Tuesday, May 26, 2026
E-PAPER
Homeజాతీయంపెట్రో మంట

పెట్రో మంట

- Advertisement -


మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెట్రోల్‌పై రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 పెంపు
పది రోజుల్లో నాలుగో సారి ధరలకు రెక్కలు
సామాన్యుడిపై పెనుభారం.. మోడీ సర్కారుపై జనాగ్రహం
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

కేంద్రంలోని మోడీ సర్కారు దేశ ప్రజలకు విడతలవారీగా షాక్‌లు ఇస్తోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను మరోసారి పెంచింది. పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరగడంతో సామాన్య ప్రజలకు అదనపు భారం తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.2.61, లీటర్ డీజిల్‌పై రూ.2.71 పెంచింది. పెరిగిన ఈ కొత్త ధరలు సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. అయితే ఇది పది రోజుల వ్యవధిలో జరిగిన నాలుగో ధరల పెంపు కావడం గమనార్హం. దేశంలో వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలతో ఇప్పటికే సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, తాజా పెంపు మరింత భారాన్ని మోపనుంది. గత పది రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు కలిపి లీటరుకు దాదాపు రూ.8 వరకు పెరిగాయి.

​వివిధ నగరాల్లో పెరిగిన ధరలు ఇలా
తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.102.12కు చేరుకోగా, డీజిల్ ధర రూ.95.20కు పెరిగింది. ముంబయిలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.111.18కి, డీజీల్‌ ‌ధర రూ.97.83కి చేరింది. బెంగళూరులో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.110.93కి, డీజీల్‌ ‌ధర రూ.98.80కి పెరిగింది. చెన్నైలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.107.77కు, డీజీల్‌ ‌ధర రూ.99.55కు ఎగబాకింది. కోల్‌‌కతాలో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ.113.47కి, డీజీల్‌ ‌ధర రూ.99.82కి చేరింది. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌‌పై రూ.2.88 పెరిగి.. ధర రూ.115.73కి చేరుకుంది. లీటర్ డీజిల్‌‌పై కూడా రూ.2.88 పెరిగి.. ధర రూ.103.82కు ఎగబాకింది. మరోవైపు ఏపీలోని విజయవా డలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.75కి, లీటర్ డీజిల్ ధర రూ.105.43కు చేరింది.

​ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్,
డీజిల్ ధరల పెంపు: రాహుల్ గాంధీ
పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌‌సభలో ప్రతిపక్ష‍ నేత రాహుల్‌ ‌గాంధీ స్పందించారు. ప్రధాని మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలను విడతల వారీగా పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారని అన్నారు. ప్రధాని మోడీని ఉద్దేశించి ‘ద్రవ్యోల్బణ సూత్రధారి’ అంటూ విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలను నెమ్మదిగా పెంచుతూ ప్రజల జేబులను నిశ్శబ్దంగా ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని నెలల క్రితమే దేశంలో ఆర్థిక తుఫాను రాబోతోందని తాను ముందుగానే హెచ్చరించానని, కానీ ప్రధాని మోడీ మాత్రం ఎన్నికల రాజకీయాలతో బిజీగా ఉన్నారని రాహుల్ గాంధీ సెటైర్లు గుప్పించారు. ఎన్నికలు పూర్తికాగానే పెట్రోల్, డీజిల్ ధరలను రూ.8ల వరకు పెంచారని చెప్పారు. ఈ ధరల పెంపు ఇక్కడితో ఆగదని, ఇంకా కొనసాగుతుందని విమర్శించారు. పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం సాధారణ ప్రజలపై తీవ్రంగా పడుతోందని వివరించారు. ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, మిగతా సమయంలో ప్రజల జేబులపై దాడి చేయడం మోడీ ప్రభుత్వానికి అలవాటైపోయిందని ఎద్దేవా చేశారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాహుల్ గాంధీ అన్నారు.

​‘ఎన్నికల ప్రయోజనాలే ముఖ్యం’
దేశంలో ఇటీవల ఐదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు పెట్రోల్‌, డీజీల్‌ ‌ధరలు పెంచని మోడీ సర్కారు.. ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడిన కొన్ని రోజులకే ధరల పెంపునకు సిద్ధపడింది. ఇందులో భాగంగా చమురు ఉత్పత్తి ధరలను పెంచుతూ వస్తోంది. దేశ ప్రజలపై భారం మోపుతూ వస్తోంది. ఇందుకు అంతర్జాతీయ పరిణామాలను సాకుగా చూపుతూ తన బాధ్యతను విస్మరిస్తోంది. మోడీ ప్రభుత్వానికి ఎన్నికల ప్రయోజనాలు తప్పితే ప్రజల ఇబ్బందులు పట్టవని చెప్పడానికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత వరుసగా పెరుగుతూ వస్తున్న పెట్రో ధరలే ప్రత్యక్ష‍ నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు.
వరుసగా పెరుగుతున్న పెట్రో ధరల పెంపుతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యవసరాల ధరల పెరుగుదల వారి జేబులను గుల్ల చేస్తోంది. దీంతో ధరల పెంపుదల విషయంలో మోడీ సర్కారుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఇటు ప్రతిపక్ష‍ాలు, పలు ప్రజాసంఘాలు సైతం పెట్రో ధరల మంటను చల్లార్చాలని రోడ్డెక్కుతున్నాయి. మోడీ సర్కారుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -