Sunday, May 24, 2026
E-PAPER
Homeజిల్లాలుక్యూబా ఒంటరి కాదు: సిపిఐ(ఎం)

క్యూబా ఒంటరి కాదు: సిపిఐ(ఎం)

- Advertisement -


నవతెలంగాణ-వనపర్తి
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో అమెరికా క్యూబా పై దృష్టి సారించామని ప్రకటించిన బెదిరింపులకు సమాధానంగా క్యూబా ఒంటరి కాదని..అమెరికా క్యూబా నుండి వైదొలగాలని సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, కార్యదర్శివర్గ సభ్యులు ఎండి జబ్బార్ అన్నారు. సిపిఐ(ఎం) వనపర్తి పట్టణ రాజకీయ శిక్షణ తరగతులను పార్టీ పట్టణ కార్యదర్శి ఎం పరమేశ్వర చారి ఆదివారం స్థానిక లిటిల్ బర్డ్స్ పాఠశాలలో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు ప్రిన్సిపల్ గా పరమేశ్వర చారి వ్యవహరించారు. మొదట “జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు “అనే అంశంపై సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. జబ్బార్ క్లాస్ బోధించారు. రెండో అంశము “సిపిఎం పార్టీ నిర్మాణం -శాఖలు – సభ్యుల పని విధానం కమ్యూనిస్టుల విశిష్టత” అనే అంశంపై సిపిఐ(ఎం) జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు క్లాస్ బోధించారు.

ఈ సందర్భంంగా వారు మాట్లాడుతూ.. క్యూబన్ విప్లవ చారిత్రక నాయకుడైన రౌల్ కాస్ట్రో రూజ్‌పై అమెరికా న్యాయ శాఖ ఇటీవల ప్రకటించిన దిగ్భ్రాంతికరమైన, చట్టవిరుద్ధమైన అభియోగాన్ని సిపిఐ(ఎం) ఖండిస్తున్నదన్నారు. అమెరికా సామ్రాజ్యవాదం ప్రపంచ పోలీసులాక వ్యవహరిస్తున్నదని.. ఇది సరైనది కాదని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 21న, తాము ‘క్యూబాపై దృష్టి సారించామని’ ఆ ద్వీపంపై దాడి చేయాలనుకుంటున్నామని ప్రకటించారన్నారు. క్యూబాలోని సామ్యవాద వ్యవస్థకు తాము వ్యతిరేకమని, అందువల్ల అక్కడ అస్థిరత సృష్టించి, పాలన మార్పును తీసుకురావాలని ఆసక్తిగా ఉన్నామని అమెరికా బహిరంగంగా చెబుతుండడం చెత్త వ్యతిరేకమని తెలిపారు.

క్యూబాపై అమెరికా సామ్రాజ్యవాద బెదిరింపులను సీపీఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందన్నారు. అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా స్థిరంగా, ఐక్యంగా నిలిచిన క్యూబా ప్రజలకు, క్యూబా విప్లవ నాయకత్వానికి సిపిఎం కేంద్ర కమిటీ మరోసారి గట్టి సంఘీభావం తెలిపిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి ప్రజలపై రోజురోజుకు భారాలు పెంచుతున్నదని విమర్శించారు. పెంచిన చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో బిజెపి నాయకుడు ఒక మహిళ లాయర్ కు మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేషాడని రుజువు కావడంతో జైలుకు వెళ్లి వస్తుండగా జైలు గేటు నుండి బయటికి రాగానే ఆ అత్యాచార నిందితుడు బిజెపి నాయకుడి కాళ్లు మొక్కి శాలువాలు కప్పి పూలదండలేసి ఎత్తుకొని ఊరేగింపు చేశారని, ఇది బిజెపి సంస్కృతి అని విమర్శించారు. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకులు అభిజిత్ ను భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరించడాన్ని సిపిఐ(ఎం) తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై యువత నుంచి వస్తున్న తీవ్ర వ్యతిరేకతను గమనించి విధానాలను మోడీ మార్చుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనాలని లారీలు లేక సంచులు లేక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు వారి ధాన్యానికి భద్రత కల్పించాలని తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని డిమాండ్ చేశారు.

కేరళ రాష్ట్రంలో సిపిఐ(ఎం) ఎల్డిఎఫ్ 2 సార్లు ఏకధాటిగా గెలిచి మూడోసారి ఓడిపోయిన అంతమాత్రాన కమ్యూనిస్టుల పని అయిపోయిందని బూర్జువా మీడియా ఊదరగొట్టడం సరైనది కాదని, కార్మిక వర్గం కష్టజీవులు ఉన్నంతకాలం ఎర్రజెండా అజయమైందని, ఓట్లు సీట్ల కోసమే సిపిఐ(ఎం) పనిచేయడం లేదని, కార్మిక వర్గ ఐక్యతతో విప్లవము జయప్రదం చేసి సోషలిజం సాధించడమే దాని లక్ష్యమని వివరించారు. ఈ క్లాసుల్లో సిపిఐ(ఎం) వనపర్తి పట్టణ నాయకులు 18వ వార్డు కౌన్సిలర్ గంధం మదన్, సిపిఎం పట్టణ నాయకులు డి కురుమయ్య, జి బాలస్వామి బిసన్న పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వెంకట్ రాములు నాయకులు జి దేవేందర్ రత్నయ్య విజయ్ కుమార్ భాస్కర్ నందిమల్ల రాములు సిపిఎం జిల్లా కమిటీ ఆఫీస్ కార్యదర్శి ఉమా డి శ్రీనివాసులు ఎం మన్యం జి మన్యం వనపర్తి పట్టణ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -