సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యం
తొలిదశలో పైలట్ ప్రాజెక్టుగా 10 స్టేషన్ల ఎంపిక : హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు ఎండీ అజిత్ రెడ్డి
మెరిడియన్ నిర్వహణపై అసంతృప్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన సేవలు అందించేందుకు స్టేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేయాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు మెట్రో స్టేషన్లు, ప్రయాణికుల సౌకర్యాలను సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బేగంపేట్ స్టేషన్ నుంచి రాయదుర్గ్ మెట్రో స్టేషన్ వరకు మెట్రో రైలులో ప్రయాణించారు. బేగంపేట్, అమీర్‌పేట్, రాయదుర్గ్ స్టేషన్లలోని ప్లాట్‌ఫారమ్‌లు, కాంకోర్స్‌లను సందర్శించారు. ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలపై మెట్రో ఇంజినీర్లు, నిర్వహణ సంస్థ ‘కియోలిస్’ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
పార్కింగ్, పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి
స్టేషన్ల కింద వీధి స్థాయిలో ఉన్న పార్కింగ్ స్థలాలను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని అదనపు ఎండీ సూచించారు. బేగంపేట్, అమీర్‌పేట్, రాయదుర్గ్ పరిధిలోని పార్కింగ్ ఏరియాలను తనిఖీ చేసి, వాటిని మెరుగుపరచడానికి అధికారులకు తగిన సూచనలు చేశారు. అలాగే స్టేషన్ల వద్ద స్వచ్ఛత, పరిశుభ్రతపై సమీక్ష నిర్వహించారు. పిల్లర్ల మధ్య ఉండే సెంట్రల్ మెరిడియన్ నిర్వహణ సరిగా లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్వహణ బాధ్యతలు చూసే ఏజెన్సీల పనితీరును తప్పుబట్టారు. పారిశుధ్యం, పనుల నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడేది లేదని హెచ్చరించారు.
రద్దీ వేళల్లో పక్కా ప్రణాళిక
రాయదుర్గ్ వద్ద ఉన్న స్కైవాక్, ఐటీ కంపెనీలకు వెళ్లే మార్గాలు, మైండ్‌స్పేస్ జంక్షన్ వద్ద మెట్రో ప్రయాణికుల రాకపోకలను అజిత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యాలయ వేళల్లో (పీక్ అవర్స్‌లో) రద్దీ ఎక్కువగా ఉంటున్నందున ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా మరింత ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. స్టేషన్ల కింద ఉన్న వాణిజ్య సముదాయాల నిర్వహణను కూడా తనిఖీ చేశారు. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలకే తమ మొదటి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
తొలిదశలో 10 స్టేషన్ల సమగ్ర అభివృద్ధి
అవసరాలకు అనుగుణంగా ‘స్టేషన్ల వారీ ప్రణాళికలు’ (స్టేషన్ వైజ్ ప్లాన్స్) రూపొందించాలని అదనపు ఎండీ అధికారులను ఆదేశించారు. ప్రయో గాత్మకంగా మొదట 10 మెట్రో స్టేషన్లను ఎంపిక చేసుకుని, వాటిని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. తాను మిగిలిన మెట్రో స్టేషన్లలోనూ దశలవారీగా పర్యటించి, నిరంతరం పర్యవేక్షిస్తానని తెలిపారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో హెచ్‌ఎంఆర్‌ఎల్ చీఫ్ ఇంజినీర్ వై.సాయప రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కె.శ్యామ్ మోహన్, జనరల్ మేనేజర్ (సెక్యూరిటీ) శ్రీనాథ్ రెడ్డి, డీఎస్పీలు జగన్నాథ్ రెడ్డి, శివరామి రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మెట్రో స్టేషన్ల అభివృద్ధికి ప్రణాళికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



