ఫేజ్-1కు రూ.13,600 కోట్ల రీ ఫైనాన్సింగ్
ఐఆర్ఎఫ్సీతో రుణ ఒప్పందం
హైదరాబాద్ మెట్రోకు
భారీ ఆర్థిక ప్రయోజనం
పట్టణ రవాణా విస్తరణకు దీర్ఘకాలిక నిధుల సమీకరణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్
హైదరాబాద్ నగర పట్టణ రవాణా మౌలిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎఫ్సీ) ద్వారా రూ.13,600 కోట్ల వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్ పొందింది. ఢిల్లీ లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఈ ఒప్పందం పై ఐఆర్ఎఫ్సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్, హెచ్ఎమ్ఆర్ఎల్ మధ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ కార్య క్రమంలో ఐఆర్ఎఫ్సీ సీఎండీ, సీఈఓ మనోజ్ కుమార్ దుబే, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో సమర్థవంతమైన, సుస్థిర, ప్రజానుకూల ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి కట్టుబడి ఉందన్నారు.
దేశ ఆర్ధికాభివృద్ధికి హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతున్నదనీ, నగర వేగవంతమైన అభివృద్ధికి అనుగుణంగా మెట్రో కనెక్టివిటీ విస్తరణ అత్యంత అవసరమని అభిప్రాయపడ్డారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు నగర జీవన ప్రమాణాలను మెరుగు పరచడంలో మెట్రో కీలక పాత్ర పోషిస్తున్నదని గుర్తుచేశారు.
రూ.13,600 కోట్ల రీఫైనాన్సింగ్ ద్వారా హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు గణనీయమైన ఆర్థిక ఉపశమనం లభిస్తుందనీ, దీని వల్ల ప్రాజెక్టు దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం మరింత బలపడుతుందని ప్రధాన కార్యదర్శి వివరించారు. ప్రస్తుత రుణ భారం తగ్గడంతో పాటు భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలకు ఇది దోహదపడుతుందన్నారు. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడంలో సహకరించిన కేంద్ర ప్రభుత్వం, ఐఆర్ఎఫ్సీ, ఎల్అండ్ టీ బృందం, హెచ్ఎంఆర్ఎల్ , సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు,ప్రాయోజిత పధకాల సమన్వయ ప్రత్యేక కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) ప్రతినిధి కె.వి.బి. రెడ్డి, సీఎఫ్‌వో ఏ.వి.ఆర్. శ్రీనివాస శర్మతోపాటు ఐఆర్ఎఫ్సీ ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లార్సెన్ అండ్ టుబ్రో లిమిటెడ్ నుంచి ఎల్ అండ్ టీ మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్‌లోని 100 శాతం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అనంతరం ఈ రీఫైనాన్సింగ్ అమలులోకి వచ్చింది. దీంతో హైదరాబాద్ మెట్రో పూర్తిస్థాయి ప్రభుత్వ యాజమాన్యంలోని వ్యూహాత్మక ప్రజా రవాణా ఆస్తిగా మారింది.
రూ.13,600 కోట్ల ఈ సౌకర్యాన్ని ప్రస్తుత రుణ బాధ్యతలైన నాన్ కన్వర్టిబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ కాపిటల్ రీఫైనాన్సింగ్‌కు వినియోగించనున్నారు. దీని ద్వారా ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ లభించడంతో పాటు ప్రాజెక్టు ఆర్థిక స్థిరత్వం గణనీయంగా మెరుగుపడనుంది.
ఈ రుణాన్ని 20 సంవత్సరాల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల విధానంలో రూపొందించారు. అధిక వడ్డీ రుణాలను తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రూపాయి ఫైనాన్సింగ్‌తో భర్తీ చేస్తున్నారు.
ఈ లావాదేవీకి తెలంగాణ ప్రభుత్వ నిర్బంధ, కచ్చితమైన చెల్లింపు హామీ, రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీ, ఆర్బీఐ మద్దతుతో డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ వ్యవస్థ మద్దతుగా నిలిచాయి.
69.2 కిలోమీటర్ల పొడవుతో మూడు కారిడార్లు, 57 స్టేషన్లతో నిర్మితమైన హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-1 దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో అభివృద్ధి చేసిన అతిపెద్ద మెట్రో ప్రాజెక్టుల్లో ఒకటి. ప్రస్తుతం ఈ నెట్వర్క్ ద్వారా రోజుకు 5 లక్షలకు పైగా ప్రయాణికులు సేవలు పొందుతున్నారు.
ఈ రీఫైనాన్సింగ్ వల్ల హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు ఆర్థిక సామర్థ్యం మరింత బలోపేతం కావడంతో పాటు కొత్త కారిడార్లు, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలకు మెరుగైన కనెక్టివిటీ, చివరి మైలు కనెక్టివిటీ వంటి విస్తరణ ప్రణాళికలను వేగవంతం చేయడానికి అవకాశం కలుగుతుంది. హైదరాబాద్ మెట్రో భవిష్యత్ విస్తరణకు బలమైన ఆర్థిక పునాది ఏర్పరచడంలో ఈ ఒప్పందం ఒక కీలక మైలురాయిగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సుస్థిరమైన, సమర్థవంతమైన, పర్యావరణహిత ప్రజారవాణా వ్యవస్థ నిర్మాణంలో ఇది ముఖ్యమైన ముందడుగుగా నిలవనుంది.
మెట్రో టేకోవర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



