భవిష్యత్‌లో మోటర్లకు మీటర్లు పెట్టి సబ్సీడీలు ఎత్తివేసే కుట్ర
ఈఆర్‌సీ ఎదుట సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్‌ఎస్,
ప్రజా సంఘాల అభ్యంతరాలు
రైతులకు మెరుగైన విద్యుత్ కోసమే మూడో డిస్కం
అనుమతించాలని కాంగ్రెస్ విజ్ఞప్తి
పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి…ఈ తర్వాతే ముందుకెళ్లాలి
విద్యుత్ ఉద్యోగ సంఘాల వినతి
వాడి, వేడిగా సాగిన రైతు డిస్కం బహిరంగ విచారణ
ఈఆర్‌సీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయబోయే రైతు డిస్కం అనుమతులపై తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) శుక్రవారం హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్ నగర్‌లోని విద్యుత్ నియంత్రణ్ భవన్‌లో బహిరంగ విచారణ నిర్వహించింది. మండలి చైర్మెన్ జస్టిస్ దేవరాజు నాగార్జున్, సభ్యులు చెరుకూరి శ్రీనివాసరావు, కంచెర్ల రఘు బహిరంగ విచారణ నిర్వహించారు. రైతులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. విచారణ ప్రారంభంలో తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీఆర్‌పీడీసీఎల్) చైర్మెన్ ముషారఫ్ అలీ ఫారుఖీ డిస్కం ఏర్పాటు, నిర్వహణ, ఆర్థిక స్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం తెలంగాణలోని రెండు డిస్కంలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని పేర్కొన్నారు. 2025 ఆర్థిక సంవత్సరం నాటికి తెలంగాణ డిస్కంల సమీకృత నష్టాలు సుమారు రూ.69,741 కోట్లు కాగా, ప్రభుత్వ విభాగాల నుంచి రూ.54,090 కోట్లు రావాల్సి ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది విద్యుత్ వినియోగ నష్టాలు 19.8 శాతంగా నమోదయ్యాయన్నారు. రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను కొంత మంది పక్కదారి పట్టిస్తున్నారని చెప్పారు. వీటన్నింటికి చెక్ పెట్టడంతో పాటు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామనీ, దీనికి సంబంధించిన అనుమతులను మంజూరు చేయాలని ఈర్సీకి విజ్ఞప్తి చేశారు. ఒప్పందం ప్రకారం విద్యుత్ లైన్లు, డీటీఆర్‌లు, వ్యవసాయ పంపుసెట్ల బదిలీకి ఎలాంటి అభ్యంతరం లేదని ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ సీఎండీలు జితేష్ వి.పాటిల్, వరుణ్‌రెడ్డి తెలిపారు. అనంతరం బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు ఎస్.నిరంజన్‌రెడ్డి, ఎం.జగదీశ్‌రెడ్డి తమ వాదనలు వినిపించారు. సబ్సీడీలను ఎత్తివేసేందుకే సర్కార్ రైతు డిస్కం ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు.
ప్రస్తుత సమీకృత వ్యవస్థలో లేని అదనపు ప్రయోజనం ఈ కొత్త సంస్థ ద్వారా ఏమొస్తుందో అటు రైతులకు, ఇటు విద్యుత్ వినియోగదారులకు అర్థం కావడం లేదని విమర్శించారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కేవలం వ్యవసాయ వినియోగదారుల కోసం ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేయలేదన్నారు. రైతులకు నిరంతరాయంగా ఉచిత విద్యుత్ అందిస్తున్న తెలంగాణ విద్యుత్ రంగాన్ని ప్రమాదకరమైన పునర్వ్యవస్థీకరణ ప్రయోగానికి గురిచేస్తున్నారనీ, రైతు డిస్కం ప్రతిపాదన వెనుక అనుమానాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు డిస్కం నిజం అయితే మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, మున్సిపల్ నీటి సరఫరా వ్యవస్థలను కూడా ఒకే సంస్థ పరిధిలోకి ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. ఈఆర్సీసీ రైతు డిస్కంకు అనుమతించొద్దని డిమాండ్ చేశారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అరిబండి ప్రసాదరావు మాట్లాడుతూ తెలంగాణలో డిస్కంల నష్టాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలే కారణమన్నారు. రూ.5 కోట్ల మూల ధన పెట్టుబడి, రూ.29 వేల కోట్ల మైనస్‌లో ఉన్న సంస్థ రైతులకు ఎలా సేవలందిస్తుందని ప్రశ్నించారు. విద్యుత్ డిమాండ్ ఉన్నప్పుడు రైతు డిస్కంకు కష్టాలు తప్పవని హెచ్చ రించారు. తెలంగాణ యునైటెడ్ ఎలక్ర్టిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్‌రావు మాట్లాడుతూ 2003 విద్యుత్ సవరణ చట్టానికి లోబడి సబ్సీడీలను రద్దు చేయడం, క్రమంగా ప్రయివేటీకరించడమే ఎజెండాగా సర్కార్ చర్యలున్నాయని విమర్శించారు. ఉచితాలన్నీ మూడో డిస్కంకు పోతే క్రాస్ సబ్సీడీలపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ రైతు డిస్కమ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం రైతులపై కుట్ర చేస్తోందని విమర్శించారు.
