పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు
జన్మించినపుడె పుట్టదు, జనులాశ్రీ
పుత్రుని కనుగొని బొగడగశ్రీ
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! అన్నట్లుగా ”ఉద్యమాల శిఖరం ఉద్దరాజు రామం” గారి కుమారుడు బాపిరాజు గారి జీవితం ఆదర్శం. ‘తన తండ్రి ఆశయాలను తదనంతర తరాలకు అందించారు ఉద్దరాజు బాపిరాజు’ అనడం అతిశయోక్తి కాదు. ‘మా తాతకి వారి నాన్న జీవితం మధురమైన జ్ఞాపకం. నాకు మా తాత జీవితం అంతులేని వాస్తవం. వారి నాన్న జీవితం నాకు అంతు చిక్కని వరం’ అనే భావన అరుదైన నేటి తరం విషయం. ఇది ఐదు తరాల కాలక్రమం. రెండోతరం చుట్టూ చక్రం తిరిగింది. వారే పెద పద్మనాభరాజు (కాంగ్రెస్ వాది), బంగారమ్మ ల తొమ్మిది మంది సంతానంలో నాలుగో సంతానం ఉద్దరాజు రామరాజు. రామం అనే పేరుతో సుపరిచితులు. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శంగా కులాన్ని సూచించే ‘రాజు’ అనే పదాన్ని తొలగించుకున్నారు. రామం, మాణిక్యాంబ గార్ల ఐదుగురి సంతానం లో ఆఖరివారు బాపిరాజు. బాపిరాజు, వరలక్ష్మి గార్ల కుమారుడు (సుందరయ్య, రామం కలగలిపి) సుందర రామం. బాపిరాజు గారి కుమార్తె ఉష, అల్లుడు వీర్రాజు గార్ల కుమార్తె సుదీక్ష, కుమారుడు షణ్ముఖ సాయి నేటి తరానికి ప్రతినిధులు.
బాపిరాజు 12 సెప్టెంబర్ 1946 న జన్మించారు. వీరు మెట్రిక్ వరకు దెందులూరు, విజయవాడ, ఏలూరు ల్లో చదువుకున్నారు. వనపర్తిలో పాలిటెక్నిక్ డిప్లొమా పొందారు. 1967 లో చింతలపూడి సమీపంలోని రంగాపురం అగ్రహారంలో సిపిఐ(ఎం) కార్యకర్త కలిదిండి విశ్వనాథరాజు గారి అమ్మాయి వరలక్ష్మి తో వివాహం జరిగింది. కొంతకాలం విజయవాడ గవర్నర్ పేట లోని నవభారత్ అగ్రికల్చర్ అండ్ కమర్షియల్ కార్పొపొరేషన్(రష్యన్ ట్రాక్టర్ సర్వీసింగ్) లో పనిచేశారు. హైదరాబాద్‌లో 10 సంవత్సరాలు బయోలాజికల్ ఈవాన్స్ లోనూ తదుపరి మిథాని కంపెనీ లో పనిచేసి 2006 లో ఉద్యోగ విరమణ చేశారు. ఆప్యాయత, చిరునవ్వు, ప్రేమ రంగరించి నిష్కల్మష హ దయంతో, అభ్యుదయ ఆశయాలు కలిగి, సాదాసీదాగా కనిపించే కామ్రేడ్ ఉద్దరాజు బాపిరాజు కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలలో తనవంతు పాత్ర పోషించారు. విషయం తెలిస్తే చాలు ఏ కార్యక్రమాన్నీ వొదిలిపెట్టేవారు కాదు. ఎదుటి వారి భావజాలంతోను, విశ్వాసాలతోనూ సంబంధం లేకుండా మానవ సంబంధాలు ఏర్పరచుకోవడం ఆయన ప్రత్యేకత! సామాజిక స్పృహ ఒక కర్తవ్యం గానూ బాధ్యత గానూ పరిగణించి కుటుంబాన్ని సాకడంలో ఏ పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చెయ్యలేదాయన. కుటుంబ పనులను బాధ్యత అనుకుంటే బరువనిపిస్తుంది, చేసుకుంటూ పోతే ఆనందం లభిస్తుంది అనేవారాయన. పట్టుబడితే తన ఉద్యోగానికి ముప్పు అని తెలిసి కూడా అత్యవసర పరిస్థితిలో తన ఇంటిలో రహస్యంగా ఉన్న నేతలకు ఆశ్రయం కల్పించారు, సమావేశాలకు నిలయంగా మార్చారు.
