– పొంగి పొర్లిన ప్యాలవరం వాగు
– ఇబ్బందులు పడ్డ చిరు వ్యాపారులు
నవతెలంగాణ – ఝరాసంగం : మండల పరిధిలోని ఆయా గ్రామాలలో మంగళవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షం దంచి కొట్టింది. ఈ ప్రభావంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. రోడ్లన్నీ జలమాయమై నిండుకుండల తలపించాయి. భారీ వర్షం కురవడంతో గ్రామాలలో ఉన్న మురుగు కాలువల నుంచి నీరు ప్రవహించింది. ఉదయం మార్కెట్, వ్యాపారాలకు వెళ్లే చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్యారవరం వాగు నుండి భారీ ఎత్తున నీరు ఉధృతి పెరిగి రాకపోకలకు అంతరాయం కలిగించింది. కాలకృత్యాలకు వెళ్ళిన వ్యక్తి ఒక్కసారిగా నీరు ఉధృతి పెరగడంతో వాగులోనే చిక్కుకున్నారు. గ్రామస్తులు గమనించి తాడు నిచ్చెన సహాయంతో ఒడ్డుకు చేర్చారు.
అలాగే బర్దిపూర్, ఎల్గోయి, సిద్దాపూర్, వనంపల్లి, కక్కర్వాడ, కొల్లూర్, మేదపల్లి, కృష్ణాపూర్,బిడకన్నె తదితర గ్రామాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. అలాగే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం ముందున్న వాలాద్రి వాగు నిండుకుండలా ప్రవహించింది.45 డిగ్రీల ఎండల తీవ్రతనుండి ఉన్నట్టుండి భారీ వర్షం కురవడంతో వేడి నుండి కొంత ఉపశమనం కలిగిందని రైతులు, ప్రజలు చర్చించుకున్నారు.



