వెంటనే సాగునీరు విడుదల చేయాలి : సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి
భూక్యా వీరభద్రం డిమాండ్
నీటిపారుదల శాఖ (ఐబి) కార్యాలయం వద్ద ధర్నా
నవతెలంగాణ-వైరాటౌన్
వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే సాగునీటిని విడుదల చేయాలని సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఐ(ఎం) వైరా రూరల్, టౌన్ కమిటీల పిలుపు మేరకు శనివారం రైతులు మధిర రింగ్ రోడ్డు నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి వైరా నీటిపారుదల శాఖ (ఐబి) కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టు డీఈ నాగబ్రహ్మంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు సుంకర సుధాకర్, వైరా రూరల్ కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు మాట్లాడారు. సీతారామ కాల్వ ద్వారా నీరు వస్తుందని ప్రకటించి తొలుత వైరా ప్రాజెక్టు ఆయకట్టుకు వరి సాగు కోసం పరిమితంగా నీటిని విడుదల చేశారని తెలిపారు. అనంతరం ఎల్‌నినో ప్రభావం పేరుతో మధ్యలోనే నీటి విడుదల నిలిపివేయడం వల్ల సుమారు 25 వేల ఎకరాల సాగుభూములు బీడుబారే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారుల ముందుచూపు లేని నిర్ణయాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వైరా ప్రాజెక్టులో నీటిమట్టం16.6 అడుగులు ఉండటంతోపాటు సీతారామ కాలువల ద్వారా నిరంతరం నీరు వస్తున్నందున సాగుకు విడుదల చేయడానికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు.
గతంలో ప్రాజెక్టులో 10–12 అడుగుల నీరున్నా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేసి పంటలను కాపాడిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు. ప్రస్తుతం నీటి లభ్యత అనుకూలంగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి వైరా ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కొనసాగిస్తే ఆయకట్టు పరిధిలోని రైతులు, రైతు సంఘాలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలను ఐక్యం చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే రైతాంగమే స్వయంగా కాలువలకు నీటిని విడుదల చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, వైరా మున్సిపల్ కౌన్సిలర్ కిన్నెర కృష్ణ, అష్టగుర్తి సర్పంచ్ కంచర్ల అనిత, పార్టీ నాయకులు మచ్చా మణి, తోట నాగేశ్వరావు, తూము సుధాకర్, మాగంటి తిరుమలరావు, చెరుకుపల్లి కుటుంబరావు, మల్లెంపాటి రామారావు, కొంగర సుధాకర్, పైడిపల్లి సాంబశివరావు, తోట కృష్ణవేణి, ఎస్.వెంకటరెడ్డి, ద్రోణాదుల నాగేశ్వరరావు, చిత్తారు నాగరాజు, కంచర్ల నాగేశ్వరరావు, వీసీ సత్యనారాయణ, ముత్తమాల విజయరాజు, బాణాల కృష్ణమాచారి, మాడపాటి మల్లికార్జునరావు పాల్గొన్నారు.
వైరా రిజర్వాయర్ ఆయకట్టును కాపాడాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



