రేవంత్‌రెడ్డి మనుసులోని మాట బయటపెట్టిన కోదండరెడ్డి : మాజీమంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రైతులకు మూడు గంటల కరెంటు చాలు అని సీఎం రేవంత్‌రెడ్డి మనసులోని మాటను ఈఆర్సీ ముందు రైతు కమిషన్ చైర్మెన్ కోదండరెడ్డి బయటపెట్టారని బీఆర్‌ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు డిస్కం పేరిట 24 గంటల కరెంట్ కు కోత పెట్టేందుకేనా ఈ నాటకాలు అని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగం బుద్ధి చెబుతుందని పేర్కొన్నారు. అది కోదండ రెడ్డి వ్యక్తిగత అభిప్రాయం కాదనీ, రేవంత్ రెడ్డి మనసులోని ఆలోచన అని తెలిపారు. అమెరికా వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను ఇప్పుడు అమలు చేసే దిశగా కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు. పొలం అంటే ఏంటో బోరు ఆగిపోతే పంట ఎలా ఎండిపోతుందో రైతు రాత్రింబవళ్లు ఎలా కష్టపడతాడో తెలియని వాళ్లు మాత్రమే మూడు గంటల కరెంట్ చాలని మాట్లాడగలరని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుకు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంట్ ఇచ్చి వ్యవసా యాన్ని దేశానికి ఆదర్శంగా నిలబెట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదే రైతును మళ్లీ చీకట్లలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. పంట కొనుగోళ్లు చేయక రైతుల ప్రాణం తీస్తున్నారని విమర్శించారు.
24 గంటల కరెంట్ ను ప్రణాళిక ప్రకారం ఖతం పట్టిస్తున్నారని పేర్కొన్నారు. రైతు డిస్కం వెనుక దాగి ఉన్న కాంగ్రెస్ అసలు కుట్ర ఇదేనా?అని ప్రశ్నించారు. కరెంట్ కోతలతో, రైతులకు వాతలు పెట్టాలని చూస్తున్న రేవంత్ రెడ్డి కుట్రలను తెలంగాణ రైతాంగం గమనిస్తోందని తెలిపారు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్ల టార్గెట్ తగ్గించడంపై
హరీశ్‌రావు ఆగ్రహం ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని 90 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 75 లక్షల మెట్రిక్ టన్నులకు తగ్గించడంపై మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొన్ని రోజుల్లో ఏకంగా “కొనుగోళ్లు పూర్తయ్యాయి” అని ప్రకటిస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండిందని గొప్పలు చెప్తూ మరోవైపు కొనుగోలు మాత్రం 75 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితం అంటారా?అని ప్రశ్నించారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామటూనే ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ ను తగ్గించడం రైతులను మోసం చేయడం కాదా?అని అడిగారు.
వరి కుప్పల వద్ద రైతులు ప్రాణాలు కోల్పోయింది అబద్ధమా?అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి రైతులు పడిగాపులు కాచింది అబద్ధమా?అని అడిగారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతులు పడుతున్న కష్టాలు చూడాలనీ, వారి కన్నీళ్లు తుడవాలని కోరారు. మాటలు కట్టి పెట్టి, కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు.
కరెంటు కోత పెట్టేందుకే ఈ నాటకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



