Sunday, July 5, 2026
E-PAPER
Homeహెల్త్బెస్ట్‌ సిస్టర్‌ నుంచి లైఫ్‌లైన్‌ వరకు హాస్టల్‌ స్నేహాలు

బెస్ట్‌ సిస్టర్‌ నుంచి లైఫ్‌లైన్‌ వరకు హాస్టల్‌ స్నేహాలు

- Advertisement -

హాస్టల్‌ అమ్మాయిల్లో ”బెస్ట్‌ సిస్టర్‌” బంధాలు ఎందుకు ఎక్కువగా కనిపిస్తున్నాయి? ఒక మానసిక విశ్లేషణ

ఈ మధ్యకాలంలో హాస్టళ్లలో ఉండే అమ్మాయిల మధ్య ఒక ప్రత్యేకమైన భావోద్వేగ బంధం ఏర్పడుతున్నట్లు గమనించాను. ”తను నా బెస్ట్‌ సిస్టర్‌”, ”తనతో మాట్లాడకుండా ఉండలేను”, ”తను లేకపోతే హాస్టల్‌ జీవితం ఊహించలేను” వంటి మాటలు తరచుగా వినిపిస్తుంటాయి. కొన్నిసార్లు ఈ బంధం అంతగా బలపడుతుంది, ఒకరోజు మాట్లాడుకోకపోయినా బాధపడటం, వేరే వారితో ఎక్కువగా మాట్లాడితే అసూయపడటం, దూరమైతే తీవ్ర నిరాశకు గురికావడం వంటి పరిస్థితులు కూడా కనిపిస్తాయి. ఇది కేవలం స్నేహం మాత్రమే కాదు. దీని వెనుక కొన్ని లోతైన మానసిక కారణాలు ఉంటాయి. హాస్టల్‌కు వచ్చిన తర్వాత ఒక అమ్మాయి తన కుటుంబానికి, ముఖ్యంగా తల్లికి, అక్కచెల్లెళ్లకు, ఇంటి వాతావరణానికి దూరమవుతుంది. చిన్నప్పటి నుంచి తనకు భద్రతను, ప్రేమను, ఆదరణను ఇచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా తనతో ఉండరు. ఈ పరిస్థితిలో మనసు సహజంగానే ఆ లోటును పూడ్చగల వ్యక్తిని వెతుకుతుంది. అప్పుడు హాస్టల్‌లో తనను అర్థం చేసుకునే, తన బాధలను వినే, తనతో సమయం గడిపే ఒక స్నేహితురాలు కనిపిస్తే, ఆమెపై ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడుతుంది.

మరో ముఖ్యమైన కారణం ”సామాన్య అనుభవాలు”. హాస్టల్‌లో ఉన్న పిల్లలందరికీ దాదాపు ఒకే రకమైన సమస్యలు ఉంటాయి. ఇంటి జ్ఞాపకాలు, చదువు ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళనలు, కుటుంబాన్ని మిస్‌ అవ్వడం వంటి అనుభవాలను వారు కలిసి ఎదుర్కొంటారు. ఒకే బాధను, ఒకే పరిస్థితిని అనుభవిస్తున్న ఇద్దరు వ్యక్తులు సహజంగానే ఒకరికి ఒకరు దగ్గరవుతారు. ఎందుకంటే ”నన్ను నిజంగా అర్థం చేసుకునేది ఈమె మాత్రమే” అనే భావన ఏర్పడుతుంది. హాస్టల్‌ జీవన విధానం కూడా ఈ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఉదయం లేవడం నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఎక్కువ సమయం ఒకే వ్యక్తితో గడపడం జరుగుతుంది. కలిసి భోజనం చేయడం, కలిసి చదవడం, కలిసి బయటకు వెళ్లడం, వ్యక్తిగత విషయాలు పంచుకోవడం వంటివి జరుగుతుంటాయి. ఈ నిరంతర సాన్నిహిత్యం కారణంగా ఆ వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన స్థానాన్ని సంపాదిస్తుంది. యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలు భావోద్వేగపరంగా చాలా సున్నితంగా ఉంటారు. ఈ దశలో ప్రేమ, ఆదరణ, గుర్తింపు, అంగీకారం వంటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా తమను ప్రత్యేకంగా చూసుకుంటే, తమ సమస్యలను శ్రద్ధగా వింటే, తమకు అండగా నిలిస్తే వారితో గాఢమైన అనుబంధం ఏర్పడటం సహజం. అందుకే కొన్నిసార్లు ఈ స్నేహాలు సాధారణ స్నేహాన్ని మించి భావోద్వేగాలు ఆధారపడే స్థాయికి చేరుకుంటాయి.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను గుర్తించాలి. స్నేహం ఆరోగ్యకరమైనది. కానీ ఆధారపడటం ప్రమాదకరమైనది. ఒక మంచి స్నేహితురాలు మన జీవితాన్ని ఆనందంగా మార్చగలదు. కానీ ”ఆమె లేకపోతే నేను బతకలేను”, ”ఆమె మాట్లాడకపోతే నేను చదవలేను”, ”ఆమె లేకుండా నేను ఎవ్వరినీ నమ్మలేను” అనే భావనలు పెరిగితే అది భావోద్వేగ ఆధారపడటంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో అసూయ, అధిక స్వామ్య భావన, చిన్న విషయాలకు గొడవలు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు కనిపించవచ్చు. కొన్నిసార్లు చదువుపై దృష్టి తగ్గడం, ఇతర స్నేహితులతో సంబంధాలు దెబ్బతినడం, వ్యక్తిగత ఎదుగుదల ఆగిపోవడం కూడా జరుగుతుంది. అందువల్ల హాస్టల్‌లో ఏర్పడే బలమైన స్నేహ బంధాలను తప్పుగా చూడాల్సిన అవసరం లేదు. అవి జీవితంలో ఎంతో విలువైన అనుభవాలను, మధురమైన జ్ఞాపకాలను ఇస్తాయి. అయితే ఆ బంధం మన వ్యక్తిత్వాన్ని బలపరచాలి గానీ, మన స్వతంత్రతను కోల్పోయేలా చేయకూడదు. ఒక మంచి స్నేహితురాలు మన జీవితంలో భాగం కావాలి, మొత్తం జీవితం కాకూడదు. చివరగా చెప్పాలంటే, హాస్టల్‌లో కనిపించే ”బెస్ట్‌ సిస్టర్‌” బంధాలు ప్రేమ, ఆదరణ, భద్రత, అనుబంధం కోసం మనసు చేసే సహజమైన ప్రయత్నమే. అయితే ఆ బంధం పరస్పర అభివద్ధికి దోహదపడితే అది ఆశీర్వాదం. అదే పరస్పర ఆధారపడటంగా మారితే అది మానసిక ఒత్తిడికి కారణం కావచ్చు. నిజమైన స్నేహం అంటే ఒకరిని ఒకరు పట్టుకుని నిలబెట్టడం, కానీ ఒకరిపై ఒకరు పూర్తిగా ఆధారపడటం కాదు.

డా|| హిప్నో పద్మా కమలాకర్‌,
9390044031
కౌన్సెలింగ్‌, సైకో థెరపిస్ట్‌, హిప్నో థెరపిస్ట్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -