నిర్మాణ పనుల్లో ఉన్న ఆరుగురు కూలీల మృతి,
చిక్కుక్కున మరో ముగ్గురు
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అంతులేని అవినీతి, కనిపించని నాణ్యత
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలో గురువారం రాత్రి నిర్మాణంలో ఉన్న వంతెన అమాంతంగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొరకందర్ నుండి కందౌర్ గ్రామం వరకు విస్తరించి ఉన్న ఈ వంతెనను బెట్వా నదిపై నిర్మిస్తు న్నారు. వంతెన వద్ద పనులు జరుగుతున్న సమయంలో, అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వర్షం కురుస్తున్నప్పటికీ కొంతమంది కార్మికులు హైడ్రా యంత్రం కింద నిలబడి ఉన్నారు. అమాంతంగా వారిపై వంతెన కూల టంతో ప్రమాదం సంభవించింది. “శుక్రవారం తెల్లవారు జామున నిర్మాణ ప్రాంతంలో ఒక స్లాబ్ కూలిపోయిందని, దాని కింద కొంతమంది చిక్కుకుపోయారని సమాచారం అందిన వెంటనే మేము సంఘటనా స్థలానికి చేరుకున్నాం” అని హమీర్‌పూర్ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ) అరవింద్ కుమార్ వర్మ విలేకరులకు తెలిపారు. “ఎస్డీఆర్ఎఫ్ ఇక్కడ ఉంది, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి,” అని ఆయన తెలిపారు. స్థానికుల కథనం ప్రకారం, గ్రామాన్ని తుఫాను తాకి నప్పుడు వంతెన వద్ద పనులు జరుగుతున్నాయి. మొదట, వంతెన భాగాలు విరిగిపోయాయి, ఆ తర్వాత ఆధార స్తంభాలు కూలిపోయాయి.
“నిన్న అర్ధరాత్రి సమయంలో, చాలా తుఫాను వచ్చింది. మేమందరం మేల్కొన్నాం. మా గ్రామానికి సుమారు 400 మీటర్ల దూరంలో ఒక వంతెన నిర్మిస్తున్నారు. రాత్రంతా పనులు జరిగాయి. తుఫాను కారణంగా, భాగాలు విరిగి పడిపోయాయి. ఫలితంగా, ఆధార స్తంభాలు కూడా విరిగిపోయి, అన్ని భాగాలు కూలిపోయాయి. వంతెనను కాపాడుతున్న మా ఇద్దరు గార్డులు నలిగిపోయి మరణించారు. ఈ ఘటనలో నలుగురు కూలీలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు . ఇద్దరి ఆచూకీ లభించింది, మరో ఇద్దరు చిక్కుకుపోయినట్టు భావిస్తున్నారు. ఈ ప్రమాదం తుఫానే వల్ల జరిగినట్టు తెలుస్తోంది,” అని ఒక స్థానిక నివాసి మీడియాకు తెలిపారు. మృతులలో అతి చిన్న వయస్కుడిని ఉత్తరప్రదేశ్‌లోని బందా జిల్లా, చిల్లా గ్రామానికి చెందిన 19 ఏండ్ల కుల్దీప్ నిషాద్‌గా గుర్తించారు. బాధితులైన ఆరుగురిని ఈ విధంగా గుర్తించారు. వారిలో లోకేంద్ర (22) రాధేశ్యామ్ నిషాద్ కుమారుడు, చిల్లా నివాసి, కుల్దీప్ నిషాద్ (19) ప్రేమ్‌చంద్ కుమారుడు, సావంత్ యాదవ్ (28) భూరగఢ్ నివాసి, సభజిత్ (30) బాందా జిల్లా, భూరగఢ్ వాసి పుష్పేంద్ర సింగ్ చౌహాన్ (34) రాజేంద్ర సింగ్ కుమారుడు, స్వసా ఖుర్ద్ నివాసి .రాజేష్ పాల్ (42) అచ్‌పురా వాసి లు ఉన్నారు. రెండు మృతదేహాలను వెలికితీశారు, కాగా మరో నలుగురు ఇంకా చిక్కుకునే ఉన్నారు. స్తంభంపై చిక్కుకుపోయిన మరో ముగ్గురిని అవధేష్ నిషాద్, కల్లు యాదవ్, రాజేష్ నిషాద్‌గా గుర్తించారు.
“మరో ఇద్దరు కూలీలను రక్షించాము, అయితే ఒకరు ఇంకా చిక్కుకునే ఉన్నారు; ఆయన్ని రక్షించేందుకు ప్రయత్నాలు కొన సాగుతున్నాయి,” అని హమీర్‌పూర్ సర్కిల్ ఆఫీసర్ రాజేష్ కమల్ తెలిపారు. అయితే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కట్టిన నిర్మాణాలే కాదు. కడుతున్నవి కుప్పకూలిపోతున్నాయి. గుజరాత్ నుంచి బీహార్, ఇపుడు యూపీలోనూ నిర్మాణంలో ఉన్న వంతెన కూలటంతో..అమాయకులైన కూలీలు, సెక్యూరిటీ గార్డుల ప్రాణాలు గాల్లో కలిసిపోయారు. రాజకీయ నేతలు, అధికార అవినీతి వెరసి కోట్లు వెచ్చించి నిర్మిస్తున్న నిర్మాణాలు కాస్త పేకమేడల్లా కూలిపోతున్నాయి. కార్మికుల కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి.



