Sunday, July 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరెక్కల కష్టానికి 'నిషేధం' సంకెళ్లు

రెక్కల కష్టానికి ‘నిషేధం’ సంకెళ్లు

- Advertisement -

40 ఏండ్ల ఆశలపై సీలింగ్‌ యాక్టు చావుదెబ్బ!
కోర్టు ఆర్డర్లున్నా అధికారుల ఉదాసీనత
10 వేల ప్లాట్లు, 6 వేల ఇండ్ల యజమానుల ఆవేదన
పిల్లల చదువులు సాగక, పెండ్లిళ్లు కాక మధ్యతరగతికి గుండెకోత!
మంత్రుల చుట్టూ తిరిగినా 
పరిష్కారం నిల్‌
అర్జీలతోనే నిండుతున్న ప్రజావాణి
సొంతభూమిలోనే పరాయివాళ్లలా ఉంటున్నాం : కరీంనగర్‌‌లోని రేకుర్తి, 
విద్యానగర్‌ వాసులు
మొత్తం నిషేధిత భూమి: 651 ఎకరాలు
రేకుర్తి (125 సర్వే నంబర్లు): 536 ఎకరాలు
విద్యానగర్‌ (16 సర్వే నంబర్లు): 115 ఎకరాలు
బాధిత కుటుంబాలు: 10వేలకుపైగాప్లాట్లు, 
6,000 పైగా ఇండ్లు

​​నవతెలంగాణ – కరీంనగర్‌ ప్రాంతీయ ప్రతినిధి
​ అరవై ఏండ్లు దాటిన ఆ వృద్ధుడి కండ్లల్లో కన్నీరు సుడులు తిరుగుతోంది. ముప్పై ఏండ్ల కిందట చెమటోడ్చి, రక్తాన్ని కూడు చేసుకుని దాచుకున్న పైసలతో కొన్న స్థలం అది. ఇప్పుడు కూతురి పెండ్లి చేయాలి.. ఆ ప్లాటు అమ్ముకుందామంటే రిజిస్ట్రేషన్‌ ఆఫీసులో ‘నిషేధిత భూమి’ బోర్డు కనిపిస్తోంది. కోర్టు చుట్టూ తిరిగారు. న్యాయం గెలిచింది. క్రయవిక్రయాలు చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కానీ, అధికారుల ఉదాసీనత ఆ కోర్టు తీర్పును కూడా చెత్తబుట్టలోకి నెట్టేసింది. ఫలితం పదివేల ప్లాట్లు, ఆరువేల ఇండ్ల యజమానులు ఇప్పుడు సొంత భూమిలోనే పరాయివాళ్లలా బతుకుతున్నారు. కరీంనగర్‌ శివారులోని రేకుర్తి, విద్యానగర్‌ కాలనీల్లో ఇప్పుడు ఏ ఇంట చూసినా ఇదే ఆక్రందన.. ఇదే ఆవేదన.

​30 ఏండ్లు లేని తిరకాసు.. ఇప్పుడెందుకు?
​ కరీంనగర్‌ శివారులోని రేకుర్తి గ్రామ 19, 20, 21 డివిజన్లలో గల 125 సర్వే నంబర్లలోని 536 ఎకరాలు, విద్యానగర్‌ 16 సర్వే నంబర్లలోని 115 ఎకరాల భూమిని 22/ఏ(1)9(డీ) సీలింగ్‌ యాక్టు కింద నిషేధిత జాబితాలో చేర్చారు. నిజానికి 1997లో అప్పటి కలెక్టర్‌ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ సీలింగ్‌ యాక్టు ప్రస్తావన వచ్చింది. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కోర్టులు, అధికారులు ఆ నివేదికను పక్కన పెట్టడంతో ముప్పై ఏండ్లుగా ఎలాంటి అవాంతరాల్లేకుండా రిజిస్ట్రేషన్లు జరిగాయి. కానీ, గత ఏడాది నుంచి అధికారులు పాత రికార్డులను దుమ్ము దులిపి మళ్లీ సీలింగ్‌ పేరిట సామాన్యుల గొంతు నొక్కుతున్నారు.

​ పన్నుల వసూళ్లలో ఉన్న ఉత్సాహం.. హక్కులివ్వడంలో ఏది?
​బాధితుల ఆగ్రహానికి, ఆవేదనకు బలమైన కారణం ఉంది. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారినా వీరి నుంచి పన్నులు వసూలు చేయడం మాత్రం ఆపలేదు. ఈ కాలనీల్లోని 80 శాతం ఇండ్లకు మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలు పర్మిషన్లు ఇచ్చాయి. దశాబ్దాలుగా వీరు ప్రభుత్వానికి ఆస్తి పన్ను చెల్లిస్తూనే ఉన్నారు. మిషన్‌ భగీరథ నీళ్లు ఇచ్చిందీ.. సీసీ రోడ్లు వేసిందీ ప్రభుత్వమే. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం వేలాది రూపాయల ఫీజులను ఆన్‌లైన్‌ ద్వారా ముక్కుపిండి వసూలు చేశారు. ‘మా భూములు అక్రమమైతే మా డబ్బులతో సీసీ రోడ్లు ఎలా వేశారు? ఇంటి పన్నులు ఎందుకు తీసుకున్నారు? ఎల్‌ఆర్‌ఎస్‌ పేరిట లక్ష‍లాది రూపాయలు ఎలా వసూలు చేశారు? డబ్బులు తీసుకునేటప్పుడు లేని నిషేధం.. రిజిస్ట్రేషన్‌ అనగానే ఎందుకు గుర్తొస్తోంది?’ అంటూ బాధితులు ఆగ్రహిస్తున్నారు.

​ సామాన్యుల జీవితాలు ఛిన్నాభిన్నం
ఈ భూములను నమ్ముకుని, అత్యవసర సమయాల్లో అమ్ముకోవచ్చని ఆశపడిన దిగువ, మధ్యతరగతి కుటుంబాల జీవితాలు రోడ్డున పడ్డాయి. పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజులు కట్టలేక, ఆడపిల్లల పెండ్లిళ్లు నిశ్చయమైనా చేతిలో పైసలు లేక, ఆస్పత్రి ఖర్చులకు దారిలేక వందలాది మంది కుమిలిపోతున్నారు. బాధితులంతా కలిసి హైకోర్టును ఆశ్రయించగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. క్రయవిక్రయాలు జరుపుకోవచ్చని కోర్టు ఆదేశించినా.. స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం ఫైళ్లను కదల్చడం లేదు. ప్రతి సోమవారమూ కలెక్టరేట్‌లో జరిగే ‘ప్రజావాణి’ అర్జీలతో నిండిపోతోంది. కలెక్టర్‌ చుట్టూ, మంత్రుల చుట్టూ తిరిగి బాధితుల కాళ్లు అరిగిపోతున్నాయి తప్ప, సమస్యకు పరిష్కారం మాత్రం లభించడం లేదు.

ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజులు తీసుకుని మోసం చేస్తారా?
పాశం మోహన్ రెడ్డి, రేకుర్తి విద్యానగర్ బాధితుల ఐక్యవేదిక కన్వీనర్
​ఈ ప్రాంతంలో భూములు కొన్నవాళ్లంతా రెక్కాడితేగానీ డొక్కాడని సామాన్యులే. రేకుర్తి, విద్యానగర్‌లో భూములు నిషేధిత జాబితాలో ఉంటే మున్సిపల్‌ అధికారులు మా దగ్గర ఎల్‌ఆర్‌ఎస్‌ కింద డబ్బులు ఎందుకు వసూలు చేశారు? అధికారులు పర్మిషన్‌ ఇస్తేనే కదా ఇండ్లు కట్టుకున్నది? ఈ సమస్యపై మంత్రులను కలిసి మొరపెట్టుకున్నా ఫలితం లేదు. కోర్టు ఆర్డర్‌ ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం దారుణం.

పిల్లల చదువులు, పెండ్లిళ్లు ఆగిపోతున్నాయి
అరికల పద్మ, గృహిణి-విద్యానగర్‌
​ 30 ఏండ్ల నుంచి లింక్ డాక్యుమెంట్లన్నీ చూశాకే స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఇల్లు కట్టుకుందామని పర్మిషన్ కూడా తీసుకున్నాం. తీరా మా అమ్మాయి పెండ్లి కోసం అమ్ముదామంటే దాన్ని నిషేధిత జాబితాలో పెట్టారు. ఇప్పుడు అమ్మాయికి కట్నం కింద ఇవ్వలేం. ఇల్లు కట్టేందుకు పర్మిషన్ గడువు కూడా ముగిసింది. కోర్టుకెళ్తే అధికారుల నిర్ణయం తప్పని తీర్పు వచ్చింది. అయినా లిస్టు నుంచి తీయడం లేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -