Saturday, May 30, 2026
E-PAPER
Homeజాతీయంఅమెరికాకు మోడీ దాసోహం

అమెరికాకు మోడీ దాసోహం

- Advertisement -

భారత పత్తి రైతులు బలి
యూఎస్‌ ఒత్తిడితో దిగుమతి సుంకం తొలగింపు!

సిద్ధమవుతున్న కేంద్రం
అమెరికా పత్తి భారత మార్కెట్‌‌ను 
ముంచెత్తే ప్రమాదం
ఈ నిర్ణయంతో దేశ రైతులకు 
తీవ్ర నష్టం : నిపుణులు, విశ్లేషకులు
మోడీ సర్కారు తీరుపై సర్వత్రా విమర్శలు

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అమెరికా ఒత్తిడి మేరకు పని చేస్తుందన్న 
విషయం మరోసారి స్పష్టమైంది. దేశంలో పత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం రక్ష‍ణాత్మక సుంకాన్ని పూర్తిగా తొలగించేందుకు కేంద్రం సిద్ధమవుతోందని సమాచారం. 
దీంతో మోడీ సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయంతో 
అమెరికా సబ్సిడీ పత్తి భారత మార్కెట్‌‌ను ముంచెత్తే ముప్పు ఉంది. ఇది దేశీయ రైతులకు 
తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

న్యూఢిల్లీ : ప్రస్తుతం భారత్‌‌లో పత్తి దిగుమతులపై 11 శాతం రక్ష‍ణాత్మక సుంకం అమలులో ఉంది. ఇప్పుడు దీనిని కూడా పూర్తిగా తొలగించేందుకు కేంద్రం సిద్ధపడటం వివాదాన్ని రాజేస్తున్నది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత పర్యటన సమయంలో ఈ నిర్ణయం వెలుగులోకి రావడం గమనార్హం. దీంతో ఇది అమెరికా ఒత్తిడికి మోడీ సర్కారు లొంగిపోయిన చర్యగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే రూపాయి విలువ డాలర్‌‌తో పోలిస్తే బలహీనపడుతున్న వేళ, విదేశీ పత్తి దిగుమతులు పెరిగితే దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

​గతేడాది సుంకం తాత్కాలికంగా నిలిపివేత
గతేడాది అమెరికా ఒత్తిడితో భారత్‌ ‌పత్తి దిగుమతులపై ఉన్న 11 శాతం సుంకాన్ని అదే ఏడాది డిసెంబర్‌ ‌వరకు తాత్కాలికంగా నిలిపివేసింది. ఇప్పుడు దానిని పూర్తిగా తొలగించే దిశగా మోడీ సర్కారు అడుగులు వేస్తున్నట్టు సమాచారం. భారత్‌ ‌తన భారీ టెక్స్‌‌టైల్‌ ‌పరిశ్రమ అవసరాల కోసం సుమారు 15 శాతం ముడిపత్తి, 20 శాతం యార్న్‌‌(నూలు)ను దిగుమతి చేసుకుంటోంది. సుంకం తొలగితే.. అమెరికా వంటి దేశాల నుంచి భారీ సబ్సిడీలతో వచ్చే చౌక పత్తి భారత మార్కెట్‌‌లోకి సులభంగా ప్రవేశిస్తుంది. దీంతో ఇది అమెరికాకు ప్రయోజనాన్ని, భారత పత్తి రైతులకు తీవ్ర నష్టాన్ని తీసుకొస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం తమ పత్తి రైతులకు కోట్లాది డాలర్ల సబ్సిడీలు ఇస్తుండటంతో.. అక్కడి పత్తి ధరలు భారతీయ రైతుల ధరల కంటే చాలా తక్కువగా ఉంటాయని వారు చెప్తున్నారు.

​రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చిన కేంద్రం నిర్ణయం
దేశీయ పత్తి ధర (క్వింటాల్ కు ) రూ.6100గా ఉంది. అదే సమయంలో మధ్యస్థస్థాయి పత్తికి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) రూ.7,710, పొడవైన ఫైబర్‌ ‌పత్తికి రూ.8,110గా నిర్ణయించారు. గతేడాది సుంకం తొలగించిన తర్వాత విదేశీ పత్తి ఒక్క బేలు రూ.5000-5100 మధ్య లభించింది. కానీ దీంతో మార్కెట్‌‌లో దేశీయ పత్తి ధరలు ఒక్కసారిగా పడిపోయి.. రైతులకు అధిక నష్టాలను మిగిల్చాయి. రైతు సంఘాలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలూ చేపట్టాయి. విదేశీ రైతులకు భారత డబ్బు వెళ్లిపోతుండగా… భారతీయ రైతుల ఆదాయం తగ్గిపోతోందని వారు ఆరోపించారు. మరోవైపు టెక్స్‌‌టైల్‌ ‌పరిశ్రమ మాత్రం చౌక ముడిసరుకు కోసం దిగుమతి సుంకం తొలగించాలని నిరంతర ఒత్తిడి తీసుకొస్తోంది. కేవలం అమెరికా, పరిశ్రమలోని వ్యాపారుల ప్రయోజనాల కోసమే మోడీ సర్కారు పని చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.

​టారిఫ్‌ తొలగింపు తెలివి తక్కువ నిర్ణయం
అయితే ఈ సుంకం కొనసాగినా.. పరిశ్రమకు పెద్ద ఇబ్బందులు రాలేదని విశ్లేషకులు చెప్తున్నారు. రూపాయి బలహీనత కారణంగా విదేశీ కొనుగోలుదారులకు ఇప్పటికే లాభం కలుగుతుండగా.. 2024-25లో పత్తి దిగుమతులు 77 శాతం పెరిగాయని గుర్తు చేస్తున్నారు. కాబట్టి ప్రస్తుత విధానం రైతులు, పరిశ్రమకు ప్రయోజనకరంగా పని చేయడంతో పాటు అటు ప్రభుత్వానికి కూడా ఆదాయాన్ని సమకూర్చిందని చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో సుంకం తొలగింపు తెలివితక్కువ చర్య అవుతుందని మోడీ సర్కారును హెచ్చరిస్తున్నారు.

​పత్తి ఉత్పత్తిలో 24 శాతం భారత్‌ ‌నుంచే
భారత్‌ ‌ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పత్తి ఉత్పత్తిదారుగా ఉన్నది. ప్రపంచ ఉత్పత్తిలో దాదాపు 24 శాతం భారత్‌ ‌నుంచే వస్తోంది. సుమారు 60 లక్ష‍ల మంది రైతులు పత్తి సాగుపై ఆధారపడగా.. నాలుగైదు కోట్ల మంది టెక్స్‌‌టైల్‌ ‌రంగంలో ఉపాధి పొందుతున్నారు. ఈ రంగం దేశ జీడీపీలో 2.3 శాతం, పారిశ్రామిక ఉత్పత్తిలో 13 శాతం, ఎగుమతుల్లో 12 శాతం వాటా కలిగి ఉందని గణాంకాలు చెప్తున్నాయి.

​పత్తి ఉత్పత్తి తగ్గిపోయే ప్రమాదం.. సంక్ష‍ోభంలోకి రైతులు
దేశంలో పత్తిపై ఉన్న దిగుమతి సుంకాన్ని తొలగించొద్దని నిపుణులు, విశ్లేషకులు సూచిస్తున్నారు. అయితే సుంకాన్ని తొలగించడం కోసం మోడీ సర్కారు సిద్ధమవుతుండటంతో దేశీయ పత్తి ఉత్పత్తి క్రమంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అప్పుల భారంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రైతులు మరోసారి సంక్ష‍ోభంలోకి వెళ్లే ముప్పు పొంచి ఉందని వివరిస్తున్నారు. భారీ సబ్సిడీలు పొందుతున్న అమెరికా రైతులతో భారతీయ రైతులు పోటీ పడలేని పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. దీర్ఘకాలంలో భారత టెక్స్‌‌టైల్‌ ‌పరిశ్రమ విదేశీ పత్తిపై అధికంగా ఆధారపడే పరిస్థితి వస్తుందనీ, దాంతో విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పెరుగుతుందని వారు కేంద్రాన్ని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జన్యుమార్పిడి పత్తి విత్తనాలపై విదేశీ కంపెనీలకు భారత్‌ ‌భారీగా రాయల్టీలు చెల్లిస్తున్న విషయాన్ని కూడా నిపుణులు, విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -