Tuesday, May 26, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిస్వదేశంలో పకోడీలు.. విదేశాల్లో కొలువులా!

స్వదేశంలో పకోడీలు.. విదేశాల్లో కొలువులా!

- Advertisement -


చేద్దామంటే కొలువు రాదు.. సాగిద్దామంటే వ్యాపారం లేదు. ఇది.. ఇప్పుడు దేశంలో ఉద్యోగం, ఉపాధి కరువైన కోట్లాదిమంది గోస. బీజేపీ అధికారంలోకి వస్తే ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న మోడీ గారి మాటలు నమ్మిన ఈ దేశపు యువత మూడో సారి అధికారాన్ని కట్టపెడితే.. మేక్‌ ఇన్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా అంటూ మొదట్లో ఊదరగొట్టారు. తరువాత పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని సెలవిచ్చారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఐటీ, స్టార్టప్ రంగాలు తీవ్రమైన ‘లేఆఫ్’ల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నిన్నమొన్నటి వరకు ఐటీ ఉద్యోగం అంటే ఒక హోదా, విలాసవంతమైన జీవితం, ఆర్థిక భద్రతకు కేరాఫ్ అడ్రస్‌గా భావించేవారు. కానీ, నేడు ఏ క్షణంలో ఏ ఉద్యోగికి ‘పింక్ స్లిప్’ వస్తుందో తెలియని ఉత్కంఠ భరిత, భయాందోళన వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో మన ప్రధాని యువతకు విదేశాలలో ఉద్యోగాలంటూ కొత్త పల్లవి అందు కున్నారు. తన విదేశీ పర్యటనలే అందుకంటు తేనె పలుకులు పలుకుతు న్నారు. ఆయన మాటలు వింటే ‘స్వదేశంలో పకోడీలు.. విదేశాల్లో కొలువులు’ అన్న చందంగా ఉన్నాయి.

విదేశాలలో భారతీయ యువతకు ఉద్యోగాల కల్పన కోసమే తాము దౌత్య సంబంధాలను నెరుపుతున్నామన్న ప్రధాని ప్రకటన… దేశంలో వేళ్లూనుకు పోయిన నిరుద్యోగ సంక్షోభాన్ని కప్పిపుచ్చే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు. వాస్తవానికి మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల ఆర్థిక విధానాల వల్ల దేశంలో నిరుద్యోగ సమస్య మునుపెన్నడూ లేనంత ఆందోళనకర స్థాయికి చేరింది. తాజా పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) గణాంకాల ప్రకారం, దేశంలో నిరుద్యోగిత రేటు క్రమంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా 15-29ఏండ్ల మధ్య వయసున్న యువతలో నిరుద్యోగిత రేటు దాదాపు పదిహేను శాతానికి పైగా ఉండటం తీవ్రమైన సంక్షోభానికి అద్దం పడుతోంది.

ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ శక్తులకు ధారాదత్తం చేయడం, దేశీయ సంపదను కొద్దిమంది పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడమే లక్ష్యంగా ప్రస్తుత పాలన సాగుతుందంటే అతిశయోక్తి కాదు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రైల్వే, బ్యాంకింగ్, రక్షణ వంటి కీలక రంగాలలో దాదాపు 30 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయకుండా, కొన్ని వేల మందికి నియామక పత్రాలు ఇస్తూ ‘రోజ్‌గార్ మేళా’ల పేరుతో ప్రధాని చేస్తున్న ప్రచారం కేవలం రాజకీయ గారడీ. నెలకు పది లక్షల మంది కొత్తగా ఉపాధి మార్కెట్లోకి వస్తుంటే, ప్రధాని విదేశీ పర్యటన యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికే అని చెప్పడం యువతను హేళన చేయడమే అవుతుంది. దీనికితోడు దేశంలో శాస్త్ర, సాంకేతిక, వైద్య రంగాలలోని ఉత్తమ ప్రతిభావంతులు విదేశాలకు తరలిపోతుండటం దేశ భవిష్యత్తుకు గొడ్డలిపెట్టు. విదేశీ ప్రయోజనాల కోసం స్వదేశీ మేధస్సును తరలించడాన్ని ఘనతగా ప్రభుత్వ అధినేత ప్రాజెక్ట్ చేయడం దారుణం. మన దేశ నిధులు, పన్నులతో చదువుకున్న యువత సేవలు దేశ వికాసానికి కాకుండా, విదేశీ శక్తుల లాభాల కోసం ధారపోయాల్సి రావడం పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ రూపమే.

వాస్తవానికి మోడీ గారి హయాంలో పెరిగింది పకోడీ విక్రేతలు, చౌకీదార్లు, చాయ్‌వాలాలే తప్ప.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కావు. మోడీ వల్లెవేస్తున్న ‘అచ్చేదిన్‌’లో యువతకు ఉపాధి అవకాశాలు పెరగకపోగా, గతంలో ఉన్న ఉద్యోగాలకే దిక్కులేదని వారి లెక్కలే చెబుతున్నాయి. కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం కొందరు వ్యాపారులు లక్షల కోట్లకు పడగలెత్తుతుంటే.. ధరల కాడి మోయలేక సామాన్యుల వెన్ను విరుగుతోంది.
తాజా గణాంకాల ప్రకారం.. గత పదేండ్లలో సంఘటిత రంగంలో ఉద్యోగ అవకాశాలు గణనీయంగా తగ్గాయి. దేశంలో ప్రతినెలా పదిహేను లక్షల మంది కొత్తగా ఉద్యోగాల కోసం క్యూ కడుతున్నారు. దీనివల్ల ప్రతీచోటా పోటీ తీవ్రమైంది. ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఒక్కో పోస్టుకు వేల సంఖ్యల్లో నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. ప్రపంచంలోనే రెండవ అతి వేగంగా పెరిగే ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అని గొప్పగా చెప్పుకుంటున్న దేశంలో ఉపాధి పరిస్థితి ఈ రకంగా అడుగంటడం ఘోరాతి ఘోరం.

ప్రస్తుతం దేశంలో ఉన్నత విద్యావంతులైన యువతలో నిరుద్యోగిత రేటు ఆందోళనకరంగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ, ఖాళీగా ఉన్న లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయకపోవడం, కునారిల్లుతున్న ప్రభుత్వ విద్యా, వైద్య రంగాలు నిరుద్యోగాన్ని మరింత పెంచుతున్నాయి. యువతకు కావలసింది విదేశాల్లో ఉపాధి వెతుక్కునే ‘వలస దౌత్యం’ కాదు. స్వదేశంలోనే గౌరవప్రదమైన వేతనంతో కూడిన శాశ్వత ఉద్యోగ అవకాశాలు. విదేశీ పర్యటనల ప్రచార ఆర్భాటాలు దేశీయ ఆకలి కేకలను, నిరుద్యోగ సెగలను దాచలేవు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విధానాలను వీడి, ప్రభుత్వ రంగ బలోపేతం, దేశీయ పారిశ్రామికీకరణ, శ్రామిక పక్షపాత ఆర్థిక విధానాల ద్వారా అంతర్గతంగానే ఉద్యోగ విప్లవాన్ని తీసుకురావాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -