రైతులు ఆందోళన చెందొద్దు
అబద్దపు ప్రచారాన్ని నమ్మొద్దు
తడిసిన ధాన్యం 9 వేల మెట్రిక్ టన్నులు కొన్నాం
ధాన్యం సరఫరాకు ఇసుక, సిమెంట్ లారీలు, డీసీఎంలను సమకూర్చాం
రెండు లక్షల మంది సిబ్బంది పని చేస్తున్నారు
బీజేపీది రైతు ఘోష యాత్ర కాదు…
అధికార ఘోష యాత్ర : మంత్రులు
ఎన్ ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఇటీవల కురిసిన వర్షాలకు తడిన తడిసిన ధాన్యాన్ని 9వేల మెట్రిక్ టన్నులను కొన్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. ధాన్యం సరఫరాకు ఇసుక, సిమెంట్ లారీలు, డీసీఎంలను సమకూర్చామని తెలిపారు. ధాన్యం సేకరణలో దాదాపు రెండు లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. 2008 రైస్ మిల్లులలకు 13వేల వాహనాల ద్వారా సరఫరా చేస్తున్నామని తెలిపారు. 20.86 కోట్ల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. కానీ ప్రతిపక్షాలు ధాన్యం సేకరణలో దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ రఘురామ్‌రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి మంత్రి విలేకర్లతో మాట్లాడారు. స్వతంత్ర భారత దేశంలోనే ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అత్యధిక ధాన్యాన్ని సేకరించిందని గుర్తు చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే తన నివేదికల్లో పేర్కొందని తెలిపారు. పదేండ్ల కాలంలో సేకరించిన పోల్చితే ఎక్కువగా కాంగ్రెస్ ప్రభుత్వం సేకరించిందన్నారు. కేంద్రం సర్కారు నిర్ణయించిన మద్దతు ధర నిబంధలు పాటిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు. అయినా రూ. 16,479 కోట్లు అదనంగా చెల్లించి కొనుగోలు చేశామని చెప్పారు. కాళేశ్వరం, సుందిళ్ల రిజర్వాయర్ ఉపయోగించకుండానే అత్యధిక పంట ఉత్పత్తి జరుగుతోందన్నారు. చివరి గింజా వరకు కొనుగోలు చేస్తామన్నారు. యాసంగిలో 1.41 లక్షల మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తి అవుతోందనీ, అందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల సేకరిస్తామన్నారు. కానీ 52 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకుంటాం. మిగతాది తీసుకోలేమంటూ కేంద్రం మెలిక పెట్టిందని విమర్శించారు. తడిసిన ధాన్యాన్ని కొని కూడా బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తున్నామన్నారు. తెలంగాణలో కూలీలు పని చేయడం లేదనీ, పూర్తిగా బీహర్ హమాలీలపై ఆధారపడి ఉందన్నారు. బీహార్‌లో వ్యవసాయ సీజన్ ప్రారంభం కావడం, బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో కూలీల కొరత ఏర్పడిందన్నారు. ధాన్యం కొనుగోళ్లకు బీఆర్‌ఎస్ సర్కారు రూ. 15వేల కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి రూ. 49వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. గత ప్రభుత్వం 7వేల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ సర్కారు 8575 కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్లకు 2024-25లో రూ. 36,143 కోట్లు, 2025-26లో రూ.39,359 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. ఆ సొమ్మును 48 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు.
బీజేపీ నేతలు బరితెగించి బజారులో తిరుగుతున్నారు: తుమ్మల
బీజేపీ నేతలు రైతు ఘోష పేరిట బరితెగించి బజారుతో తిరుగుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని ఢిల్లీ యాత్ర చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలది రైతు ఘోష యాత్ర కాదు… అధికార ఘోష యాత్ర అని ఎద్దేవా చేశారు. రైతులు కష్టాల్లో ఉంటే డీజిల్ సరఫరా చేయలేదని విమర్శించారు. దీంతో రైతులు చాలా ఇబ్బందిపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా సరఫరా విషయంలో కేంద్రం రైతులను ఘోస పెట్టిందని విమర్శించారు. దీనికి బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అమెరికాతో కేంద్రం వాణిజ్య ఒప్పందం చేసుకోవడంతో రైతుల గొంతు కోసిందన్నారు.



