Monday, May 25, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంధాన్యం కొనట్లేదని రైతుల నిరసన​

ధాన్యం కొనట్లేదని రైతుల నిరసన​

- Advertisement -

లారీల కొరతే అసలు సమస్య
నవతెలంగాణ – వీర్నపల్లి/ రామారెడ్డి/కొల్చారం / నంగునూరు
రాష్ట్రంలో రైతుల ఆందోళనలు జరుగుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేపట్టాలని, తరుగు తీయడం ఆపేయాలని కోరుతూ రైతులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్‌పల్లి ఐకేపీ కేంద్రంలో రెండు నెలలుగా ధాన్యాన్ని కొనడం లేదని ఆదివారం రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు కేవలం 40శాతం మాత్రమే కొన్నారని వాపోయారు. లారీలు రాకపోవడమే ప్రధాన అడ్డంకిగా మారిందని చెప్పారు. మే 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండటంతో ఎండలు, వర్షాల భయమేస్తుందన్నారు. కేంద్రం పరిసరాల్లో చిరుత పులి సంచారం భయపెడుతుండగా, రాత్రి వేళల్లో అడవి పందులు ధాన్యాన్ని ధ్వంసం చేస్తున్నాయని ఆవేదన చెందారు.

రోడ్డుపై బైటాయించిన రైతులు
వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే తరలించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని అన్నారం గ్రామంలో రైతులు ఆదివారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో హమాలీల కొరత, నేడు లారీల కొరతతో పంటను కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానున్నందున.. ధాన్యం తడిసే అవకాశం ఉందని, వర్షాకాలం పెట్టుబడికీ ఆర్థికంగా ఇబ్బందులుంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

లారీల కోసం రోడెక్కిన రైతులు
వరి ధాన్యంతూకం వేసి వారం రోజులు అవుతున్నప్పటికీ లారీలు రావడంలేదని మెదక్‌ జిల్లా కొల్చారం మండలం సంగాయిపేట గ్రామంలో రైతులు రోడ్డెక్కారు. సుమారు గంటపాటు మెదక్- సంగారెడ్డి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ట్రాన్స్పోర్ట్ లారీలు రావడంలేదని ప్రైవేట్ లారీలు ధాన్యం లోడ్ చేయాలంటే రూ.15,000 వరకు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు నిర్లక్ష్యం మూలంగానే లారీలు సకాలంలో రావడంలేదన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని పాలమాకుల గ్రామంలో గల ఐకేపీ కొనుగోలు కేంద్రంలో క్వింటాలుకు మూడు కిలోల తరుగును తీయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట-హన్మకొండ జాతీయ రహదారిపై ఆదివారం రైతులు రాస్తారోకో చేపట్టారు. లారీల కొరత లేకుండా.. తరుగు కట్ చేయకుండా ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -