నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తిని సిట్ అధికారులు సోమవారం విచారించారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో శ్రీరాంరెడ్డి అనే కాంగ్రెస్ నాయకుడి ఫోన్‌ను కూడా అప్పటి ఎస్‌ఐబీలోని ఫోన్ ట్యాపింగ్ టీంకు చెందిన అధికారులు పలు మార్లు ఈయన ఫోన్‌ను కూడా ట్యాపింగ్ చేసినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఆ సమయంలో పీసీసీ అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డితో పాటు ఆయన సోదరుడు తిరుపతిరెడ్డికి సంబంధించిన అనేక వివరాలను శ్రీరాంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎస్‌ఐబీలోని అధికారులు సేకరించి నట్టు బైటపడింది. రేవంత్‌రెడ్డి, తిరుపతిరెడ్డిలకు అత్యంత సన్నిహితంగా మెదులుతూ వారికి చెందిన అనేక కార్యకలాపాల్లో, రాజకీయ వ్యవహారాల్లో చురుకుగా పాలుపంచుకునే శ్రీరాంరెడ్డిని టార్గెట్‌గా చేసుకుని ఆయన ఫోన్‌లను ట్యాప్ చేయటానికి అప్పటి ఎస్‌ఐబీ ఐజీ ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ట్యాపింగ్ టీం వ్యవహారాలు నడిపించిందనీ సిట్ విచారణలో తేలింది. ఈ విషయమై శ్రీరాంరెడ్డి సైతం తన ఫోన్‌లతో పాటు కుటుంబ సభ్యుల ఫోన్‌లను కూడా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పలుమార్లు ట్యాపింగ్ చేశారని తాజాగా వాగ్మూలం ఇచ్చినట్టు తెలిసింది. ముఖ్యంగా రేవంత్‌రెడ్డితో పాటు, తిరుపతిరెడ్డి వ్యవహారాలు, వారి కదలికలు వారు ఎవరెవరిని కలుస్తున్నారు? బీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకులను ఎవరితో వీరు మాట్లాడుతున్నారు? వారి రాజకీయ వ్యూహాలు ఎంటనే విషయంలో శ్రీరాంరెడ్డి ఫోన్‌లు ట్యాపింగ్ చేయటం ద్వారా సమాచారాలను ప్రభాకర్‌రావు టీం సేకరించినట్టు శ్రీరాంరెడ్డి వాగ్మూలంలో నమోదైనట్టు తెలిసింది. వీరితో పాటు మరి కొందరు రేవంత్ రెడ్డి సన్నిహిత సహచరులను కూడా సిట్ అధికారులు పిలిచి వాంగ్మూలాలను రికార్డు చేయటానికి సమాయత్త మవుతున్నారు.
సీనియర్ ఐఏఎస్ అమోయ్ కుమార్ ను ఈడీ విచారణ
సీనియర్ ఐఏఎస్ అధికారి అమోయ్‌కుమార్‌ను సోమవారం ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న అమోయ్‌కుమార్ ప్రభుత్వ నిషేధిత స్థలాలుగా గుర్తించిన భూములను ప్రయివేట్ వ్యక్తులకు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా మహేశ్వరంలోని 42 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయించరాదని ప్రభుత్వం నిషేధిత జాబితాలో ఉంచింది. ఈ భూములను పరిరక్షించాల్సిన జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ తానే స్వయంగా ప్రయివేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసినట్టు పిర్యాదులు వధారా యి. దీనిపై ఆ సమయంలో మహేశ్వరం పోలీసులు కేసులు కూడా నమోదు చేసి విచారణ జరిపారు. అయితే ఈ విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు రావటంతో ఈడీ అధికారులు రంగంలో దిగారు. 2024లో ఒక సారి అమోయ్ కుమార్‌ను పిలిచి ఈడీ అధికారులు విచారణ జరిపారు. మనీ లాండరింగ్‌కు సంబం ధించి తాజాగా మరికొంత సమాచారం అందుకున్న ఈడీ అధికారులు మరో సారి పిలిచి, దాదాపు మూడు గంటల పాటు విచారించారు. అధికారులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
డీజీపీ కార్యాలయం రీ డిజైన్..
రాష్ట్ర పోలీసు శాఖ ప్రధాన కార్యాలయం డీజీపీ హెడ్‌క్వార్టర్స్‌లో రీ డిజైనింగ్‌తో కొత్త హంగులు ఏర్పాటు చేయటానికి రాష్ట్ర పోలీసు బాస్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. గతంలో హెచ్‌జె దొర డీజీపీగా ఉన్న సమయంలో లక్డీ కాఫూల్‌లోని ఈ కార్యాలయంలో కొత్త భవనాలు నిర్మాణం జరిగాయి. అనంతరం కొన్ని మార్పులు చేర్పులు జరిగినా యథాతధ స్థితి కొనసాగుతూ వస్తున్నది. రాష్ట్ర కొత్త డీజీపీగా చార్జి తీసుకున్నాక సోమవారం తన కార్యాలయంలోని వివిధ విభాగాలను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. దాదాపు మూడున్నర గంటల పాటు ఈ తనిఖీలు కొనసాగాయి. అధికారులు పని చేస్తున్న తీరు వారికున్న మౌలిక సదుపాయాలు, ఇబ్బందు లను ఆయన స్వయంగా పరిశీలించారు. కొన్ని విభాగాల్లో రికార్డుల నిర్వాహణ సవ్యంగా జరుగు తుండగా మరికొన్ని విభాగాల్లో అస్త వ్యస్తంగా పడి ఉండటాన్ని అయన గమనించారు. ఆ విషయమై అక్కడి అధికారులపై అసహనాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా సీఐడీ కార్యాలయంలో కొన్ని విభాగాలు ఇరకటంగా ఉండటాన్ని ఆయన చూసి వీటి విస్తరణను పెంచాలని అధికారులకు సూచించారు. ఇక డీజీపీ కార్యాలయంలో ప్రధాన కాన్ఫరేన్స్ హాలుతో పాటు మరికొన్ని విభాగాలను రీ డిజైనింగ్ చేయటం ద్వారా వాటి విస్తరణను పెంచాలని ఆయన నిర్ణయించారు. ఇక కార్యాలయంలో బీరువాలు, అలమారాలు, గోడలు మూడింటిని కూడా ఒకటే రంగులోకి మార్చటం ద్వారా కార్యాలయంలో మరింత క్రమశిక్షణ వాతావరణాన్ని తీసుకు రావాలని ఆయన అధికారులకు సూచించారు. మొత్తం మీద డీజీపీ కార్యాలయాన్ని మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన సొబగులు, హంగు రంగులను సమకూర్చడానికి డీజీపీ ఆనంద్ నడుం బిగించారు. రీ డిజైనింగ్‌కు సంబంధించిన ప్రక్రియను త్వరగా పూర్తి చేసి ఇవ్వాలని ఆయన సంబంధిత ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. తనిఖీలు నిర్వహించిన డీజీపీ వెంట రాష్ట్ర శాంతిబధ్రతల డీజీ మహేశ్ భగవత్, రాష్ట్ర పోలీసు టెక్నాలజీ డీజీ వీవీ శ్రీనివాసరావు, రాష్ట్ర అర్గనైజేషన్ డీజీ స్వాతిలక్రా,సీఐడీ డీజీ చారు సిన్హా తదితరులున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రీరాంరెడ్డిని సిట్ విచారణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



