ఆరు రెట్లు పెరిగిన డాలర్ల చెల్లింపు 20 శాతం పెరిగిన ఫేక్ కరెన్సీ
రూపాయి పతనం ఫలితం
వృద్ధి రేటు 6.9 శాతమే
ఆర్బీఐ వార్షిక నివేదిక వెల్లడి
ముంబయి : మోడీ ఆర్థిక విధానాలు విదేశీ మారకం నిల్వలకు చిల్లు పెడుతున్నా యి. వాణిజ్య లోటు పెరగడం, విదేశీ అప్పుల చెల్లింపులతొ దేశం నుండి డాలర్లు భారీగా బయటకు తరలిపోతున్నాయి. ఈ పరిణామంపై ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు ఆందోళనలో ఉన్నాయని స్పష్టమవుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశం నుండి బయటకు వెళ్లిన మొత్తం డాలర్ల పరిమాణం.. లోపలికి వచ్చిన వాటి కంటే 30.8 బిలియన్ డాలర్లు ఎక్కువ (దాదాపు రూ.2.90 లక్షల కోట్లు)గా ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆరు రెట్లకు పైగా పెరగడం తీవ్ర ఆందోళకరం.
ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆమోదించిన ‘ఆర్బీఐ వార్షిక నివేదిక 2025-26’ను శుక్రవారం విడుదల చేసింది. ఆ వివరాలు.. 2023-24 వరకు డాలర్ చెల్లింపులు మిగులుగా ఉన్నాయి. గడిచిన రెండేండ్ల లో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో పెరిగిన వాణిజ్య లోటుకు తోడు భారత్‌లోకి వచ్చే నికర విదేశీ పెట్టుబడులు భారీగా క్షీణించాయి. దీంతో 2025-26లో చెల్లింపుల సమతుల్యత లోటు మరింత పెరిగింది. ఈ లోటును పూర్తిగా ఆర్బీఐ విదేశీ మారక నిల్వల నుంచి చెల్లించారు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు 2026 మే 22తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు మరోసారి భారీగా క్షీణించాయి. ఈ ఒక్క వారంలోనే నిల్వలు 7.51 బిలియన్ డాలర్లు తగ్గి 681.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకులు, అంతర్జాతీయ పరిణామాల మధ్య రూపాయి విలువను స్థిరంగా ఉంచేందుకు ఆర్బీఐ డాలర్లను విక్రయించడం దీనికి ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
రూ.500 నోట్లకు డిమాండ్
2025-26లో బ్యాంకింగ్ వ్యవస్థలో చలామణిలో ఉన్న రూ.500 నోట్ల సంఖ్య 11.2 శాతం పెరిగింది. 2025 మార్చి నాటికి 6,34,458 లక్షలుగా ఉన్న ఈ నోట్ల సంఖ్య, 2026 మార్చి నాటికి 7,05,482 లక్షలకు చేరుకుంది. విలువ పరంగా చూస్తే ఇవి రూ.31.72 లక్షల కోట్ల నుంచి రూ.35.27 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో సంఖ్యాపరంగా 41.2 శాతం వాటా, విలువ పరంగా ఏకంగా 86 శాతం వాటా ఒక్క రూ.500 నోటుదే కావడం గమనార్హం. కాగా.. సంఖ్యాపరంగా రూ.10 నోటు 16.1 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే బ్యాంకింగ్ వ్యవస్థలో చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ 11.9 శాతం, సంఖ్య 10.5 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థలో నగదుకు ఉన్న డిమాండ్‌ను సూచి స్తోంది. కేవలం ఏడాదిలో నకిలీ నోట్లు 20 శాతం పెరుగుదల బ్యాంకింగ్ వ్యవస్థను నకిలీ నోట్ల బెడద తీవ్రంగా వేధిస్తోందని ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో అందు బాటులో ఉన్న ఏకైక పెద్ద నోటు రు.500. ఇపుడు దీనికి డూప్లికెట్ తయారు చేసేస్తున్నారు. మార్కెట్ లలో సర్కులేట్ అవుతూనే ఉన్నది.
ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్ల చలామణి గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 20 శాతం పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం లో 1,17,722 నకిలీ రూ.500 నోట్లను గుర్తించగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 1,41,907 నోట్లకు చేరింది. వీటితో పాటు 2025-26లో 30,591 నకిలీ రూ.200 నోట్లను కూడా అధికారులు గుర్తించారు. మొత్తంగా బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ నోట్ల బెడద 5.7 శాతం మేర పెరిగినట్టు ఆర్బీఐ పేర్కొంది. మరోవైపు, 2023 మే నెలలో ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లలో.. 2026 మార్చి 31 నాటికి 98.45 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్టు కేంద్ర బ్యాంకు తన నివేదికలో స్పష్టం చేసింది. నకిలీ నోట్లను నివారించడంలో బిజెపి సర్కార్ విఫలమవుతుం దని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చు..
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు సవాలు విసురుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా నిలబడనుందని ఆర్బీఐ పేర్కొంది. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం, ఎగుమతుల మందగమనం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ మెరుగైన దేశీయ డిమాండ్ కారణంగా ప్రస్తుత 2026-27లో భారత వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కానుందని అంచనా వేసింది. 2025-26లో కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల మిగులు నిధిని డివిడెండ్‌గా బదిలీ చేసేందుకు ఆర్బీఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఇది ఇంతక్రితం ఏడాది బదిలీ చేసిన రూ.2.69 లక్షల కోట్ల కంటే 6.7 శాతం ఎక్కువ. దేశీయ పెట్టుబడులు, బంగారం, విదేశీ పెట్టుబడులు భారీగా పెరగడంతో 2026 మార్చి 31 నాటికి ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం ఏకంగా 20.61 శాతం పెరిగి రూ.91.97 లక్షల కోట్లకు చేరింది. కాగా.. ఆర్బీఐవద్ద ప్రస్తుతం ఉన్న మొత్తం బంగారం నిల్వలు 880.52 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ఆర్బీఐ చేసిన ఖర్చు భారీగా తగ్గింది. నోట్ల ముద్రణ కోసం 2024-25లో రూ.6,372.82 కోట్లు ఖర్చు అవ్వగా, డిజిటల్ లావాదేవీల పురోగతి నేపథ్యంలో ఈసారి ఆ ఖర్చు రూ.4,875.20 కోట్లకు తగ్గింది. ఇక దేశంలో సామాన్యుడిని వేధించే ద్రవ్యోల్బణం 4.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఆర్బీఐ అంచనా వేసింది.
నోట్లరద్దు నిర్ణయంతో
నోట్లరద్దు నిర్ణయం తీసుకున్నట్టు మోడీ ప్రకటించి..పదేండ్లు దాటినా ఇప్పటికీ భారతీయ ప్రజల్ని వెంటాడుతూనే ఉన్నది. దేశంలోకి అతిపెద్ద నోటు రూ.రెండు వేలు , రూ.500 నోట్లను తెచ్చినపుడు కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఓ ప్రకటన చేసింది. ఈ పెద్ద నోట్లను ముద్రించటం అసాధ్యమని, సరిహద్దుల్లో నుంచి వచ్చే నకిలీ కరెన్సీకి కళ్లెం వేస్తామని పెద్దపెద్ద మాటలే అన్నది. చివరికి తేలిదేమిటంటే.. అప్పట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంచటానికి యుద్ధ విమానాల్లో మోడీ ప్రభుత్వం రూ.రెండు వేల నోట్లను తరలించిందని స్పష్టమైంది. అంతేకాదు పెద్ద నోట్లపై ఇచ్చిన భరోసా కూడా గాల్లో కలిసిపోయింది. ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ నుంచి అత్యధికంగా నకిలీ నోట్ల ముద్రణ జరిగినట్టు ఎన్ సీ ఆర్బీ రిపోర్టులే ధ్రువీకరించాయి. నెమ్మదిగా రూ.2,000 నోట్ల ఉపసంహరణ తర్వాత మార్కెట్‌లో రూ.500 నోట్లకు డిమాండ్ భారీగా పెరిగింది.



