నేటి కాలంలో చాలా మంది విద్యార్థులు ప్రతిరోజూ స్కూల్ లేదా కాలేజీకి వెళుతున్నప్పటికీ, ‘నేను ఎందుకు చదువుతున్నాను?’, ‘ఈ విద్య నాకు ఏం ఉపయోగపడుతుంది?’, ‘నా జీవిత లక్ష్యం ఏమిటి?’ అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఫలితంగా చదువు ఒక ఆనందకరమైన అభ్యాస ప్రక్రియ కాకుండా కేవలం మార్కులు, పరీక్షలు, తల్లిదండ్రుల ఒత్తిడి లేదా సమాజం ఆశించిన దారిలో నడవాల్సిన బాధ్యతగా మారుతోంది.
మానసిక గందరగోళం: మనిషి ఏ పని చేసినా దాని వెనుక ఒక అర్థం లేదా లక్ష్యం ఉంటేనే దానిపై ఆసక్తి పెరుగుతుంది. కానీ చాలామంది విద్యార్థులు చదువు ఎందుకు అవసరమో, తమ భవిష్యత్తుకు అది ఎలా ఉపయోగపడుతుందో అర్థం చేసుకోకుండా కేవలం రొటీన్‌గా క్లాసులకు హాజరవుతుంటారు. ఈ పరిస్థితిని మనోవిజ్ఞాన శాస్త్రంలో ‘లాక్ ఆఫ్ పర్పస్’ (Lack of Purpose) అని పిలుస్తారు. దీని వల్ల చదువుపై ఆసక్తి తగ్గడం, ఏకాగ్రత లోపించడం, పనులను వాయిదా వేయడం వంటి సమస్యలు కనిపిస్తాయి.
ఆత్మన్యూనతకు కారణం: చదువులో బాగా రాణించే విద్యార్థులను చూసి తమను తాము తక్కువగా అంచనా వేసుకునే వారు చాలామంది ఉంటారు. ‘అతను అంత బాగా చదువుతున్నాడు, నేను ఎందుకు చేయలేకపోతున్నాను?’ అనే ఆలోచనలు వారిలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. పదేపదే పోల్చుకోవడం వల్ల తమ సామర్థ్యాలను గుర్తించలేకపోతారు. ఫలితంగా చదువుపై భయం పెరిగి, ప్రయత్నించాలనే ఉత్సాహం కూడా తగ్గిపోతుంది.
మానసిక కారణం: విద్యార్థులు ఎక్కువగా ఇష్టమైన సబ్జెక్టులకే సమయం కేటాయించి, కష్టంగా అనిపించే అంశాలను దూరం పెడతారు. ఇది సోమరితనం కాదు. చాలాసార్లు అది విఫలమవుతామనే భయం. ఒక విషయం అర్థం కాకపోతే, దానిని ఎదుర్కోవడం కంటే తప్పించుకోవడం సులభంగా అనిపిస్తుంది. కానీ ప్రతి సారి అలా తప్పించుకోవడం వల్ల ఆ విషయం మరింత క్లిష్టంగా అనిపించి ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి కష్టంగా అనిపించే అంశాలకు చిన్నచిన్న లక్ష్యాలు పెట్టుకుని క్రమంగా నేర్చుకోవడం ఉత్తమ మార్గం.
పెరిగే ఒత్తిడి: చాలా మంది విద్యార్థులు కోర్సు ప్రారంభంలో సమయాన్ని సరిగ్గా ఉపయోగించకుండా, పరీక్షల ముందు అన్ని చదివేయొచ్చని భావిస్తారు. కానీ చివరి నిమిషంలో చదవడం మెదడుపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల నేర్చుకున్న విషయాలు కూడా పరీక్ష సమయంలో గుర్తుకు రాకపోవచ్చు. సైకాలజీ ప్రకారం నిరంతర అభ్యాసం(Consistent Learning) మెదడులో సమాచారాన్ని దీర్ఘకాలం నిల్వ ఉంచుతుంది. అందుకే టైమ్ టేబుల్ రూపొందించుకుని, ప్రతిరోజూ కొద్దికొద్దిగా చదవడం అవసరం.
అన్నీ ఒకేసారి: సోషల్ మీడియా ప్రభావంతో చాలా మంది విద్యార్థులు ఒకేసారి చదువు, నైపుణ్యాలు, పోటీ పరీక్షలు, హాబీలు అన్నింటిలోనూ రాణించాలని ప్రయత్నిస్తుంటారు. కానీ మెదడుకు కూడా ఒక పరిమితి ఉంటుంది. ఒకేసారి అనేక పనులపై దష్టి పెట్టడం వల్ల ఏ పనిలోనూ పూర్తి ఫలితం రాదు. అందుకే ప్రాధాన్యతలను గుర్తించి, అత్యవసరమైన పనులను ముందుగా పూర్తి చేయడం నేర్చుకోవాలి.
మార్కులు మాత్రమే కాదు: చాలా మంది విద్యార్థులు చదువును కేవలం పరీక్షలు పాస్ కావడానికి లేదా ఉద్యోగం సంపాదించడానికి మాత్రమే ఉపయోగపడే సాధనంగా చూస్తారు. కానీ నిజానికి విద్య అనేది వ్యక్తిత్వ వికాసం, ఆలోచనా శక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సమాజాన్ని అర్థం చేసుకునే దష్టిని పెంచే ప్రక్రియ. ఈ అవగాహన వచ్చినప్పుడు చదువుపై దక్పథం పూర్తిగా మారుతుంది.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర: విద్యార్థులపై కేవలం మార్కుల ఒత్తిడి పెంచడం కంటే, వారు ఎందుకు చదువుతున్నారో అర్థం చేసుకునేలా మార్గనిర్దేశం చేయడం అవసరం. వారి ఆసక్తులు, బలాలు, భవిష్యత్ లక్ష్యాల గురించి మాట్లాడాలి. ప్రశ్నలు అడిగే స్వేచ్ఛను ఇవ్వాలి. అప్పుడు చదువు ఒక భారంగా కాకుండా, జీవితాన్ని నిర్మించుకునే అవకాశంగా కనిపిస్తుంది.
వెళ్లడం మాత్రమే విద్య కాదు: ‘నేను ఎందుకు నేర్చుకుంటున్నాను?’, ‘నా భవిష్యత్తులో దీని పాత్ర ఏమిటి?’ అనే ప్రశ్నలకు సమాధానం వెతకడం నిజమైన విద్యకు ప్రారంభం. లక్ష్యం స్పష్టంగా ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అలవాటవుతుంది, ఇతరులతో పోల్చుకోవాల్సిన అవసరం ఉండదు. విద్యార్థి తన ప్రయాణానికి అర్థం కనుగొన్నప్పుడు మాత్రమే చదువు ఒత్తిడిగా కాకుండా, వ్యక్తిత్వ వికాసానికి మార్గంగా మారుతుంది.
డా|| హిప్నో పద్మా కమలాకర్,
9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



