కేటీఆర్‌కు
మంత్రి పొంగులేటి సవాల్
హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇండ్లు మంజూరు
త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్ల పాలనలో నిర్మించిన ఇండ్ల కంటే వచ్చే రెండున్నర ఏండ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఒకవేళ ఇండ్లను నిర్మించకపోతే తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని స్పష్టం చేశారు. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇండ్లు నిర్మిస్తే కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా? అని మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌తో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన గ్రామాల్లోనే తాము ఓట్లు అడుగుతామని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టిన ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ ఓట్లు అడగడానికి సిద్ధమా?అని ప్రశ్నించారు.ఓఆర్ఆర్ లోపల క్యూర్ పరిధిలో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని అన్నారు. మలి విడతలో కూడా పట్టణ ప్రాంతాలకు మరో లక్ష ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల మేరకు పూర్తి స్థాయి విధివిధానాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు.ఇప్పటికే క్యూర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల పరిశీలన ప్రారంభించామనీ, కేవలం 12 రోజుల వ్యవధిలోనే 39 నుంచి 40 స్థలాలను గుర్తించామని వివరించారు. వెయ్యి గజాల నుంచి 25 ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వ భూముల్లో నిరుపేదల ఆత్మగౌరవానికి చిహ్నాలైన ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని అన్నారు. ఈ ఇండ్లను ఆడబిడ్డల పేరిట ప్రభుత్వం ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం హైదరా బాద్‌లో సుమారు 45 వేల నుంచి 46 వేల ఇండ్ల నిర్మాణం చేపట్టిందని గుర్తు చేశారు. అందులో 20 వేలకుపైగా ఇండ్లను అసంపూర్తిగా వదిలేసిందని చెప్పారు. నిర్మించిన ఇండ్లలో కూడా సుమారు 16 వేల పైచిలుకు ఇండ్లలో లబ్ధిదారులు నివసించలేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు.హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 40 ఏండ్ల క్రితం జి ప్లస్ టూ విధానంలో నిర్మించిన ఇండ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయని చెప్పారు. జిల్లాల కలెక్టర్లు నివేదికలు ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించు కోలేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఆ పాత ఇండ్ల స్థానంలో కొత్త ఇండ్లు నిర్మించి పేద లకు గౌరవప్రదమైన జీవనం అందిస్తుందని చెప్పారు.
10 వేల గ్రామాల్లో ఇండ్లు కట్టలేదు : పొన్నం
రాష్ట్రంలో 12 వేల గ్రామ పంచాయతీలున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గత ప్రభుత్వం పది వేల గ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించలేదని చెప్పారు. తాము 12 వేల గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తున్నామని అన్నారు.