బాపిరాజు గారి అభిరుచులలో ప్రధానమైనది పురాతన వస్తువులను సేకరించడం. నాణాలను, పోష్టల్ స్టాంపులను, పుస్తకాలను, ఫోటోలను సేకరించారు. ప్రాణం లేనివని, అందులోనూ పాతవైపోయాయని ఎవరైనా పారవేస్తే ఆ పుస్తకా లను ఏరి తెచ్చుకొనేవారు ! అంతటితో ఆగితే మామూలు మనిషే అవుతారు. వాటి ప్రాశస్త్యాన్ని, దాగి ఉన్న చరిత్రను, మసకబారిన సాహిత్యాన్ని, చెదబట్టిన అక్షరాన్నీ వెలికితీసేవారు! సన్నిహితులు చనిపోతే కుటుంబ సభ్యులను పరామర్శించి వస్తారు చాలామంది. బాపిరాజు గారు పరామర్శించి, వారి ఇంటి తోటలో ఎండకు ఎండి, వానకు తడిసిన పస్తకాలను చేరదీసేవారు, ఆరబెట్టేవారు, ఒద్దుగా పెట్టేవారు. గాలికెగురుతున్న కాగితాలను ఏరికూర్చేవారు. చినిగి చెల్లాచెదురైన కాగితాలను జతజేసేవారు. వారి అనుమతితో తన ఇంటికి తెచ్చుకొని వాటిని కాపాడి, శోధించేవారికి అందజేసేవారు. ప్రాణం లేని వస్తువులకు ప్రాణం పోసేవారు.పైన ఉదహరించిన అనేక లక్షణాలకు తోడుగా, చక్కటి ఆశయాలు కలిగి, సున్నిత మనస్కులై మన మధ్య ఉండి నిత్యం నవ్వుతూ పలకరించిన నిరాడంబర వ్యక్తి ఉద్దరాజు బాపిరాజు. నా ఆచరణకు మా నాన్నగారు రామం గారే ఆదర్శం అనేవారు. నేను ఉద్దరాజు రామం గారి అబ్బాయిని, నా పేరు బాపిరాజు అని పరిచయం చేసుకునేవారు. రామం గారి లాగా ప్రజాజీవితాలను ప్రభావితం చెయ్యలేకపోవడం, ఉద్దరాజు రామం తనయుడిగా ప్రజాక్షేత్రంలో అంత సమయాన్ని కేటాయించలేకపోవడం తన లోపంగా చెప్పుకునేవారాయన.
చరిత్ర లో తన తండ్రి చారిత్రక గ్రంథం లేకపోవడం గ్రహించి దానికి సంబంధించి చిత్రాలు, పత్రాలు, వ్యాసాలు, సమాచారాలు సేకరించారు. యు. రామకృష్ణ, దండమూడి భానుప్రసాద్‌ల సంపాదకీయంలో డిశంబర్ 2024 న ప్రజాశక్తి బుక్ హౌస్, ఉద్దరాజు రామం మెమోరియల్ ఫౌండేషన్ సంయుక్తంగా ”ఉద్యమాల శిఖరం-ఉద్దరాజు రామం” అనే పుస్తకాన్ని ప్రచురించారు. పార్లమెంటులో రామం చేసిన అనేక ఉపన్యాసాలు హిందీలో ఉన్నాయి, వాటిని ఆంధ్రీకరించి మరో ప్రచురణకు ప్రయత్నిస్తున్న తరుణంలో అరుదైన, చికిత్సలేని వ్యాధితో 20 మే 2026న హైదరాబాద్‌లో బాపిరాజు ప్రస్థానం ముగిసింది. ఆయన ఉండగా పుస్తకంగా చెయ్యాలి అనుకున్న, ఆయన సేకరించిన, ‘ గాడిచెర్ల హరి సర్వోత్తమ రావు ‘ గారి వెలుగు చూడని వివిధ చారిత్రక అంశాలు రాజమండ్రి గౌతమీ గ్రంథాలయ విశ్రాంత గ్రంథపాలకులు ‘సన్నిధానం నరసింహ శర్మ’ అధ్యయనంలో పుస్తకరూపం ధరించవలసి ఉంది. అలాగే ఉద్దరాజు రామం గారి జీవిత ప్రస్థానం డిజిటలైజ్ చెయ్యడం, ‘ఉద్దరాజు రామం-ఉద్యమాల శిఖరం’ ని ఇంగ్లీష్ అనువాదం చేయించడం, బాపిరాజు గారి సేకరణలు పదిలపరచటం, ఆయన మనుమలు సుదీక్ష, షణ్ముఖ సాయిల ఆధ్వర్యంలో జరగవలసి ఉంది. ఎలాంటి క్రతువులు లేకుండా వారి జీవనవిధాన కొనసాగింపుగా కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఆయనను స్మరించుకుంటూ హైదరాబాద్‌లోని స్వగ్రహంలో మే 30వ తేదీ శనివారం నాడు ఒక సభను ఏర్పాటు చేశారు. సశేషంగా మిగిలిన బాపిరాజు గారి ఆశయ కార్యాలు వారి కుటుంబం చేపడుతుందని ఆశిద్దాం. దానికి బాపిరాజు గారి శ్రేయోభిలాషులుగా మనం ఇచ్చే సహకారమే ఒక మరపురాని నివాళి కావాలి.
కాశీవఝల జయబాబు,
9985115522
ఉద్దరాజు రామం ఆశయాలను కొనసాగించిన బాపిరాజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



