Sunday, July 26, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంయువత వీరోచిత పోరాటం స్ఫూర్తిదాయకం

యువత వీరోచిత పోరాటం స్ఫూర్తిదాయకం

- Advertisement -

విద్యార్థుల పోరాటానికి దిగొచ్చిన కేంద్రం
అక్రమాలకు నిలయంగా మారిన ‘ఎన్టీఏ’ను వెంటనే రద్దు చేయాలి : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య

నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
​ప్రశ్నాపత్రాల లీకేజీలపై దేశ విద్యార్థి లోకం, యువత చేసిన అకుంటిత పోరాటానికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దిగొచ్చిందని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకం సాధించిన చారిత్రాత్మక విజయమని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ముకుంద లాల్‌ మిశ్రా భవన్‌లో శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ​పరీక్షా పత్రాల లీకేజీలపై విద్యార్థులు సుదీర్ఘ పోరాటం చేశారని, పోలీసుల లాఠీచార్జీని సైతం లెక్కచేయకుండా విద్యార్థులు చూపిన పోరాటపటిమ స్ఫూర్తిదాయకంగా నిలిచిందని చెప్పారు. దేశ భవిష్యత్‌ యువత చేతుల్లోనే ఉందనడానికి ఈ ఉద్యమమే ప్రత్యక్ష నిదర్శనమన్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలపై విద్యార్థులు పోరాడుతుంటే, ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు వారిపై దేశ ద్రోహ ముద్రలు వేసే కుట్ర చేశాయని అన్నారు. నిరాహార దీక్ష చేస్తున్న వారిని, ఉద్యమకారులను చైనా ఏజెంట్లుగా, ఉగ్రవాదులుగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ దేశ ప్రజలంతా విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా నిలిచి వారిని ముందుకు నడిపించారని చెప్పారు.

​ఇది ప్రజా విజయం
పేపర్ లీకేజీలు జరుగుతున్నా, పదేపదే నిరసనలు తెలిపినా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించకుండా ముఖం చాటేశారని వీరయ్య విమర్శించారు. ప్రధాని మోడీ కూడా ఇన్ని రోజులు ఆయనను కాపాడుకుంటూ వచ్చారని, అయితే విద్యార్థి లోకం గర్జనతో చివరకు దిగిరాక తప్పలేదని అన్నారు. ప్రజా ఉద్యమాలకు ఏనాడూ స్పందించని ప్రధాని మోడీ, అర్ధరాత్రి వేళ సెల్ఫీ వీడియో ఫుటేజ్ విడుదల చేయాల్సి వచ్చిందని చెప్పారు. చివరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదని, ఇది కేవలం విద్యార్థుల విజయమే కాదు, దేశ ప్రజలందరి విజయమని అన్నారు. కేంద్ర మంత్రి రాజీనామాతో సరిపోదని, విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షా పత్రాల లీకేజీకి ప్రధాన మూలం విద్యారంగాన్ని ప్రయివేటీక రించడమేనని, పోటీ పరీక్షల నిర్వహణను ప్రయివేట్ సంస్థలకు అప్పగించడం వల్లే ఈ అక్రమాలు జరుగుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రయివేట్ కోచింగ్ సెంటర్లు ర్యాంకుల కోసం ప్రశ్నాపత్రాలను చేజిక్కిం చుకుంటున్నాయని ఆరోపించారు. ఎన్టీఏ నిర్వహిస్తున్న పరీక్షల తీరు ఎన్నోసార్లు అపహాస్యమైందని, వెంటనే ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యారంగంలో రాష్ట్రాల హక్కులను హరిస్తూ కేంద్రం వ్యవహరిస్తున్న తీరును మార్చుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వాసుదేవ రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు వర్ణ వెంకట్ రెడ్డి, గీట్ల ముకుంద రెడ్డి, గుడికందుల సత్యం, జిల్లా కమిటీ సభ్యులు నరేష్, సీనియర్ నాయకులు పుల్లెల మల్లయ్య, రాయికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -