కార్మిక వర్గ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల రక్షణ, మత సామరస్య పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన అనే మహత్తర లక్ష్యాలతో 1970 మే 30న ఏర్పడిన సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) దేశ కార్మిక ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. స్థాపన నాటి నుండి నేటి వరకు సిఐటీయూ కేవలం వేతనాల పెంపు, నియమాల పరిరక్షణ కోసం మాత్రమే కాకుండా, కార్మిక వర్గాన్ని సమాజ మార్పు దిశగా చైతన్యపరిచే శక్తిగా ఎదిగింది. కార్మికుడు కేవలం తన పని స్థలంలో వచ్చిన సమస్యలతో పరిమితం కాకుండా, దేశ రాజకీయాలు, ఆర్థిక విధానాలు, సామాజిక మార్పులపై అవగాహన కలిగి ఉండాలని భావించి, కార్మికులలో రాజకీయ చైతన్యం పెంపొందించడంలో సిఐటీయూ ప్రత్యేక పాత్ర పోషించింది. దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచే ప్రయివేటీకరణ, ప్రజా సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కార్పొరేటీకరణ, ఉద్యోగ భద్రతను దెబ్బతీసే లేబర్ కోడ్స్, వాటి రూల్స్, కాంట్రాక్టు అండ్ ఔట్‌సోర్సింగ్ విధానాల ద్వారా కార్మిక వర్గాన్ని అసంఘటితంగా మార్చే కుట్రలకు వ్యతిరేకంగా సీఐటీయూ నిరంతర పోరాటం సాగించింది. అవి భవిష్యత్తులో కొనసాగిస్తుంది. ముఖ్యంగా కార్మిక చట్టాలను బలహీనపరిచే కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని వివిధ కేంద్ర కార్మిక సంఘాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, ఐక్య పోరా టాలకు నాయకత్వం వహించడం ద్వారా సీఐటీయూ తన పోరాట పటిమను చాటింది. నేడు డెబ్బయి లక్షలకు పైగా సభ్యత్వంతో దేశంలో అత్యంత ప్రభావవంతమైన కార్మిక సంఘాల్లో ఒకటిగా నిలవడం, దానిపట్ల కార్మికవర్గ విశ్వాసానికి నిదర్శనం.
దేశీయ స్థాయిలో మాత్రమే కాకుండా అంతర్జాతీయ కార్మిక ఉద్యమంలో కూడా సీఐటీయూ తగిన ముద్రవేసింది. ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌టియు)లో కీలక పాత్ర పోషిస్తూ, ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ ఐక్యత, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం, శాంతి, సామాజిక న్యాయం కోసం తన గొంతును వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలు, యుద్ధ రాజకీయాలు, దోపిడీ శక్తులపై అంతర్జాతీయ ఐక్యత అవసరమని సీఐటీయూ ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తోంది. ఇది కేవలం ఒక ట్రేడ్ యూనియన్ పాత్ర మాత్రమే కాదు, సమానత్వం, న్యాయం, సామ్యవాద దిశగా సమాజాన్ని నడిపించే ఉద్యమ శక్తిగా సీఐటీయూ నిలుస్తోంది. అయితే సీఐటీయూ ముందున్న లక్ష్యం ఇంకా ఎంతో విస్తారమైనది. దేశంలోని కార్మిక వర్గం మాత్రమే కాకుండా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, అసంఘటిత రంగ శ్రామికులు, తాడితపీడిత ప్రజలను ఒక పోరాట వేదికపైకి తీసుకురావడం కాలానుగుణ అవసరం. నేడు దేశం నియంతృత్వ ధోరణులు, మతోన్మాద రాజకీయాలు, కార్పొరేట్ దోపిడి శక్తుల ఒత్తిడిలో నిలిచిన ఈ సమయంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను, ప్రజల జీవన హక్కులను కాపాడే బాధ్యత కార్మిక ఉద్యమం మీద మరింత పెరిగింది. కార్మిక వర్గం పోరాటం కేవలం ఉద్యోగ హక్కులకే పరిమితం కాకూడదు. దేశ భవిష్యత్తు కోసం, ప్రజల భద్రత కోసం, సమ సమాజ నిర్మాణం కోసం జరగాల్సిన సమగ్ర పోరాటం.ఈ నేపథ్యంలో సీఐటీయూ ఆవిర్భావ రోజు ఒక జ్ఞాపక దినం మాత్రమే కాదు, అది భవిష్యత్ పోరాటాలకు దిశా నిర్దేశం చేసే రోజు. ఈ రోజు ప్రతి కార్మికుడు ఒక ప్రతిజ్ఞ చేయాల్సిన రోజు.
“కార్మిక వర్గ ఐక్యతను బలోపేతం చేస్తాం.
కార్మిక, రైతు, శ్రామిక వర్గాల ఐక్య పోరాటాలను నిర్మిస్తాం.
మత సామరస్యాన్ని కాపాడుతాం.
ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ,
కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిలబడతాం.
దేశాన్ని నియంతృత్వ, మతోన్మాద,
కార్పొరేట్ దోపిడీశక్తుల నుండి రక్షించేందుకు పోరాడుతాం.
సమాజ మార్పు, సామాజిక న్యాయం, సామ్యవాద దిశగా ముందుకు సాగుతాం”
ఈ ప్రతిజ్ఞ కేవలం మాటల్లో కాకుండా కార్యరూపంలో మారినప్పుడే సీఐటీయూ నిర్దేశించుకున్న లక్ష్యాలు సాకారమవుతాయి. కార్మికుడి చెమటకు గౌరవం, ప్రజాస్వామ్యా నికి రక్షణ, సమ సమాజ నిర్మాణం కోసం అహర్నిశలు పోరాడే శక్తిగా సీఐటీయూ ముందుకు సాగుతోంది. ఇకపై కూడా దేశ శ్రేయస్సు -కార్మిక శ్రేయస్సు- ప్రజల శ్రేయస్సు అనే మహోన్నత ఆశయంతో సీఐటీయూ ప్రతి పోరాటంలో అండగా నిలుస్తూనే ఉంటుంది.
(నేడు సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం
కార్మికవర్గ ఐక్యతే సీఐటీయూ లక్ష్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