రైతులకు అన్యాయం చేస్తూ 1999 నాటి కాల్పుల ఘటనను ప్రభుత్వం కొని తెచ్చుకోవద్దని హెచ్చరించారు. తెలంగాణ రైతాంగం భవిష్యత్ ను ఆగం చేసే ఈ ప్రపోజల్ ను ఈఆర్సీ రిజెక్ట్ చేయాలని కోరారు. కాంగ్రెస్ తరపున ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తమ వాదనలు వినిపించారు. రైతు డిస్కం ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలు ఊహాజనితంగా మాట్లాడుతున్నాయని విమర్శించారు. రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ప్రభుత్వం రైతు డిస్కం ఏర్పాటు చేసిందని స్పష్టం చేశారు. 2014లోవిద్యుత్ బకాయిలు రూ.1,595 కోట్ల నుంచి రూ.31,698 కోట్లకు ఎలా వచ్చాయో బీఆర్‌ఎస్ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. పదేండ్ల గత సర్కార్ పాలనలో నిర్వీర్యం అయిన విద్యుత్ రంగాన్ని గాడిన పెట్టేందుకే రైతు డిస్కం ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలని ఏర్పాటు చేస్తున్న రైతు డిస్కంకు అనుమతులు మంజూరు చేయాలని వారు ఈఆర్సీని కోరారు. విద్యుత్ ఇంజినీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివాజి మాట్లాడుతూ డిస్కం ఏర్పాటు తర్వాత ఏర్పడే సమస్యలపై ఉద్యోగులతో చర్చించడంతో పాటు పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఫలితాల తర్వాతే నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విచారణలో రైతులు, రైతు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
రైతు డిస్కం ఏర్పాటు వెనక భారీ కుట్రకోణం దాగుందనీ, తెలంగాణ విద్యుత్ రంగాన్ని ప్రయివేటీకరించేందుకే ఈ డిస్కంను ఏర్పాటు చేస్తున్నారని సీపీఐ(ఎం), సీపీఐ, బీఆర్‌ఎస్, టీఆర్‌ఎస్‌తో పాటు ప్రజా సంఘాలు విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణలో ఆందోళన వ్యక్తం చేశాయి. 2003 విద్యుత్ సవరణ చట్టం అమలుకు లోబడి తాత్కాలిక ప్రయోజనాల కోసం రైతాంగానికి రాష్ట్ర సర్కార్ ద్రోహం చేస్తోందని ఆరోపించాయి. డిస్కంను అనుమతించొద్దని విన్నవించగా, కాంగ్రెస్ మాత్రం స్వాగతించింది. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకే మూడో డిస్కంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని స్పష్టం చేసింది. రైతాంగ ప్రయెజనాల దృష్ట్యా అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. డిస్కం ఏర్పాటు తర్వాత ఏర్పడే సమస్యలపై ఉద్యోగులతో చర్చించడంతో పాటు పైలట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చే ఫలితాల తర్వాతే చేపట్టాలని ఉద్యోగ సంఘాలు విన్నవించాయి. తెలంగాణ విద్యుత్ రంగంలోనే కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్న మూడో డిస్కం అనుమతిపై ఈఆర్‌సీ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
కొత్త డిస్కం అవసరం లేదు
ఎమ్ వేణుగోపాల్‌రావు, విద్యుత్ రంగ నిపుణులు
తెలంగాణలో ప్రస్తుతమున్న రెండు డిస్కంల సిబ్బందిని సర్దుబాటు చేసి ఏర్పాటు చేస్తున్న రైతు డిస్కంతో రైతులకు పెద్దగా ప్రయోజనముండదు. ఆర్థిక పరిస్థితిపై ఎక్కడా స్పష్టమైన విధివిధానాలను పొందు పర్చలేదు. ఖరీదైన థర్మల్ విద్యుత్‌ను కేటాయించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. రూ.29 వేల కోట్లు ఎలా చెల్లాస్తారో చెప్పలేదు. కేటాయించిన మ్యాన్ పవర్ సరిపోరు. కేరళ తరహా బండిల్ సిస్టమ్ ఉన్నా రాష్ట్రాల్లో మంచి ఫలితాలున్నాయి. ఇప్పుడున్న రెండు డిస్కంలను మరింత మెరుగు పర్చితే సరిపోతుంది. ఈ క్రమంలో రైతు డిస్కంపై తొందర పడి నిర్ణయం తీసుకోరాదని ఈర్సీకి విజ్ఞప్తి చేశారు.
రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుంది
కోదండరెడ్డి, రైతు కమిషన్ చైర్మెన్
రాష్ట్రంలో 24 గంటలు విద్యుత్ అందుబాటులో ఉండాలి. అయితే రైతులకు మాత్రం 3 గంటల నాణ్యమైన విద్యుత్ సరిపోతుంది. ప్రతి పక్షాలు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నాయి. కొత్త డిస్కం ఏర్పాటులో ఏమైనా పొరపాట్లు ఉంటే సవరణలు ప్రతిపాదించండి. అంతే గాని గుడ్డిగా వ్యతిరేకించొద్దు. రైతు డిస్కం తెలంగాణ రైతాంగానికి గర్వకారణం. ఈ క్రమంలో మూడో డిస్కంకు అనుమతులు మంజూరు చేయాలని ఈఆర్సీని కోరారు.



