హత్యకు రూ.15 లక్షల సుపారీ
లాయర్ ఇల్లు, అతను తిరిగే ప్రాంతాల్లో రెక్కీ
ఏడుగురు నిందితుల అరెస్టు..
వారి నుంచి రూ.10.10 లక్షలు, మొబైల్ ఫోన్లు,
స్కార్పియో సీజ్ : హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. హత్యను ప్రమాదంలా చిత్రీకరించేందుకు కుట్ర పన్నారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఐసీసీలో శుక్రవారం మీడియా సమావేశంలో కేసు వివరాలను సీపీ వెల్లడించారు. ప్రధాన నిందుడు ముజాహిద్ ఆలంఖాన్ కుటుంబానికి, మృతుడు ఖాజా మొయిజుద్దీన్‌కు మధ్య మలక్‌పేట, లక్డీకాపూల్‌లోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణ విషయంలో పాత గొడవలు ఉన్నాయి. వీరి మధ్య కొన్నేండ్లుగా సివిల్, క్రిమినల్, వక్ఫ్ ట్రిబ్యునల్ కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ అడ్డు తొలగించుకోవాలని ముజాహిద్ ఆలంఖాన్, అతని తండ్రి మెహబూబ్ ఆలంఖాన్ నిర్ణయించుకున్నారు. తమ సన్నిహితులైన హసన్ అలీ, మునీర్, కిషన్ అలియాస్ పప్పును సంప్రదించారు. కిషన్ ఈ పని కోసం వినయ్, విక్రమ్, అభిజిత్, మనిదీప్ అనే వ్యక్తులను ఒప్పించాడు. మొత్తం 10 మంది కలిసి ఒక ముఠాగా ఏర్పడ్డారు. ఈ హత్యకు రూ.15 లక్షల సుపారీ (కాంట్రాక్ట్) కుదుర్చుకున్నారు. పథకంలో భాగంగా హత్య కోసం స్కార్పియో వాహనం కొనుగోలు చేయడానికి ముజాహిద్ ఆలం ఖాన్ రూ. 2 లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. ఈ ఏడాదీ జనవరి నుంచి నిందితులు న్యాయవాది ఇంటి వద్ద, అతను తిరిగే ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు. ఈ హత్య ప్రమాదకరంగా కనిపించేలా ఈ నెల 23న ఉదయం మొయిజుద్దీన్ స్విమ్మింగ్‌కు వెళ్తుండగా అక్కడే మాటు వేసిన నిందితులు నెంబర్ ప్లేట్ లేని స్కార్పియో వాహనంతో ఢీకొట్టి హత్య చేశారు. ఆ తర్వాత సాక్ష్యాలను చెరిపివేసేందుకు ప్రయత్నించి వివిధ ప్రాంతాలకు పరారయ్యారు. హత్యపై మృతుడి కుమారుడు ఎంఎస్. ఫర్హాన్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘మే 23న తెల్లవారుజామున 5:45 గంటల సమయంలో తన తండ్రి ఖాజా మొయిజుద్దీన్ స్విమ్మింగ్ కోసం వెళ్లేందుకు మాసబ్ ట్యాంక్‌లోని తన నివాసం బయట కారు వద్దకు వెళ్లారు. అదే సమయంలో అతివేగంగా వచ్చిన ఒక అపరిచిత వాహనం ఆయనను ఉద్దేశపూర్వకంగా బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మా తండ్రి సుమారు 10 మీటర్ల దూరంలో పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను అబిడ్స్‌లోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతిచెందారు’ అని ఫిర్యాదులు పేర్కొన్నారు. విచారణ చేపట్టిన పోలీసులు సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. డ్రైవర్ అభిజిత్ అలియాస్ నాని వాహనం నడిపి హత్య చేసినట్టు గుర్తించారు. ముందుగా హరియాణాలోని పానిపట్‌లో కిషన్ అలియాస్ పప్పును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తెలిపిన ఆధారాల మేరకు పోలీసులు సికింద్రాబాద్ లోని పంచవటి లాడ్జ్, నారాయణగూడలోని మెహఫిల్ హోటల్ వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ప్రధాన స్రూతధారి ముజాహిద్ ఆలం ఖాన్, మెహబూబ్ ఆలం ఖాన్ ను జూబ్లీహిల్స్‌లో వారి నివాసంలో అరెస్టు చేశారు. వినయ్, విక్రమ్, అభిజిత్, మనిదీప్‌ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.10.10 లక్షలు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, హత్యకు ఉపయోగించిన స్కార్పియో వాహనాన్ని సీజ్ చేశామని సీపీ తెలిపారు. నిందితుల్లో మరికొంత మంది పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు కొనసాగుతోందని సీపీ తెలిపారు. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసిన అబిడ్స్ ఏసీపీ పి.ప్రవీణ్ కుమార్, నాంపల్లి ఇన్‌స్పెక్టర్ సిహెచ్. సైదులు, ఎస్ఐ ఆదిల్ రియాజ్ ఖాన్ తోపాటు సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు.



