పలు జిల్లాల్లో భారీ వర్షం
నీటిపాలైన పంటలు
వెల్దుర్తిలో రోడ్డుపై
ధాన్యం తగలబెట్టి నిరసన
తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలంటూ మెదక్ కలెక్టరేట్
వద్ద ధర్నా
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి/ నాగిరెడ్డిపేట్ /ముధోల్/ ఖానాపూర్‌టౌన్/వలిగొండ/రాజపేట/కామారెడ్డి
రైతులు ఏదైనా జరగకూడదని రోజూ ఆందోళనకు గురవుతున్నారో అదే జరిగింది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొనుగోలు కేంద్రాలు, మిల్లుల వద్ద నిల్వ ఉంచిన వరి ధాన్యం, జొన్న, మొక్కజొన్న పూర్తిగా తడిసిపోయాయి. దాదాపు నెలన్నర రోజులుగా మార్కెట్లు, కల్లాల్లో ధాన్యాన్ని పెట్టుకుని కొనుగోళ్ల కోసం పడికాపులు కాస్తున్న రైతులను వర్షం తీవ్ర దెబ్బతీసింది. టార్పాలిన్లు, షెడ్లు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికే కోతలు, రవాణా ఖర్చులతో అప్పుల్లో ఉన్న రైతులకు ఈ వర్షం మరింత భారంగా మారింది. దీంతో పలు చోట్ల తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళనలు చేశారు. పంట కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటామని అధికారులు భరోసానిచ్చారు. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట ప్రాంతాల్లోని అనేక కొనుగోలు కేంద్రాల్లో సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో ధాన్యం కుప్పలు వర్షంలో తడిశాయి. మెదక్ జిల్లా కేంద్రంలో రైతులు తడిసిన ధాన్యాన్ని ట్రాక్టర్లో తీసుకెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. తడిసిన దాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్ గ్రామంలో రైతులు తడిసిన ధాన్యాన్ని ఏం చేయాలంటూ రోడ్డుపై పోసి తగులబెట్టారు. నర్సాపూర్, తూప్రాన్‌లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులకు చెట్లు విరిగి పడ్డాయి.
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం జోగిపేటతోపాటు చౌటకూర్, పుల్ కల్ మండలాల్లో రోడ్లపై ఆరబెట్టిన దాన్యం తడిసిపోయింది. సంగారెడ్డి కంది మండల కేంద్రంలో కొనుగోలు కేంద్రంలో వడ్ల సంచులు భారీ వర్షానికి తడిసి ముద్దయ్యాయి. గుమ్మడిదల, న్యాల్కల్, జహీరాబాద్, కొండాపూర్ మండలాల్లో వర్షం కురిసి ధాన్యం తడిసింది. అన్నదాతలు తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళన చేపట్టారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లు హైమవతి, ప్రతిమాసింగ్, ప్రతీక్ జైన్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తడిసిన దాన్యం కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇధాన్యం తరలింపులో జాప్యంపై రాస్తారోకో కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని కన్నారెడ్డి గామ రైతులు జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో నెల రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వారం రోజులవుతున్నా గ్రామానికి లారీలు రావడం లేదని అన్నారు. దీంతో కాంటాలు వేసిన ధాన్యం.. కొనుగోలు కేంద్రాల వద్దనే ఉన్నాయన్నారు. ఎస్ఐ భార్గవ్ గౌడ్ సిబ్బందితో అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. లారీలను కేంద్రాలకు పంపించి ధాన్యాన్ని తరలిస్తేనే.. రాస్తారోకో విరమిస్తామని చెప్పడంతో తహసీల్దార్ బిక్షపతి, ఆర్డీవో ప్రభాకర్‌కు ఫోన్ ద్వారా తెలిపారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆర్డీఓ ప్రభాకర్ రైతులతో మాట్లాడారు. లారీల సంఖ్య పెంచి తక్కువ సమయంలోనే పూర్తి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామనిహామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
బాసర-భైంసా రహదారిపై రాస్తారోకో
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలోని తరోడా గ్రామంలో రైతులు బాసర-భైంసా రహదారిపై రాస్తారోకోకు దిగారు. వరి ధాన్యం తరలింపులో అధికారులు జాప్యం చేస్తున్నారని జాతీయ రహదారిపై బైటాయించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని కూడా వెంటనే తరలించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తరోడా, చించాల, వెంకటపూర్, ముద్గల్, న్యూపిప్రి తదితర గ్రామాల రైతులు రోడ్డుపైకి వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీలత, సీఐ రవీందర్ నాయక్, ఎస్ఐ బిట్ల పెర్సెస్, ఆర్ఐ నారాయణ పటేల్ రైతుల వద్దకు చేరుకొని సముదాయించే ప్రయత్నం చేశారు. కలెక్టర్ వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని రైతులు పట్టుబట్టారు. సంబంధిత అధికారులు అడిషనల్ కలెక్టర్, డిఎం సుధాకర్‌రెడ్డి, తరోడా సర్పంచ్ అరిపొద్దీన్తో మాట్లాడారు. వెంటనే కొనుగోలు చేసిన దొడ్డు రకం వరి ధాన్యాన్ని లారీలను పంపి రైస్ మిల్లులకు పంపిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.
వలిగొండలో ధర్నా
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని ఎదుళ్లగూడెం రైతులు చిట్యాల- భువనగిరి ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించారు. మండలంలోని అరూర్ పీఏసీఎస్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ దశరథ, ఎస్ఐ యుగంధర్ అక్కడికి చేరుకొని రైతులను శాంతింపజేసి ధాన్యం కొనుగోళ్లు వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వర్షానికి చౌటుప్పల్ మండలంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది. రాజపేట మండలంలోని మంగళవారం రాత్రి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోని సుమారు 1000 ధాన్యం రాశులు, 50వేల ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. మామిడి చెట్లకున్న కాయలు నేలరాలాయి. పలు గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు విరిగిపోయి సరఫరా నిలిచిపోయింది.
ఖానాపూర్‌లో గాలివాన బీభత్సం
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలంలో గాలివాన బీభత్సం సృష్టించింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. రైతులు పశుగ్రాసం కోసం సేకరించిన గడ్డికట్టలు తడిసిపోయాయి. శ్రీరాంనగర్ వీధిలోని బోగు నర్సయ్య ఇల్లు పైకప్పు ఎగిరి కొంతదూరంలో రెంతస్తుల భవనంపై పడింది. ఈ సంఘటనలో నర్సయ్య ఇంట్లోని ఇద్దరికి గాయాలయ్యాయి. భారీ గాలులకు మున్సిపల్ కార్యాలయం సమీపంలో, వ్యవసాయ మార్కెట్ యార్డ్, అంబేద్కర్ నగర్, గోదావరి తీరంలో చెట్లు నేలకొరిగి కరెంట్ తీగలపై పడ్డాయి. పట్టణంలో కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మస్కాపూర్, సుర్జాపూర్, బావాపూర్ (కే) గ్రామాల్లో కరెంటు స్తంభాలు పడిపోయి సరఫరా నిలిచింది.
తడిసిన జొన్న, మొక్కజొన్న, ధాన్యం
కామారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో వర్షం రైతులను ఆగం జేసింది. ఏకధాటిగా వర్షం కురియడంతో కల్లాలో ఉన్న జొన్నలు, వరి ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. ధాన్యంపై టార్ఫాలిన్లు కప్పి ఉంచినప్పటికీ ఈదురుగాలులకు కొట్టుకుపోవడంతో రైతులు నానా అవస్థలు పడ్డారు. పెద్దకొడప్గల్ మండలంలోని సహకార సంఘంలో ఉన్న జొన్నలు వేల క్వింటాళ్లు తడిసిపోయాయి. దీంతో రైతులు తెల్లవారు జామునుంచే తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టారు. పిట్లం మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో జొన్నలు పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. సదాశివనగర్ మండలంలోని మల్లుపేట్ గ్రామంలో పదిమంది రైతులకు చెందిన సుమారు 150 ధాన్యం బస్తాలు వర్షపు నీటిలో తడిశాయి. గాంధారి మండలంలో కల్లాల్లో ఉన్న మొక్కజొన్న, వరి ధాన్యం తడిసి ముద్దయింది. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పలు గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్లు కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
క’న్నీళ్లు’
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



