నవతెలంగాణ-ఆలేరు టౌను
ఆలేర్ రెవిన్యూ డివిజన్ ఏర్పాటుతో ప్రాంత అభివృద్ధికి నాంది పలికినట్లు అవుతుంది. రెవిన్యూ డివిజన్ ఏర్పాటు కోరుతూ కోరుతూ.. ఈనెల 31న పట్టణ బందుకు, ఆలేరు రెవెన్యూ డివిజన్ సాధన కమిటీ పిలుపునిచ్చింది. ఆలేరు పట్టణంలో బుధవారం ఆలేరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు కాలయాపన సరి కాదని రెవిన్యూ డివిజన్ సాధన కమిటీ సభ్యులు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆలేరు పేరుకే అసెంబ్లీ, అన్ని రంగాల్లో విద్యారంగంలో, వైద్యరంగంలో, పరిశ్రమ రంగాల్లో, వ్యాపార రంగంలో పూర్తిగా వెనుకబడిపోతున్నది , గత పాలకుల అసమర్ధత వలన,ఆలేరు పూర్తిగా నిర్వీర్యం అవుచున్నదని యువత ప్రజలు వాపోతున్నారు.
ఆలేరు 1984 సంవత్సరం పూర్వం తాలూకా కేంద్రం నాటి నుండి ఆలేరు ప్రాంత అభివృద్ధి జరగాల్సిన అంత జరగలేదని చెప్పాల్సి ఉంటుంది. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు, సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఏసిపి ఆఫీసు, ఆర్ అండ్ బి డి ఈ ఆఫీసు మరియు ఈ మధ్యన ఆలేరుకు రావలసిన మెడికల్ కాలేజ్,100 పడకల హాస్పిటల్, ఇంటిగ్రేటెడ్ స్కూలు , ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేరే ప్రాంతాల తరలిపోవడం వలన ఆలేరు పూర్తిగా నిర్విర్యమయే ప్రమాదం ఉన్నదని ముక్త కంఠంతో యువత సబండ వర్గాల ప్రజలు వాపోతున్నారు. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవిన్యూ డివిజన్ ఏర్పాటు అయితే తప్ప, వేరే అవకాశం లేదని ప్రాంత ప్రజలు తేల్చి చెబుతున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్ల ఐలయ్య మేము అధికారుల్లోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని గుర్తు చేస్తున్నారు.
తరువాత జరిగిన గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలలో, త్వరలో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ప్రచార సభలో ప్రకటించారని చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి మూడు సంవత్సరాలు పూర్తి కావచ్చిందని, వెంటనే రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తన కృషితో ప్రభుత్వం నుండి ప్రకటన విడుదల చేయించాలని, ఇటీవల జరిగిన వరస సమావేశాలలో రెవిన్యూ డివిజన్ సాధన సమితి సభ్యులు కోరారు.
ఈనెల 31వ తేదీ జరిగే ఆలేరు పట్టణ బంద్ మరియు ధర్నా కార్యక్రమానికి పార్టీలకతీతంగా అన్ని పార్టీలు పాల్గొని వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు ,విద్యార్థి సంఘాలు ,స్వచ్ఛంద సేవా సంస్థలు పాల్గొని ,ఆలేరు అభివృద్ధి కోసం కలిసికట్టుగా కృషి చేయాలని యువత పెద్ద ఎత్తున చర్చించుకుంటుంది.



