- మండల అధ్యక్షులు కందుల నరసింహులు
నవతెలంగాణ–ఆలేరు రూరల్: మాదిగల ఆరాధ్య దైవంగా భావించే, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఈ నెల 25 నుంచి 30వ తేదీ వరకు గ్రామస్థాయిలో నూతన ఎమ్మార్పీఎస్ కమిటీల ఏర్పాటు చేపట్టాలని నిర్ణయించినట్లు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కందుల నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మాట్లాడుతూ.. గ్రామ కమిటీల ఏర్పాటు విషయంలో అనుసరించాల్సిన నియమ నిబంధనలను వెల్లడించారు.గ్రామ కమిటీలలో సభ్యులుగా ఎంపికయ్యే వారు విద్యావంతులై ఉండటంతో పాటు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలని సూచించారు.
అలాగే మాదిగల హక్కులు,సామాజిక అభివృద్ధిపై అవగాహనతో పాటు ఉద్యమ స్ఫూర్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు,సమయపాలన, అంకితభావం కలిగి ఉండాలని పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామస్థాయిలో బలమైన కమిటీల నిర్మాణం ద్వారా మాదిగల ఐక్యతను పెంపొందించి, హక్కుల సాధన కోసం సమిష్టిగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.ఎమ్మార్పీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో గ్రామ స్థాయి కమిటీలను బలోపేతం చేసి సామాజిక న్యాయం,అభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని కోరారు.



