే ఒకప్పుడు నేర్చిపెట్టుకున్న విజ్ఞానం ఎందుకూ కొరగాదు. కంప్యూటర్‌నే తీసుకోండి. అయిదారేండ్ల కిందట ‘సి’ లాంగ్వేజ్‌ నేర్చుకోవటమే గొప్ప. ఇప్పుడది చిన్న పిల్లలకు కూడా ఇట్టే వంటపట్టేస్తోంది. ‘సిం’ అని, ‘సి చ’ అని యిలా విజ్ఞానం అనంతంగా పెరిగిపోతూనే వుంది. మరి ఇట్లాంటి నేపథ్యంలో ఎప్పుడో నేర్చుకున్న విజ్ఞానం ఇప్పటికీ డబ్బు తెచ్చిపెట్టమంటే ఎలా పెడుతుంది? అంచేత మనం కేవలం నిరంతరం నేర్చుకోవడానికి మాత్రమే తయారుగా వుంటే సరిపోదు. పాతబడిపోయిన దానిని త్యజించడానికి కూడా సిద్ధంగా వుండాలి. అలా త్యజించకపోతే ‘మన బాస్‌ వట్టి ఛాదస్తపు మనిషిరా!’ అని మనం అపవాదులు పడవల్సి వుంటుంది.

అప్‌ గ్రేడ్‌ చేసుకోండి
మనం నిత్యం వాడే కంప్యూటర్లను మన అవసరాలకు తగినట్లుగా ఎలా ఎప్పటికప్పుడు అప్‌ గ్రేడ్‌ చేసుకుంటూ ఉంటామో, అలాగే మనం గతంలో నేర్చుకున్నదానిని మళ్ళీ కొనసాగించవల్సి వుంటుంది కూడా. దీనినే ‘రీ లెర్నింగ్‌’ అంటాడు క్యాస్టో. శాస్త్రరంగం ఎప్పుడూ కొత్త పుంతలు తొక్కుతూనే వుంటుంది. దీనిని జీర్ణించుకోవడానికి మనకిదివరకే వున్న పరిమితమైన విజ్ఞానం ఏ మాత్రమూసరిపోదు. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవల్సిందే. లేదంటే, నేర్చుకుని ముందుకు సాగిపోయే వారినందరినీ చూస్తూ చతికిలపడి పోవల్సిందే. అంచేత మీరు ఎంచుకున్న కెరీర్‌ ఏదైనా సరే..
1. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి, 2. అంతకు ముందు నేర్చుకున్న దానిని (పనికి మాలినవి అయినపుడు) త్యజించడానికి, 3. నేర్చుకున్నదానిని అప్‌గ్రేడ్‌ చేసుకోవడానికి లేదా రీలెర్నింగ్‌కు తయారుగా వుండాలి.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -