Wednesday, May 27, 2026
E-PAPER
Homeఎడిట్ పేజివిదేశీ తీరంలో విశ్వాస భంగం

విదేశీ తీరంలో విశ్వాస భంగం

- Advertisement -

సత్యానంతర ప్రపంచం (అనే పోస్ట్‌ ట్రూత్‌ వరల్డ్‌)తో సమస్య ఏమంటే దానికో ఎక్స్‌పైరీ తేదీ వుంటుంది. నిజాలను కొంత కాలం కప్పిపుచ్చవచ్చు గానీ ఎల్లకాలం తొక్కిపట్టడం కుదిరేపని కాదు. అంతిమంగా సత్యమే జయిస్తుంది. మనం ఆ దశకు చేరుకుంటున్నట్టు కనిపిస్తుంది. ఆ సూచనలు స్పష్టంగానే గోచరిస్తున్నాయి. భారతీయ పౌరులు కడుపులు కట్టుకోవాలని, గట్టి పొదుపు చర్యలు పాటించాలనీ ప్రధానమంత్రి స్వయంగా సుస్పష్టమైన భాషలో ప్రకటిస్తున్నా రంటే అర్థమదే. కానీ అంతకంటే తీవ్రమైన విధ్వంసకర సంకేతం సుదూరంలోని స్కాండినేవియా నుంచి వచ్చింది. ప్రస్తుతం భారత ప్రధాని జరుపుతున్న విదేశీ పర్యటన తొలి పాదంలో నెదర్లాండ్స్‌ ప్రధానమంత్రి భారత ప్రజాస్వామ్యంలో ఆందోళనకర అంశాలను గురించి ప్రస్తావించారు. అంతకం తకూ పత్రికా స్వేచ్ఛ క్షీణించిపోవడం, మైనార్టీ ప్రజల మానవ హక్కుల దుస్థితి వంటి వాటి గురించి ఆందోళన వెలిబుచ్చారు. అయితే ఆఖరి దెబ్బ నార్వేలో తగిలింది. మీడియా గోష్టిలో భారత ప్రధానిని పత్రికా ప్రతినిధులు ఈ విషయంలో తమ ప్రశ్నలకు జవాబు దాటేయడాన్ని నిష్కర్షగా నిలదీశారు. మమ్ముల్ని ఆహ్వానించి అడిగితే చెప్పకపోవడమేమిటని ఆగ్రహించారు. ఇది నిస్సందేహంగా ప్రధాని, ఆయన ప్రభుత్వ విశ్వసనీయతకు తీవ్రమైన దెబ్బ కావడమేగాక, సత్యానంతర ప్రపంచాన్ని అది వెంట తరుముతుంటుంది. కార్పొ రేట్‌ మీడియా ఆసరాతో నిర్మించుకున్న సుఖప్రదమైన కల్పిత ప్రచార ప్రపంచం అసలు రంగు చెబుతుంది. ప్రజాస్వామ్యాన్ని సజీవం గా ప్రతిధ్వనింపజేసే జటిల మైన ప్రశ్నలను తొక్కిపట్టే పరిస్థితిని సవాలు చేస్తుంది. విదేశాంగ శాఖ ఎంత తెలివిగా మసి పూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేసినా దాచేస్తే దాగని కొన్ని ప్రశ్నలు మాయమైపోవు. పైగా ఇదెక్కడో సుదూరంలో ఓస్లోలో జరిగింది. కనక మామూలుగా అలవాటైన ద్రోహులు, జాతి వ్యతిరేకులు అంటూ ముద్రలేసి తోసేయడం చెల్లుబాటు కాదు.

ప్రతిష్టకు తూట్లు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్‌ సైనిక దురాక్రమణ, దానికి న్యాయమైన ప్రతిఘటన నేపథ్యంలో హర్మూజ్‌ జలసంధిలో చమురు సరఫరా గొలుసుకట్టు తెగిపోయినట్టయింది. ఈ సైనిక దురాక్రమణకు ముందు ప్రధాని మోడీ తన ఆప్తమిత్రుడనబడే డోనాల్డ్‌ ట్రంప్‌తో అలింగనాలు, నెతన్యాహుతో దోస్తానాల ప్రహ సనాలు ఎన్ని చేసినా, ఈ రెండు దేశాల దుష్ట కూటమితోనే కనిపించినా భారత దేశం మాత్రం తీవ్రాతి తీవ్రమైన దెబ్బలు తినక తప్పడం లేదు. విశ్వసనీయత అనేది ప్రత్యక్ష అనుభవం నుంచి ఉద్భవిస్తుంది గానీ కట్టుకథల నుంచి కాదు. సైనిక సంఘర్షణల క్రమాన్ని ఏ దౌత్య కసరత్తులూ మార్చలేవు. ఇండియా ఇప్పుడు అమెరికా, ఇజ్రాయిల్‌ల పక్కన నిలబడటం వల్ల అదివరలో అలీనోద్యమ నాయకురాలుగా భారత దేశానికిగల ప్రతిష్ట ఒక్క దెబ్బతో తుడిచిపెట్టుకు పోయింది. ఇది ఎంత దూరం పోయిందంటే ఈ వివాద పరిష్కారం కోసం జరిగే సంప్రదింపుల నిర్వహణలో పాకిస్తాన్‌ ఒక స్థానం సంపాదించగలిగింది. వందల కోట్ల మంది భారతీయులమైన మనకు ప్రత్యేకించి ఆందోళన కలిగించేదేమంటే కాదనలేని ఈ తీవ్ర సంక్షోభం ప్రభావం ప్రజలపై రుద్దాలని ప్రధానమంత్రి ప్రయత్నిస్తున్న తీరు. పొంచి వున్న ఈ సంక్షోభం ఏదో యుద్ధం వల్ల, కోవిడ్‌ వల్ల కలిగినట్టు ఆయన చిత్రిస్తున్నారు. ప్రతిపక్షాల సంగతి అలా వుంచి నిశితమైన విశ్లేషకులు కూడా ఈ వాదనను చీల్చి చెండాడుతున్నారు. నిజానికి భారతదేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం మోడీ ప్రభుత్వ విధానాలకే అద్దం పడుతున్నది. ఉధృతంగా అమలు చేసిన నయా ఉదారవాద దాడులు విస్తారమైన శ్రమజీవుల ఆదాయాల స్థాయిని, పొదుపునూ దారుణంగా దిగజార్చాయి. కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాల కోసం నిస్సిగ్గుగా సాగిలబడటం వల్ల ఆశ్రిత పెట్టు బడిదారీ విధానం మున్నెన్నడూ లేని స్థాయికి చేరింది. ప్రభుత్వ రంగ సంస్థలను విచ్ఛిన్నం చేయడం, వాటి ఆస్తులను, ప్రకృతి వనరులనూ ఇదే కార్పొరేట్‌ బాబుల హక్కు భుక్తం చేయడం వల్ల దేశంలో వస్తువుల గిరాకీ, ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయాయి.

సత్యాలే సమాధానం
దీని ఫలితాలు కళ్ల ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే వున్నాయి. అసమా నతలు ఇదివరకెన్నడూ లేని స్థాయికి చేరాయి. నిరుద్యోగం ఊహాతీతంగా పెరిగి పోయింది. 2026 ప్రపంచ అసమానతల నివేదిక చూస్తే భారత దేశంలో ఆదా యం సంపదల అంతరాలు ఎంత అగాధంగా పెరిగాయో కఠోర గణాంకాలతో చెబుతున్నది. భారత దేశంలో బాగా పైనున్న పది శాతం కుబేరులు మొత్తం ఆదాయంలో 58 శాతం పొందుతున్నారు. అట్టడుగున వున్న యాభై శాతం మంది కేవలం పదిహేను శాతం ఆదాయం మాత్రమే పొందుతున్నారు. సంపద విషయంలో ఈ తేడా మరింత తీవ్రంగా వుంది. అతి సంపన్నులైన పది శాతం మంది మొత్తం సంపదలో 65 శాతం కలిగి వుంటే అత్యున్నత స్థాయిలోని ఒక్క శాతం మంది మాత్రమే నలభై శాతం సంపద అనుభవిస్తున్నారు. థామస్‌ పికెట్టీ తదితరుల ఆధ్వర్యంలోని ప్రపంచ అసమానతల అధ్యయన బృందం క్రోడీకరించిన వాస్తవ లెక్కలివి. భారతదేశం అత్యంత వేగంగా అభివద్ధి చెందుతున్న నాల్గవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అని ఒక మోత. అంతకంటే హాస్యాస్పదంగా సమానతాభరిత ఆర్థిక వ్యవస్థలలో మన దేశం రెండవ స్థానంలో వుందని గొప్పలు చెప్పడం. పోస్ట్‌ ట్రూత్‌ యుగపు ఈ కార్పొరేట్‌ మీడియా వారి హంగుదార్ల ఈ లేనిపోని కోతలే ఇప్పుడు మోడీ సర్కారును వేటాడి వెక్కిరిస్తున్నాయి.

ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని పరమ సత్యాలనైతే అర్థం చేసుకోవడం అవసరం. ఎన్ని అసత్యాలను ప్రచారం చేసినా లాభాలు వచ్చే పరిస్థితి లేకుంటే పెట్టుబడులు రావు. సరుకులు అమ్ముడైతేనే లాభాలొస్తాయి. గిరాకీ లేకుండా వస్తువులు అమ్మడం, లాభాలు గడించడం రెండూ సాధ్యపడవు. ఈ వాస్తవం తీవ్ర రూపంలో మళ్లీ విరుచుకు పడుతున్నది. రాబోయే ఆర్థిక సంక్షోభం తాజా సంకేతాలు కనిపిస్తున్నాయి. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తరలిపోతున్నారు. భారతీయ పెట్టుబడిదారులు మార్కెట్‌ నుంచి వారు దూరం జరుగుతు న్నారు. అమెరికా డాలర్‌తో పోలిస్తే భారతీయ రూపాయి శరవేగంగా పడిపోతున్న తీరులో ఇది కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఎఫ్‌.డి.ఐ లు మాత్రమే కాదు, అవెలాగూ స్వతహా గానే చంచలంగా వుంటాయి. తక్షణ లాభాల కోసం తరలిపో తుంటాయి. కానీ దీర్ఘకాల పెరుగుదలకు కీలకమైన మరింత సమగ్రమైన పెట్టుబడిగా వుండే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌.డి.ఐ) కూడా మరలిపోతున్నాయి. ఇది ఎంత తీవ్రంగా వుందంటే అనుకూల కార్పొరేట్లకు పన్నులు ఎంతగా ఎత్తివేసినా భారతదేశంలో పెట్టుబడులు రాబట్టడం కోసం ఈ సమయంలో భారత దేశ ఎఫ్‌డిఐ రాక ప్రతికూల దిశలో వుంది. ఎందుకంటే వారు మరెక్కడో పెట్టుబడులు పెట్టి లాభాలు దండుకోవాలనే ఆరాటంలో వున్నారు.

అదానీతో పాటు లొంగుబాటు?
ఆఖరుకు మోడీకి అత్యంత సన్నిహితుడైన అదానీ కూడా అమెరికా సెక్యూరిటీ ఎక్స్‌చేంజి కమిషన్‌ (సెక్‌)కు భారీ జరిమానా కట్టి రాజీ ఒప్పందం చేసుకున్నారు. అంతేగాక రిపబ్లికన్‌ పార్టీకి వెయ్యి ఓట్ల డాలర్ల విరాళం ఇచ్చి, 15 వేల ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం చేసి ట్రంప్‌తో శాంతి కుదుర్చుకున్నారు. రష్యా నుంచి చవకగా ముడిచమురు, సహజ వాయువు కొనడం ఆపేయాలనీ, దాని స్థానంలో ఖరీదైన అమెరికా చమురు కొనాలని ట్రంప్‌ తెచ్చిన ఒత్తిడికి లొంగిపోవడం ద్వారా మోడీ ప్రభుత్వం కూడా ఈ రాజీకి దోహదం చేసిందేమో తెలియదు. టారిఫ్‌ కొరడాకు లొంగిపోవడం కూడా ఈ ఒప్పదంలో భాగంగా జరిగిందేమో ఎవరైనా ఊహించుకోవలసిందే. మొత్తం మీద యుద్ధం ప్రభావం ఎంత తీవ్రంగా వుండబోతున్నదంటే దానికి కారణం వ్యూహాత్మక ముడి చమురు నిల్వలో మోడీ ప్రభుత్వ వైఫల్యమే. 2020 ఏప్రిల్‌ నాటికి చైనా 140 కోట్ల బ్యారళ్ల ముడి చమురు నిల్వ చేసిపెట్టుకుంది. అప్పుడున్న బ్యారల్‌ రేటు 20 డాలర్లు మాత్రమే. అంటే చైనా నిల్వ చేసుకున్న దానితో పోలిస్తే భారత దేశ వ్యూహాత్మక ముందస్తు చమురు నిల్వ 2.85 శాతం మాత్రమే.

2014-2026 మధ్య మోడీ ప్రభుత్వం ప్రజల నుంచి రూ.40 లక్షల కోట్లు అదనపు సుంకంగా వసూలు చేసింది. దేశీయ ముడిచమురు ఉత్పత్తి తగ్గిపోయింది. దానివల్ల భారత దేశం చమురు కోసం దిగుమతులపై ఆధారపడటం 78 శాతం (2010-2014) నుంచి ఇప్పుడు 90 శాతానికి పెరిగింది. దిగుమతులను వేర్వేరు రూపాలలో పెంచుకోకపోవడం, నిల్వలు చాలా తక్కువగా వుండటం వల్ల భారతీయ ఆర్థిక వ్యవస్థ మరింతగా దెబ్బ తినే పరిస్థితి ఏర్పడింది. గత 12 ఏళ్లుగా భౌతిక సామాజిక పునాది చట్రంపై పెట్టుబడులు పెట్టకపోవడం వల్ల ప్రజలు ఇదివరకెన్నడూ ఎరగని కడగండ్లను ఎదుర్కోవలసి వచ్చింది. విభజనవాద హిందూత్వ ఎజెండా ఈ విషయంలో ఏ విధంగానూ ఉపయోగ పడదు. పోస్ట్‌ ట్రూత్‌ గంభీరోక్తులు ఇంకా నిరర్థకమవుతాయి. వాస్తవాన్ని గుర్తించ వలసిన సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం వెంటనే దీనిపై ఒక శ్వేత పత్రం ప్రకటించాలి. అవసరమైన మేరకు ఆత్మ విమర్శ చేసుకోవడంతో పాటు విధానపరమైన మార్పులకు పిలుపివ్వాలి. ఎంతో కొంత జాతీయ ఏకాభిప్రాయం రూపొందించాలి.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం, మే 20)

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -