ఎన్‌టీఏకు సుప్రీం ప్రశ్నలు
లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందే
ఇలాంటి ఘటనలు విద్యార్థులు, తల్లిదండ్రులకు తీవ్ర మానసిక క్షోభ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో
నీట్ పేపర్ లీక్ ఉదంతంపై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)పై పలు ప్రశ్నలు సంధించింది. ఇన్ని నిఘా వ్యవస్థలు, పర్యవేక్షణ కమిటీలు ఉన్నా పేపర్ ఎలా లీకైందని ప్రశ్నించింది. ఇలాంటి ఘటనలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తీవ్ర మానసిక క్షోభ కలిగిస్తుందని పేర్కొంది. పేపర్ లీక్ విషయంలో లోపాలకు జవాబుదారీతనం ఉండాల్సిందేనని, అప్పటివరకు అసలు సమస్య ఆగదని అసహనం వ్యక్తం చేసింది. సివిల్స్ పరీక్షలు నిర్వహించే యూపీఎస్‌సీలో ఇలాంటి ఉదంతాలు ఎప్పుడూ వెలుగుచూడలేదని సర్వోన్నత న్యాయస్థానం తెలిపింది. యూపీఎస్సీని చూసి నేర్చుకోవాలని ఎన్‌టీఏకు సూచించింది. కోర్టు విచారణకు ఎన్‌టీఏ తరఫున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, నీట్ వ్యవస్థ ప్రక్షాళనకు ఏర్పాటైన హైలెవెల్ కమిటీ చైర్మెన్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు దాఖలు చేసిన అఫిడవిట్‌లను ధర్మాసనం పరిశీలించింది. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఆరు వారాల అదనపు గడువు ఇచ్చింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ పి.ఎస్ నరసింహ స్పందిస్తూ అనేక రక్షణలను ఏర్పాటు చేసినా పేపర్ లీక్‌కు ఆస్కారం కల్పించిన పరిస్థితులు ఏమిటని రాధాకృష్ణన్‌ను ప్రశ్నించారు. ఇందుకు రాధాకృష్ణన్ బదులిస్తూ పేపర్ సెట్టింగ్ ప్రక్రియలో సమస్య తలెత్తిందని, ప్రస్తుతం ఆ లోపాలనూ సరిదిద్ది వ్యవస్థను మరింత బలోపేతం చేశామన్నారు. మరోసారి ఇలాంటివి జరగవని, సంస్కరణలే తమ లక్ష్యమని వెల్లడించారు. కేవలం సంస్కరణలతో పరిస్థితి చక్కబడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తప్పు జరిగినప్పుడు బాధ్యత ఎవరు తీసుకుంటారనేది తేల్చకుండా ఎన్ని కమిటీలు, మీటింగ్‌లు ఏర్పాటు చేసిన ఫలితం ఉండదని వ్యాఖ్యానించింది.
ఈ అంశంపై సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్పందిస్తూ పేపర్ లీక్‌పై విచారణ జరుగుతోందన్నారు. జూన్ 21న నిర్వహించనున్న పరీక్ష కోసం కొత్త వ్యవస్థలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుందని, ప్రధానమంత్రి స్వయంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
నీట్ లీక్ పై నిలదీత
- Advertisement -
- Advertisement -


