Saturday, May 30, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంమతలబేంటి?

మతలబేంటి?

- Advertisement -

యూఎస్‌-ఇరాన్‌ ఒప్పందంపై ట్రంప్‌ వెనుకడుగు!
మరింత సమయం కోరిన అమెరికా అధ్యక్ష‍ుడు జాతీయ భద్రతా బృందంతో సమీక్ష‍

​ వాషింగ్టన్‌ : అమెరికా- ఇరాన్‌ ‌మధ్య తాత్కాలిక ఒప్పందం కొలిక్కి వచ్చిందనుకున్న తరుణంలో ట్రంప్‌ ‌వెనక్కి తగ్గారు. సమీక్ష‍ పేరుతో ఆయన మరికొంత సమయం కోరినట్టు సమాచారం. దీంతో అమెరికా అధ్యక్ష‍ుడి నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. ఒప్పందం విషయంలో ట్రంప్‌ ‌వెనుకడుగు వేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 60 రోజుల కాల్పుల విరమణ, అణు చర్చలపై అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం దాదాపు ఖరారైనప్పటికీ.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ చివరి నిమిషంలో మరికొంత సమయం కావాలంటూ తన నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ఒప్పందంపై వెంటనే సంతకం చేస్తామని సంకేతాలు ఇచ్చిన వైట్‌హౌస్‌ వర్గాలు.. ఇప్పుడు ‘సమీక్ష‍ అవసరం’ అంటూ వెనక్కి తగ్గడం చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌తో చర్చలు పురోగమిస్తున్నాయని, వారాంతంలోగా డీల్‌ కుదిరే అవకాశముందని ట్రంప్‌ ప్రకటించినప్పటికీ.. అదే సమయంలో అదనపు ఆంక్షలు విధించడం ఆయన వైఖరిలోని ద్వంద్వ విధానాన్ని బయటపెట్టిందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు శాంతి చర్చల మాటలు, మరోవైపు సైనిక ఒత్తిడి కొనసాగించడం ద్వారా ట్రంప్‌ రాజకీయ లాభాల కోసం పరిస్థితిని ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక అమెరికా-ఇజ్రాయెల్‌లు యుద్ధానంతరం ఇరాన్‌ను ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపరచే వ్యూహం అమలు చేస్తున్నాయని ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తాబా ఖమేనీ ఆరోపించారు. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ అనుకూల దళాల దాడులు, లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శాంతి ఒప్పందం కంటే రాజకీయ లెక్కలకే ట్రంప్‌ ప్రాధాన్యం ఇస్తున్నారా? అన్న ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

​జాతీయ భద్రతా బృందంతో సమావేశం : ట్రంప్‌
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ శుక్రవారం వైట్ హౌస్ సిట్యుయేషన్ రూమ్‌లో తన జాతీయ భద్రతా బృందంతో అత్యవసర సమావేశం నిర్వహించి, అమెరికా–ఇరాన్ మధ్య చర్చల ద్వారా సిద్ధమైన అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించారు. ఈ ఒప్పందం కుదిరితే.. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇది అత్యంత కీలక దౌత్యపరమైన పురోగతిగా భావిస్తున్నారు. ఒప్పంద ముసాయిదాలో 60 రోజుల కాల్పుల విరమణ పొడిగింపు, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్‌ జలసంధిని తిరిగి తెరవడం వంటి అంశాలపై ఇప్పటికే పెద్ద మొత్తంలో అంగీకారం కుదిరినట్టు సమాచారం. అయితే తుది నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం కావాలని ట్రంప్ మధ్యవర్తులకు తెలిపినట్టు వార్తలు వెల్లడించాయి. కాగా ట్రంప్ తన ‘ట్రూత్‌ ‌సోషల్‌’ పోస్టులో ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలను వివరించారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు, అణుబాంబు తయారు చేయబోదని స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. అలాగే హార్ముజ్ జలసంధిలో ఎటువంటి టోల్ లేకుండా, రెండు దిశల్లోనూ అంతరాయం లేని నౌకాయానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. జలసంధిలో మిగిలి ఉన్న మైన్లను ఇరాన్ తక్షణమే తొలగిండం లేదా నిర్వీర్యం చేయాలని ట్రంప్ వివరించారు. అమెరికా అమలు చేసిన నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేస్తామని, ప్రస్తుతం అక్కడ చిక్కుకుపోయిన నౌకలు తిరిగి తమ ప్రయాణాన్ని ప్రారంభించవచ్చని కూడా పేర్కొన్నారు. అయితే ఒప్పందంలో ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలకు అంగీకరించినప్పటికీ, స్పష్టమైన రాయితీలు, పరిమితులు ఇంకా లిఖితపూర్వకంగా లేవని సమాచారం. భూగర్భంలో నిల్వ చేసిన అధిక శుద్ధి యురేనియాన్ని అమెరికా, ఇరాన్, అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (ఐఏఈఏ) సమన్వయంతో వెలికి తీసి నాశనం చేస్తామని ట్రంప్ తెలిపారు. అమెరికా అధికారులు మాత్రం ఇరాన్ నుంచి మౌఖిక హామీలు లభించాయని, కానీ అసలు ప్రాముఖ్యత అధికారిక చర్చల సమయంలో కుదిరే తుది ఒప్పందానికేనని స్పష్టం చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -