సకాలంలో అందని బిల్లులు
నవతెలంగాణ – మల్హర్ రావు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి కేటాయిస్తున్న నిధులు సరిపోవడం లేదని మధ్యాహ్న భోజన నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూరగాయలు, కిరాణా సరుకులు, గుడ్డు ధరలు పెరిగినా పాత రేట్తోనే బిల్లులు చెల్లిస్తుండడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో వారానికి ఒక రోజు ఇచ్చే గుడ్డును ఇప్పుడు మూడు రోజులకు పెంచారు. కానీ ప్రభుత్వం గుడ్డుకు రూ.6 మాత్రమే ఇస్తుండగా మార్కెట్లో రూ.9.10గా ఉంది. మిగిలిన రూ.3.10లు నిర్వాహకులే భరించాల్సివస్తోంది.పైగా సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో వడ్డీలకు అప్పులు చేసి భోజనం పెడుతున్నామని మధ్యాహ్న భోజన నిర్వాహకులు వాపోతున్నారు.
మండలంలో 25 ప్రాథమిక పాఠశాలలు, రెండు ప్రాథమికోన్నత, 5 జిల్లా పరిషత్, ఒక మోడల్ స్కూల్, ఒక కస్తూరిబ్బా ఆశ్రమ పాఠశాల, మొత్తం 34 పాఠశాలున్నాయి. ఇందులో మొత్తం 1406 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని నిర్వాహకులు అందిస్తున్నారు. గుడ్డు, ఇతర సరుకుల ధరలు పెరిగినా వారికి చెల్లించే బిల్లులు మాత్రం పెరగడం లేదని, ఆంగన్వాడీ కేంద్రాలకు అందిస్తున్నట్లు ప్రభుత్వమే గుడ్డు, సరుకులు పంపిణీ చేయాలని లేదంటే పెరిగిన సరుకులకు అనుగుణంగా రేట్లు పెంచాలని నిర్వాహకులు కోరుతున్నారు.
మధ్యాహ్న భోజనం ధరలు ఇలా..
ఒక్కొక్కరికి…ఒక్కొక్క రోజుకూ..1వ తరగతి నుంచి 5వ వరకు రూ.6 నుంచి రూ.7. తరగతి 6 నుంచి 8వ వరకు రూ.10 నుంచి రూ.17.తరగతి 9 నుంచి 10వరకు రూ.13 నుంచి రూ.17



