Saturday, May 30, 2026
E-PAPER
Homeజాతీయంసిద్ధరామయ్య రాజీనామా ఆమోదం

సిద్ధరామయ్య రాజీనామా ఆమోదం

- Advertisement -

ఢిల్లీలో కర్నాటక నేతల ప్రదక్షిణలు
నేడు సీఎల్పీ భేటీ

బెంగళూరు : కర్నాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ ఆమోదించారు. ఆయన మధ్యప్రదేశ్ పర్యటనలో ఉండటంతో గురువారం లోక్‌భవన్‌కు వెళ్లిన సిద్ధరామయ్య తన రాజీనామా లేఖను గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ప్రభుశంకర్‌కు అందజేసిన విషయం తెలిసిందే. అనంతరం అర్ధరాత్రి బెంగళూరుకు చేరుకున్న గవర్నర్ శుక్రవారం ఉదయం అధికారికంగా సిద్ధరామయ్య రాజీనామాను ఆమోదించారు. అదే సమయంలో సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్టు గవర్నర్ లోక్‌భవన్‌ నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు సిద్ధరామయ్య తాత్కాలిక ముఖ్యమంత్రిగా కొనసాగుతారని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ అగ్రనాయకులతో సిద్ధరామయ్య భేటీ
పలువురు సీనియర్ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లిన సిద్ధరామయ్య శుక్రవారం కాంగ్రెస్ అగ్రనాయకులతో భేటీ అయ్యారు. మల్లికార్జున ఖర్గేను సిద్ధరామయ్య కలవగా, రాహుల్ గాంధీ, ఖర్గేలను డీకే శివకుమార్ కలిశారు. అనంతరం కర్నాటక తదుపరి ముఖ్యమంత్రి ఎంపికతో పాటు కొత్త మంత్రివర్గ కూర్పుపై చర్చలు జరిగినట్టు సమాచారం. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. అదే విధంగా ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులు, ఎమ్మెల్సీ స్థానాలకు పేర్లు ఖరారు చేయడంతో పాటు కొత్త మంత్రివర్గ ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించాయి.

​నలుగురు ఉప ముఖ్యమంత్రుల నియామకం!
సిద్ధరామయ్య క్యాబినెట్‌లో ఉన్న పలువురు మంత్రులకు డీకే శివకుమార్‌ నేతృత్వంలోని కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవచ్చని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వంలో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతను కాపాడేందుకు నలుగురు ఉప ముఖ్యమంత్రులను నియమించవచ్చని పార్టీ వర్గాలు సూచించాయని సమాచారం. అలాగే సిద్ధరామయ్య రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నామనే సంకేతం ఇచ్చేలా ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ యతీంద్రకు క్యాబినెట్‌లో చోటు కల్పించి కీలక శాఖ అప్పగించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ శాసనసభాపక్ష సమావేశం (సీఎల్పీ)ను శనివారం ఖరారు చేసినట్టు తెలిసింది. అనంతరం డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కర్నాటకలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్‌ రెండు స్థానాలను సులభంగా గెలుచుకునే స్థితిలో ఉండగా, మూడో స్థానంపైనా ఆధిక్యం సాధించే అవకాశమున్నట్టు సమాచారం. మూడు రాజ్యసభ స్థానాల్లో రెండు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ప్యానెల్‌ను రణదీప్‌ సుర్జేవాలా అధిష్ఠానానికి సమర్పించనుండగా, మల్లికార్జున ఖర్గేను మళ్లీ రాజ్యసభకు పంపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి సంభావ్య అభ్యర్థుల జాబితాను కూడా పార్టీ అధిష్ఠానానికి అందించనున్నారు.

జైపూర్‌లో సిద్ధరామయ్య
డీకే శివకుమార్‌ గురువారం అర్ధరాత్రి ఢిల్లీలోని చాణక్యపురిలో ఉన్న కర్నాటక భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ ఈరోజు వాతావరణం బాగా లేదు. మా సీఎం జైపూర్‌లో దిగారు. తీవ్ర గాలివానల వల్ల విమాన ప్రయాణంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది’’ అని అన్నారు. మరోవైపు జైపూర్‌లో రాజస్థాన్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లత్‌, సిద్ధరామయ్య, రణదీప్‌ సుర్జేవాలాలను విమానాశ్రయంలో కలిశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -